అటకెక్కిన ట్రైబల్​ ఆర్ట్ స్కూల్​

  •     బడ్జెట్​కేటాయించని ​గత సర్కారు
  •     ఐటీడీఏలో నిరుపయోగంగా ఉన్న పరికరాలు 

భద్రాచలం,వెలుగు : లిపిలేని, ఆదరణకు నోచుకోని ఆదివాసీ భాష, సంస్కృతిని కాపాడేందుకు భద్రాచలం మన్యానికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్ట్ స్కూల్​ అటకెక్కింది. ట్రైబల్​ఆర్ట్​స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా గత ప్రభుత్వం బడ్జెట్​ కేటాయించలేదు. దీంతో భద్రాచలం ఐటీడీఏలో స్కూల్​ కోసం కేటాయించిన గది నిరుపయోగంగా పడిఉంది. రేపు, మాపు ఓపెనింగ్​ చేస్తామంటూ ట్రైబల్​ వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్​ కాలయాపన చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

గిరిజనుల సంస్కృతి,కళలను రక్షించాలని.. 

భద్రాచలం మన్యంలోని ఆదివాసీ కళాకారుడు సకిని రామచంద్రయ్య, అదిలాబాద్​ ఏజన్సీలో గుస్సాడీ కళాకారుడు కనకరాజుకు 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. దాంతో గిరిజన కళల గొప్పతనం దేశమంతా తెలిసివచ్చింది. ఈ నేపథ్యంలో గిరిజనుల సంస్కృతి, కళల రక్షణ కోసం బీఆర్ఎస్​ ప్రభుత్వం 2023లో ఆర్ట్ స్కూల్​ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 

ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో ఉన్న ట్రైబల్ మ్యూజియంలో ఓ గదిని కేటాయించారు. భద్రాచలం మన్యంలో దమ్మపేట, అశ్వారావుపేట, చర్ల, దుమ్ముగూడెం ఏరియాలోని ఆశ్రమ పాఠశాలల్లో డోలి, రేల, కొమ్ము నృత్యాలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ట్రైనింగ్​ ఇచ్చేందుకు ఐదు టీంలను ఎంపిక చేసి ఒక్కో టీంలో ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాల్లో నిపుణులైన కళాకారులు, వాయిద్యకారులను నియమించారు. 

ఈ స్కూల్​కు పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్యను ప్రిన్సిపల్​గా నియమించి.. ఆయనకు నెలకు రూ. 20వేల గౌరవ వేతనం ఇవ్వాలని భావించారు. శిక్షణకు ఏడాదికి రూ.15లక్షలు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు జీవో రిలీజ్​ చేసినా అప్పటి ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వకపోవడంతో స్కూల్​ ప్రారంభం కాలేదు.

గిరిజన కళలను కాపాడాలి 

ఆదివాసీలకే సొంతమైన సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆర్ట్ స్కూల్​ తెరిస్తే విద్యార్ధుల్లో తమ కళల పట్ల అవగాహన పెరుగుతుంది. 
- ముర్ల రమేష్​,కొండరెడ్ల సంఘం 
వ్యవస్థాపక అధ్యక్షులు

బడ్జెట్​ రాలే

ఆర్ట్ స్కూల్​ ఏర్పాటుకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు పంపినం. కానీ ఇంకా రిలీజ్​కాలేదు. రాగానే ఈ స్కూల్​ ప్రారంభం అవుతుంది. బడ్జెట్​ కోసం చూస్తున్నం.
- డేవిడ్​రాజ్​, ఏపీవో(జనరల్) ఐటీడీఏ