నిజాయతీ నిలుస్తుందా.. అవినీతి తేలుతుందా?

అరవింద్ కేజ్రీవాల్ 2011లో ఇండియన్​ పొలిటికల్ ​సీన్​లోకి ఒక గాడ్​లా వచ్చాడు. కానీ 2023 నాటికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన సీబీఐ నుంచి నోటీసులు అందుకోవాల్సిన స్థితిలో ఉన్నారు. ‘పొలిటికల్​గాడ్’​ స్థాయి నుంచి కేజ్రీవాల్ తనను తాను సాధారణ పొలిటికల్ ​లీడర్​గా మార్చుకున్నారు. దర్యాప్తు సంస్థలు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను రెండు నెలల క్రితం అరెస్ట్ చేసిన వెంటనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌ను కూడా ప్రశ్నించడం ఖాయమని తేలిపోయింది. అరవింద్ కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌కు ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ గురించి పూర్తిగా తెలుసని, ఆయన నిజంగానే ఢిల్లీ మద్యం వ్యాపారుల్లో ఒకరితో డైరెక్ట్​గా మాట్లాడారని అతనికి నమ్మకస్తుడైన ఓ కీలక నిందితుడు చెబుతున్నాడని దర్యాప్తు సంస్థలు అంటున్నాయి. ఏజెన్సీలు చెప్పేదే నిజమైతే కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌కు స్కామ్‌‌‌‌‌‌‌‌తో సంబంధం ఉన్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 

అవినీతి వ్యతిరేక ఉద్యమంతో..

అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారి 2011 ఏప్రిల్లో ప్రజా జీవితంలోకి ప్రవేశించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించారు. 2012  నవంబర్లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. 2013 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 60 ఏండ్లుగా ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ఆధిపత్యం చలాయించగా, చారిత్రాత్మకంగా ఆప్​ అధికార పీఠాన్ని దక్కించుకోగలిగింది. కేజ్రీవాల్ 2015లో రెండవసారి, 2020లో మూడవసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. గతేడాది మార్చిలో పంజాబ్ ఎన్నికల్లో గెలిచి చారిత్రాత్మక విజయం సాధించారు. 2 రాష్ట్రాలను స్వాధీనం చేసుకున్న మొదటి ప్రాంతీయ నాయకుడిగా కేజ్రీవాల్ దేశ దృష్టిని ఆకర్షించగలిగారు. ఇలా ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ అనూహ్యంగా తెరమీదకు వచ్చే వరకు కూడా కేజ్రీవాల్ ​తన పొలిటికల్​ కెరీర్​లో టాప్​లోనే ఉన్నారు. స్కామ్​ఆరోపణలు రావడం, తన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం జైలుకు వెళ్లడంతో ఆయనపై విశ్వాసం సన్నగిల్లడం ప్రారంభమైంది.

డిప్యూటీ సీఎం అరెస్ట్


ఢిల్లీ లిక్కర్ పాలసీ కొంత మందికి మేలు చేసేలా ఉందనే ఆరోపణలు రావడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు ఆదేశించారు. ఎక్సైజ్ పాలసీలో అవినీతి జరిగిందని సీబీఐ ధ్రువీకరించింది. ఇలా సీబీఐ, ఈడీ అనేక మందిని అరెస్టు చేయడం మొదలుపెట్టింది. సాధారణంగా రాజకీయ నాయకులు అవినీతి ఆరోపణలను మొదలు తిరస్కరిస్తారు. కానీ స్కామ్​లో ఉన్న అధికారులు, వ్యాపారులు నిజాల్ని బయట పెడుతుండటంతో ఒక్కరొక్కరుగా విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఇలాగే అరెస్టు చేసిన దర్యాప్తు ఏజెన్సీలు.. మరికొందరు రాజకీయ నాయకులను ప్రశ్నిస్తున్నాయి. అందులో భాగంగానే కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌ను సీబీఐ విచారణకు పిలిచింది.

దూషించిన వారితోనే స్నేహం

ఆమ్​ఆద్మీ పార్టీ పెట్టి..‘చీపురు’తో అవినీతికి వ్యతిరేకంగా స్వచ్ఛమైన రాజకీయాలను తీసుకొచ్చి, నిలబెట్టాడని అనుకునే లోపు కేజ్రీవాల్.. ‘మరో రాజకీయ నాయకుడు’ మాత్రమే అనే ముద్రపడింది. కేజ్రీవాల్ తన పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాలనుకున్నారు.  కొంత సక్సెస్​ అవుతున్నారు. తాజాగా భారత ఎన్నికల సంఘం ఆయన పార్టీకి ‘జాతీయ పార్టీ’గా గుర్తింపునిచ్చింది కూడా. ఇతర రాజకీయ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నందున వాటితో సహవాసం చేయడానికి కేజ్రీవాల్ అనేకసార్లు నిరాకరించారు. కానీ ఆయన ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి అరెస్టు కావడం.. వాటన్నిటిని తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. కేజ్రీవాల్ ఒకప్పుడు ఎవరిని దూషించారో ఇప్పుడు వారితోనే కూర్చున్నారు! లాలూ ప్రసాద్ యాదవ్, హర్యానా చౌతాలా, జార్ఖండ్ మధు కోడా వంటి ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగానే కేజ్రీవాల్ కూడా జైలులో కూర్చునే అవకాశం లేకపోలేదు! తాను ఎప్పుడూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను ఎదిరిస్తానని, ఢిల్లీ, పంజాబ్‌‌‌‌‌‌‌‌లలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను అంతం చేశానని గతంలో చెప్పిన కేజ్రీవాల్.. ఇప్పుడు బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తో పొత్తు పెట్టుకుంటానని చెబుతున్నారు.

నిజాయతీపై ఆశలు ఆవిరేనా..

ఢిల్లీ లిక్కర్​ స్కామ్‌‌‌‌‌‌‌‌లో తెలుగు రాష్ట్రాల నేతలూ లోతుగా ఇన్వాల్వ్​అయి ఉన్నట్లు దర్యాప్తు సంస్థల విచారణ, నోటీసుల ద్వారా తెలుస్తున్నది. డబ్బు అన్ని సమస్యలను పరిష్కరించగలదనే విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే ఎలాంటి పరిణామాలు లేకుండానే అవినీతి జరుగుతుందనే అభిప్రాయంతో కేజ్రీవాల్, ఆయన పార్టీ తెలుగు రాజకీయ నాయకులను ఉచ్చులోకి నెట్టినట్లు అయింది. సాధారణంగా అవినీతికి ఎలాంటి పరిణామాలు ఉండవు. కానీ కేజ్రీవాల్ ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగిరిపోగా, తెలుగు రాజకీయ నాయకులతో అతని అనుబంధం ద్వారా క్రూరమైన విధి పాపం ఆయనను నేలకూల్చింది. 75 సంవత్సరాలకొకసారి భూమికి దగ్గరగా వచ్చే హేలీ తోకచుక్కలా.. కేజ్రీవాల్ అరుదైన నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా భారత రాజకీయ తెరపైకి వచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. చివరికి జైలుకెళితే, స్వచ్ఛమైన రాజకీయాలపై భారతీయుల ఆశలు ఆవిరవుతాయి. తెలుగు రాజకీయ నాయకులను నమ్మి తనను తాను తిట్టుకుంటున్నాడు కేజ్రీవాల్. అయితే ఈ కేసులో ఆయన దోషిగా తేలితే.. తనకు ఎంతో ప్రేమ, విశ్వాసం కల్పించిన భారత ప్రజలకు కూడా ద్రోహం చేసినవాడవుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, కేజ్రీవాల్ ఒక ఉచ్చులో పడ్డాడు. దాని నుంచి బయటపడటం కష్టం. తెలుగు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను ఎప్పుడూ కలవకూడదని కేజ్రీవాల్ ప్రతిరోజూ కోరుకుంటూ ఉండాలి. ప్రతి ఉత్తరాది రాజకీయ నాయకుడు “కేజ్రీవాల్ ఇంత తెలివితక్కువ పని ఎందుకు చేశాడు?” అనే ప్రశ్న లేవనెత్తుతున్నాడు. విధి విచిత్రమైన మార్గాల్లో పనిచేస్తుంది. కొందరు తెలుగు రాజకీయ నాయకులతో సహవాసం అరవింద్ కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌ కెరీర్​ను పణంగా పెట్టే స్థాయికి తెస్తుందని ఎవరు అనుకుంటారు?.

భవిష్యత్ ప్రశ్నార్థకం..

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ బీజేపీ రాజకీయ పగ మాత్రమేనని,  ప్రతిపక్షాలను అణచివేసేందుకే దర్యాప్తు సంస్థలను వాడుతున్నారని పదే పదే చెబుతున్న కేజ్రీవాల్.. డబ్బు చేతులు మారలేదు లేదా స్కామ్ గురించి తనకు తెలియదని చెప్పలేకపోతున్నాడు. నా అంచనా కరెక్ట్​ అయితే సీబీఐ,ఈడీ ఇప్పటికే డాక్యుమెంటరీ ప్రూఫ్​లు సంపాదించాయని, అవి ఇప్పుడు కేవలం టైమ్​ గేమ్​ ఆడుతున్నాయి. ఒకవేళ సీబీఐ చివరికి కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌ను అరెస్టు చేస్తే, అది భారతదేశంలో ఓ విప్లవాత్మక రాజకీయ జీవితానికి ముగింపు అని అర్థం. ఇతర రాజకీయ నాయకుల్లా కేజ్రీవాల్ కుటుంబ పాలనతో లేదా పెద్ద రాజకీయ పార్టీ నుంచి వచ్చినవాడు కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి.. ఆమ్​ ఆద్మీ పార్టీ పెట్టి వచ్చాడు. రాజకీయాలు భ్రష్టు పట్టాయని, కేజ్రీవాల్ నిజాయతీపరుడని దేశం భావించింది. మరి ఢిల్లీ లిక్కర్​ స్కామ్​తో పడిన మరకను తుడిచేసుకొని.. ఆయన కడిగిన ముత్యంలా బయటపడతాడా? లేదా అన్నది వేచి చూడాలి.

- డా. పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్​ ఎనలిస్ట్