2 ఆర్టికల్స్​ నీడలో కాశ్మీర్​

2 ఆర్టికల్స్​ నీడలో కాశ్మీర్​

370, 35(ఏ) ఈ రెండు ఆర్టికల్సే  కాశ్మీర్ ను స్పెషల్ గా మార్చాయి.ఈ రెండు ఆర్టికల్సే అక్కడి జనాభాలో సగం మంది కోపానికి కారణమయ్యాయి. 370 ఆర్టికల్ ను రద్దు చేసి తీరతామని శపథం చేశారు హోం మంత్రి అమిత్ షా. అదే జరిగితే ఎదుర్కొంటామని కాశ్మీర్ లోని ప్రధాన పార్టీలు తొడగొడుతున్నాయి. దీనికి తోడు నియోజకవర్గాల విభజన ఇష్యూ కూడా ఇప్పుడు అందాల కాశ్మీరానికి తలనొప్పిగా మారింది.

జమ్మూ కాశ్మీర్ కు సొంత పాలనాధికారాన్ని  కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి తీరతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా  స్పష్టం చేయడంతో ఆర్టికల్ పై రగడ మళ్లీ  మొదటికొచ్చింది. కొంతకాలంగా జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ పై గొడవలు నడుస్తున్నాయి. ఆర్టికల్ 370 తో పాటు ఆర్టికల్ 35 (ఏ) ను రద్దు చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. పుల్వామా టెర్రరిస్టు దాడి తర్వాత ఈ డిమాండ్ జోరందుకుంది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 (ఏ) లను రద్దు చేస్తామని బీజేపీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా చెప్పింది. అసలీ రచ్చకు కారణమైన ఆర్టికల్స్ గురించి  లోతుకు వెళ్లి  చూస్తే చాలా విషయాలే అర్థమవుతాయి.

ఆర్టికల్ 370…

  • జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్పెషల్ హోదా కల్పించింది ఆర్టికల్ 370నే. దీనికి రాజ్యాంగ బద్ధత ఉంది.
  • రాజ్యాంగంలోని 21వ పార్ట్ లో  దీన్ని పొందుపరిచారు. కొన్ని ప్రత్యేక  పరిస్థితుల్లో ఇండియన్ యూనియన్ లో కాశ్మీర్ సంస్థానాన్ని విలీనం చేశారు.
  • దేశ విభజన సమయంలో కాశ్మీర్ లో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. కాశ్మీర్ రాజు హరిసింగ్ ఒక దశలో తమ సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు.  ప్రపంచ దేశాల నుంచి కూడా ఈ అంశంపై  అప్పటి భారత ప్రభుత్వం పై ఒత్తిడి ఎక్కువగా ఉంది.
  • జమ్మూ కాశ్మీర్ సంస్థానం  పాకిస్థాన్ లో కలవాలా? ఇండియన్ యూనియన్ లో విలీనమవ్వాలా ? ఈ రెండూ కాదని స్వతంత్ర రాజ్యంగాకొనసాగాలా అనే దానిపై  తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది.
  • ఈ దశలో కాశ్మీర్  ప్రత్యేకతను నిలబెట్టేలా భారత ప్రభుత్వం చూస్తుందని జవహర్ లాల్ నెహ్రూ ఇచ్చిన హామీ మేరకు ఇండియన్ యూనియన్ లో విలీనమవడానికి రాజా హరిసింగ్ అంగీకరించారు. ఈ దశలో కాశ్మీర్ కు రక్షణగా   ఆర్టికల్ 370 తెర మీదకు వచ్చింది. రాజాహరిసింగ్ దగ్గర దివాన్ గా పనిచేసిన గోపాలస్వామి అయ్యంగార్ ఈ ఆర్టికల్ ముసాయిదా ను రూపొందించారు.

ఆర్టికల్ 35 ( ఏ) :

  • జమ్మూ కాశ్మీర్ లోని  ప్రజలు అక్కడే పర్మనెంటుగా ఉండే వీలు కల్పించే ఆర్టికల్ 35 (ఏ) తీసుకువచ్చారు. కాశ్మీర్ లో ఉద్యోగాల నియామకాలు, ఆస్తుల కొనుగోళ్లు  ఈ ఆర్టికల్ ప్రకారమే జరుగుతాయి. 35 (ఏ) ద్వారా రాష్ట్ర శాసనసభ తీసుకునే ఏ నిర్ణయాన్ని  సవాల్ చేసే అధికారం ఎవరికీ ఉండదు.
  • ‘పర్మినెంట్ రెసిడెంట్స్ ’ పేరుతో ఉన్న  శాశ్వత నివాసులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి,  రాష్ట్రంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి, స్కాలర్ షిప్స్ తో పాటు సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులవుతారు.
  • 1954 లో ఈ ఆర్టికల్ ను రాజ్యాంగంలో  పొందుపరిచారు. ఆర్టికల్ 35 (ఏ) ను అక్రమమార్గంలో రాజ్యాంగంలో పొందుపరిచారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల ప్రజలకు కాశ్మీర్ లో ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ఆస్తులు కొనుగోలు చేయకుండా అడ్డు కోవడం అన్నీ రాజ్యాంగాన్ని  ఉల్లంఘించడమేనన్న ఆరోపణలు ఉన్నాయి. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని 14,19,21 ఆర్టికల్స్ ను దెబ్బతీసినట్లు  అవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సుప్రీంకోర్టులో విచారణ :

ఆర్టికల్ 35 ( ఏ) ను రద్దు చెయ్యాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆర్టికల్ 35 (ఏ) కు పార్లమెంటు ఆమోదం లేదన్నది వీరి ప్రధాన ఆరోపణ. దీంతో ఈ ఆర్టికల్ చెల్లదంటూ సుప్రీంకోర్టుకెళ్లారు. అయితే ఆర్టికల్ 35 (ఏ) కు పార్లమెంటు ఆమోదం ఉందని ప్రత్యర్థులు వాదిస్తున్నారు.

కాశ్మీర్ పార్టీల వైఖరేంటి …..?

ఆర్టికల్ 35 (ఏ) ను కాశ్మీర్ కు చెందిన ప్రధాన పార్టీలైన ‘ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ ’ (పీడీపీ), నేషనల్ కాన్ఫరెన్స్ గట్టిగా బలపరుస్తున్నాయి. కాశ్మీర్ ప్రజలకు  కాన్ స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ గా ఉపయోగపడే ఆర్టికల్ 35 (ఏ) ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే అది నిప్పుతో  చెలగాటం ఆడటమే అవుతుందని జమ్మూ  కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ  ప్రెసిడెంట్ మెహబూబా ముఫ్తీ  వాదిస్తున్నారు. ఈ ఆర్టికల్ ను తొలగించడానికి జరిగే ప్రతి ప్రయత్నాన్ని

కాశ్మీర్ ప్రజలు అడ్డుకుంటారన్నారు. కాశ్మీర్ లోని మరో కీలక పార్టీ  నేషనల్ కాన్ఫరెన్స్ కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ సొంత పాలనకు తమ పార్టీ కట్టుబడి ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత ఒమర్ అబ్దుల్లా తేల్చి చెప్పారు. ఈ గొడవల సంగతి ఎలాగున్నా  కాశ్మీర్ ప్రజలు తమకు  ప్రత్యేక హక్కులు ఉండాల్సిందేనంటున్నారు.

బీజేపీ మొదట్నుంచి  వ్యతిరేకమే

ఆర్టికల్ 370 విషయంలో బీజేపీ మొదట్నుంటి ఒకే మాట మీద ఉంది. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని వీలైనప్పుడల్లా అన్ని వేదికల మీదా కోరుతోంది. అలాగే కాశ్మీరీ మూలాలున్న వారిని మాత్రమే ‘ శాశ్వత నివాసుల ’ కింద గుర్తించే ఆర్టికల్ 35 (ఏ) ను రద్దు చేస్తే తప్ప జమ్మూ కాశ్మీర్ దేశంలోని మిగతా ప్రాంతాలతో మమేకం కాదన్న వాదనలు బీజేపీ లీడర్లు వినిపిస్తున్నారు. దేశ ప్రజలకు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇచ్చిన చేదు మాత్ర అని బీజేపీ లీడర్లు కామెంట్ చేస్తుంటారు. 2019 ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఈ ఇష్యూను చేర్చి టాప్ ప్రయారిటీ ఇచ్చింది  కమలం పార్టీ.

డీలిమిటేషన్ ఎందుకంటే…

నియోజకవర్గాల పునర్విభజన అంశం ఆర్టికల్ 370 తో ముడిపడి ఉంది. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు కాశ్మీర్ లోయ, జమ్మూ, లడఖ్ ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. జమ్మూ లో హిందువులు, కాశ్మీర్ లోయలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. లడఖ్ ప్రాంతంలో బుద్ధిస్టులు  పెద్ద సంఖ్య లో ఉంటారు. దేశవ్యాప్తంగా  ప్రతి పదేళ్లకు జనాభా లెక్కల ఆధారంగా  నియోజకవర్గాల విభజన జరుగుతుంది. ఇక్కడ పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ లో మాత్రం కేవలం ముఖ్యమంత్రి నిర్ణయం పై ఆధారపడి ఈ విభజన జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ లో మొత్తం అసెంబ్లీ సీట్లు 87 కాగా లోక్ సభ సీట్లు ఆరు. దేశంలోని అన్ని అసెంబ్లీల కాల పరిమితి ఐదేళ్లు కాగా కాశ్మీర్ అసెంబ్లీ కాల పరిమితి ఆరేళ్లు. కాశ్మీర్ లోయలో 46 సీట్లు, జమ్మూ ప్రాంతంలో 37 సీట్లు, లడఖ్ ప్రాంతంలో నాలుగు సీట్లు ఉన్నాయి. అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 44. ఇది ఇప్పటివరకు ఉన్న పరిస్థితి.

జమ్మా కాశ్మీర్  పాలిటిక్స్ లో మొదట్నుంచి కాశ్మీర్ లోయ ప్రాంత వాసులదే హవా కొనసాగుతోంది. లోయ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రులు వస్తుంటారు. జమ్మూ, లడఖ్ ప్రాంతాలు పొలిటికల్ గా కాశ్మీర్ లోయతో పోటీ పడలేవు. కానీ విస్తీర్ణం ప్రకారం చూస్తే  జమ్మూ ప్రాంతమే పెద్దది. కాశ్మీర్ కేవలం 15, 948 చదరపు కిలోమీటర్లు ఉంటే, జమ్మూ విస్తీర్ణం 26 వేల 293 చదరపు కిలోమీటర్లు. ఈ రెండిటికంటే లడఖ్ ప్రాంతం ఇంకా పెద్దది. 59వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది  లడఖ్ . అయితే ఏరియా ప్రకారం జమ్మూ పెద్దదైనా అక్కడ కేవలం 37 అసెంబ్లీ  నియోజకవర్గాలే ఉన్నాయి. ఇక్కడ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం దాదాపుగా 710 చదరపు కిలోమీటర్ల ఏరియాలో ఉంటుంది. కానీ కాశ్మీర్ లో మాత్రం పరిస్థితి వేరేగా ఉంది. ఇక్కడ 346 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికే ఒక్కో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. లడఖ్ లో ఎక్కువ ఏరియాకు ఒక్కో సెగ్మెంట్ ను ఏర్పాటు చేయడంతో అక్కడ కేవలం నాలుగు సీట్లే దక్కాయి.  అంతే కాదు 2011 లెక్కల ప్రకారం చూసినా జమ్మూ కంటే కాశ్మీర్​లో జనాభా తక్కువ అయినప్పటికి జమ్మూ కంటే కాశ్మీర్​లో ఎక్కువ అసెంబ్లీ సెగ్మెంట్లు వచ్చాయి. లడఖ్​​ ప్రాంతానికి ప్రాంతానికి కూడా అన్యాయం జరిగింది. కాశ్మీర్​ లోయకు ప్రయోజనం జరిగేలా ఈ ప్రక్రియ సాగింది. నియోజకవర్గాలను ఏర్పాటు చేయడంలో ఒక పద్ధతి ని ఫాలో కాకపోవడం వల్లనే ఇలా జరిగిందంటున్నారు  రాజకీయ పండితులు. నియోజకవర్గాల విభజన కు ఒక పక్కా  సిస్టం లేదు. దీంతో విస్తీర్ణం, జనాభా ఇలా అన్నిటిలో కాశ్మీర్ కంటే ముందంజలో ఉన్నప్పటికీ  జమ్మూ, లడఖ్ ప్రాంతాలకు రాజకీయంగా  న్యాయం జరగలేదన్నది రాజకీయ పండితుల అభిప్రాయం.

అన్నం పెడుతోంది టూరిజమే

కాశ్మీర్ అంటేనే పచ్చదనానికి మారుపేరు. ప్రకృతి రమణీయతకు కేరాఫ్ అడ్రస్. కాశ్మీర్ కు ఎవరు వచ్చినా ఇక్కడి అందాలకు ఫిదా అవ్వాల్సిందే.  ఇక్కడి రమణీయతను  చూడటానికి రెండు కళ్లూ చాలవంటారు చాలా మంది. ఇక్కడి సోయగాలను చూడటానికి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. మనదేశానికి చెందిన వారే కాదు విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు.

కాశ్మీర్ ప్రజల ప్రధాన జీవనోపాధి టూరిజమే. ఎక్కడెక్కడి నుంచో వచ్చే టూరిస్టులనే ఇక్కడి ప్రజలు నమ్ముకున్నారు. రాష్ట్ర ఖజానాకు టూరిజం పెద్ద ఎత్తున ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. దీంతో రాష్ట్రంలో టూరిజాన్ని  అభివృద్ది చేయడానికి కొన్నేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌  కు  భారీ ఎత్తున ఫండ్స్ కేటాయించింది. ప్రాజెక్ట్ లో భాగంగా పార్కులను, ఇతర టూరిస్టుల ప్రాంతాలను డెవలప్ చేయాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా దండిపోర పార్క్ ను అధికారులు అభివృద్ధి చేశారు. మరింత సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో టూరిస్టుల రాక పెరిగింది. కాశ్మీర్​ అందాలను వర్ణించడానికి మాటలు చాలవు.  పై ఫొటోనే దీనికి రుజువు!

స్పెషల్​ ఎట్లనంటె…

  • అనేక విషయాల్లో జమ్మూ కాశ్మీర్ కు ఆర్టికల్ 370 కాన్ స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ లా పనిచేస్తుంది. డిఫెన్స్ , ఫారిన్ ఎఫైర్స్ , ఫైనాన్స్, కమ్యూనికేషన్ అంశాలు మినహా మిగతా చట్టాల అమలు కోసం కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం ఇక్కడ తప్పనిసరి అవుతుంది.
  • సహజంగా ఇండియన్ పార్లమెంటు ఏ చట్టం చేసినా అది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. అయితే జమ్మూ కాశ్మీర్ కు మాత్రం పార్లమెంటు చేసిన చట్టం దానంతట అదే వర్తించదు. ఈ చట్టం అమలు కావాలంటే దానిని  జమ్మూ కాశ్మీర్  ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది.
  • ఆర్టికల్ 360 కింద కాశ్మీర్ లో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించే అధికారం కేంద్రానికి ఉండదు. వేరే దేశాలతో యుద్ధం వంటి ప్రత్యేక పరిస్థితులు వస్తేనే ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశాలుంటాయి.
  • ఆస్తుల కొనుగోలుకు సంబంధించి కూడా కాశ్మీర్ ప్రజలకు ఆర్టికల్ 370 ఓ సేఫ్ గార్డ్ లా పనిచేస్తుంది. దీని ప్రకారం ఇతర రాష్ట్రాల  ప్రజలు కాశ్మీర్ లో  స్థిరాస్తులు కొనడానికి అవకాశం ఉండదు.
  • కాశ్మీరీ యువతి మన దేశంలోనే వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే అప్పటివరకు ఆమెకు ఉన్న కాశ్మీరీ  పౌరసత్వం రద్దువుతుంది.
  • రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాలకు వర్తించే నిబంధనలేవీ జమ్మూ కాశ్మీర్ కు వర్తించవు.
  • జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా, ప్రత్యేక పీనల్ కోడ్ ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకు రెండు సిటిజన్ షిప్ లు  ఉంటాయి

రద్దు చేయలంటరు…

ఆర్టికల్ 370 రద్దుకు దేశంలోని మిగతా ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతోంది. ఇండియన్ యూనియన్ లో  ఒకసారి విలీనమైన తర్వాత స్వయం ప్రతిపత్తి  కొనసాగించాల్సిన అవసరం లేదన్న వాదన బలపడుతోంది. కాశ్మీర్ లో వేర్పాటు వాదానికి, టెర్రరిజానికి  ఆజ్యం పోస్తోంది ఆర్టికల్ 370యే నంటున్నారు దీనిని వ్యతిరేకించేవారు. జవహర్ లాల్ నెహ్రూ, షేక్ అబ్దుల్లా మధ్య కుదిరిన ఒక చీకటి ఒప్పందంగా కూడా కొంతమంది ఆర్టికల్ 370ని విమర్శిస్తుంటారు. దేశంలో ఎన్నో సంస్థానాలు ఇండియన్​ యూనియన్​లో విలీనమయ్యాయి. అయితే ఏ సంస్థానానికి లేని ప్రత్యేకత కాశ్మీర్​కు ఎందుకివ్వాలని ప్రశ్నిస్తున్నారు

రద్దు వద్దంటరు…

ఆర్టికల్ 370ని కొనసాగించాల్సిందేనని వాదించే వారు కూడా ఉన్నారు. ఇండియన్ యూనియన్ లో కాశ్మీర్  సంస్థానం విలీనం కొన్ని చారిత్రక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. కాశ్మీర్  ప్రజల జీవితాలకు సంబంధించిన అస్థిత్వాన్ని  కాపాడతామని అప్పటి ప్రధాని నెహ్రూ గట్టిగా హామీ ఇచ్చిన నేపథ్యంలోనే  ఆర్టికల్ 370 పుట్టిందన్నారు. ఆర్టికల్ 370 కొనసాగడానికి, టెర్రరిజానికి ఏమాత్రం సంబంధం లేదన్నారు. కాశ్మీర్ లో రాజకీయంగా  పైకి ఎదగడానికే  ఆర్టికల్ 370 ని బీజేపీ ఉపయోగించుకుంటోందని విమర్శిస్తున్నారు.

కాశ్మీర్​లో 3 ప్రాంతాలు…

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రధానంగా మూడు ప్రాంతాలు ఉన్నాయి. 1. కాశ్మీర్ లోయ. 2. జమ్మూ ప్రాంతం. 3. లడఖ్ ప్రాంతం. రాష్ట్రంలో జరిగే హిం స అంతా కాశ్మీర్ లోనే జరుగుతుంది. అది కూడా  సౌత్ కాశ్మీర్ లోనే. దక్షిణ కాశ్మీర్ లోని శ్రీనగర్, అనంతనాగ్, బారాముల్లా, పుల్వామా జిల్లాల్లోనే  టెర్రరిస్టులు రెచ్చిపోతుంటారు. కాశ్మీర్ లోయలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉంటారు. జమ్మూలో  కాశ్మీరీ పండిట్లే మెజారిటీ వర్గం. లడఖ్ విషయానికొస్తే ఇక్కడ ముస్లింలు 46 శాతం ఉన్నా బుద్ధిస్టులు 39 శాతం ఉన్నారు. పాకిస్థాన్ తో యుద్ధం జరిగిన కార్గిల్ ప్రాంతం, లడఖ్ ప్రాంతంలో నే ఉంది. లడఖ్ లోని ప్రధాన నగరం ‘లే’.