మన దేశంలో న్యాయవ్యవస్థ మొదటి నుంచీ చాలా క్రియాశీలంగా ఉంటూ ప్రజాస్వామిక సంప్రదాయాలను కాపాడుతూ వస్తోంది. కీలకమైన తీర్పులతో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్ని పెంచిన న్యాయమూర్తుల్లో జస్టిస్ కె రామస్వామి ఒకరు. 86 ఏళ్ల వయస్సులో ఆయన బుధవారం నాడు హైదరాబాద్ లో కన్నుమూశారు. గోదావరి జిల్లాలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించి కష్టపడి సుప్రీం కోర్టు న్యాయమూర్తి స్థాయికి ఎదిగిన జస్టిస్ కె రామస్వామి పేరు చెప్పగానే ఎస్ ఆర్ బొమ్మై వర్సె స్ యూనియన్ ఆఫ్ ఇండియా, సి రవి చంద్రన్ వర్సెస్ జస్టిస్ ఎఎం భట్టాచార్జీ కేసులు గుర్తుకు వస్తాయి. ఈ రెండు కేసుల్లో నూ సుప్రీం కోర్టు తీర్పులు చరిత్రాత్మకమైనవే.
బొమ్మై కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడటానికి ముందు, కేంద్రం లో అధికారంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్రాల్లో ప్రజాస్వామికంగా ఎన్నికైన ఇతర పార్టీల ప్రభుత్వాలను ఇష్టానుసారం తొలగించి రాష్ట్రపతి పాలన విధించేవి. ఇందుకోసం యధేచ్ఛగా ఆర్టికల్ 356ను ప్రయోగించేవి. దేశంలోనే మొదటిసారిగా కేరళలో ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని 1959లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక కలం పోటుతో రద్దు చేసింది. అప్పటి నుంచి తమకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం, రకరకాల సాకులు చూపించి ఆర్టికల్ 356 ను అడ్డం పెట్టుకుని రద్దు చేసే అప్రజాస్వామిక చర్య ప్రారంభమైంది. 1989 ఏప్రిల్ లో కర్ణాటకలో ఎస్‌ఆర్ బొమ్మై నాయకత్వం లోని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్రం ఇదే విధంగా రద్దు చేసింది. దీనిపై బొమ్మై సుప్రీంకోర్టుకు వెళ్లగా ఐదేళ్ల సుదీ ర్ఘ విచారణ తర్వాత 1994లో జస్టిస్ రామస్వామితో పాటు మరో ఎనిమిది మంది న్యాయమూర్తులున్న ధర్మాసనం చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించిం ది. ఆర్టికల్ 356ను కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా దుర్వినియోగం చేయకుండా ఈ తీర్పు కట్టడి చేసింది.
తీర్పు ఏం చెప్పిం ది…
ఏదైనా రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడ్డప్పుడు ఆర్టికల్ 356 ఆధారంగా అక్కడ కేంద్రం రాష్ట్ర పతి పాలన విధిస్తుంది. ఎస్ ఆర్ బొమ్మై వర్సె స్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సందర్భంగా సుప్రీం కోర్టు ఈ ఆర్టికల్ వినియోగానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ప్రకటించింది.
- రాష్ట్ర పతి పాలన విధించే ముందు ఆ రాష్ట్ర అసెంబ్లీలో అధికారపక్షానికి మెజారిటీ ఉందా, లేదా అనే విషయాన్ని పరిశీలించాలి.
సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం వారం ముందు నోటీసులు ఇచ్చి వివరణ కోరాలి. - రాష్ట్ర పతి పాలన విధించడమనేది దురుద్దేశపూర్వకంగా ఉండరాదు.
- ఎక్కడైనా రాష్ట్ర పతి పాలన దుర్వినియోగం అయినట్లు నిర్థారణ అయితే కోర్టులు సరైన దారి చూపించవచ్చు.
- మొదటి ఆరు నెలలు మాత్రమే రాష్ట్ర పతి పాలన విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అయితే దీనికి పార్లమెంటు ఆమోదం ఉండాలి.
- రాష్ట్ర పతి పాలన మరో ఆరు నెలలు పొడిగించాలంటే పార్లమెం టు మరోసారి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి.
న్యాయమూర్తులకు ఉన్నత విలువలుండాల్సిందే…
సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ కె.రామస్వామి చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన మరో ముఖ్యమైన కేసు సి.రవిచంద్రన్ అయ్యర్ వర్సెస్ ఏఎం భట్టాచార్జీ. హైకోర్టు లేదా సుప్రీం కోర్టు జడ్జీలపై ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై దర్యాప్తునకు సంబంధించి ఈ కేసులో సుప్రీం కోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. జడ్జీలుగా ఉన్నవారు వ్యక్తి గత జీవితంతో పాటువిధి నిర్వహణలో కూడా ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేని విధంగా ఉండాలని జస్టిస్ రామస్వామి పేర్కొన్నారు. తీర్పులిచ్చే ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తి తప్పనిసరిగా విధి నిర్వహణతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఉన్నత విలువలు పాటించాల్సిందేనన్నారు. మచ్చలేని జీవితం గడపాలన్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. న్యాయమూర్తిగా తనకున్న విశేషాధికారాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయరాదని హితవు పలికారు. ఈ రెండు కేసులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్దీకరణ కేసులోనూ ఆయన కీలక తీర్పు ఇచ్చారు. కేసు ఎంత జటిలమైనదైనా చాలా త్వరగా తీర్పులు ఇస్తారన్న పేరు జస్టిస్ కె.రామస్వామికి ఉంది. వాదోపవాదాలు పూర్తయిన వెంటనే సాధ్యమైనంత త్వరగా తీర్పు ఇచ్చే జడ్జిగా సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆయనను గుర్తు చేసుకుంటారు.