పుల్వామా చుట్టూ అల్లేస్తారా పాలిటిక్స్?

జమ్మూ కాశ్మీర్ లో జరిగిన టెర్రరిస్టు దాడి దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఎన్నికల ఏడాదిలో జరిగిన ఈ సంఘటన చుట్టూ రాజకీయాలు తిరగబోతున్నాయి. రానున్న రోజుల్లో జాతీయ భద్రత అంశం తెరమీదకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పుల్వామా దాడి సంఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటుందన్న అనుమానాలు వస్తున్నాయి.

పుల్వామా దాడి రాజకీయ రంగు పులుముకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన బెట్టుకున్న ఈ పాశవిక దాడి దేశ రాజకీయ వాతావరణాన్నే మార్చేసింది. దేశమంతా జైషే మహమ్మద్ దాడిని తీవ్రంగా నిరసించింది. ఈ విషయంలో రాజకీయాలకతీతంగా కేంద్రానికి అండగా నిలిచింది.

ప్రధాని మౌనం వ్యూహాత్మకమా ?
టెర్రరిస్టు దాడి నేపథ్యంలో అనేక చోట్ల అనర్థ ఆగ్రహం కూడా పెల్లుబుకుతోంది. కొన్ని సంస్థలు కాశ్మీరీలకు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం కూడా జోరందుకుంది. దెబ్బకుదెబ్బ తీయాల్సిందేనని ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. వీటన్నిటినీ ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా చూస్తున్నారు. పాట్నా, వారణాసి వంటి కొన్ని ప్రాంతాల్లో మాట్లాడుతూ టెర్రరిస్టు దాడి పై ప్రజల మనసుల్లో ఉన్న ఆగ్రహమే తనకూ ఉందన్నారు. తన కామెంట్ల ద్వారా ప్రజలతో మానసికంగా కనెక్ట్ కావడానికి ఆయన ప్రయత్నించారు.

ఈసారి బీజేపీకి నల్లేరు మీద నడక కాదు
ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి నల్లేరు మీద నడక కాదు. ప్రతిపక్షాల నుంచి ఎన్డీయే కూటమి గట్టి పోటీయే ఎదుర్కొంటోంది. ఎన్డీయే కూటమికి ప్రత్యామ్నాయంగా బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీలు ఒక వేదిక మీదకు రావడానికి తీవ్ర కృషి చేస్తున్నాయి. 2014 నాటి పరిస్థితితో పోలిస్తే ఈసారి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి ఏడాది రెండు కోట్ల కొలువులు సృష్టిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి న ఎన్డీయే సర్కార్ ఎన్నికల హామీని నిలబెట్టుకోలేదన్న అసంతృప్తి యువతలో ఉంది. ఇక రైతుల ఆగ్రహం సరేసరి. ఈమధ్య జరిగిన మూడు హిందీ రాష్ట్రాల్లో ఓటమికి రైతులు దూరం కావడమేనని ఇప్పటికే బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పుల్వామా దాడి సంఘటనను అందిపుచ్చుకుని, ప్రజల్లో జాతీయ వాద భావనలను రేకెత్తించి ఎన్నికల్లో పార్టీని మోడీ గెలుపు తీరాలకు చేరుస్తారని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విషయాన్ని పసి గట్టినట్లే ఉన్నాయి. పుల్వామా అంశం రాజకీయ రంగు పులుముకుంటే తీసుకోవలసిన వైఖరిపై ఇప్పటికే తర్జన భర్జనలు పడుతున్నాయి.

ముస్లిం సమాజం నుంచి దూరంగా కాశ్మీరీలు
ఆత్మాహుతికి పాల్పడ్డ టెర్రరిస్టు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జైషే మహమ్మద్ సంస్థ రూపొందించినట్లు భావిస్తున్న ఈ వీడియోలో నార్త్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఆవుల సంరక్షణ పేరుతో ముస్లిం మైనారిటీలను వేధించడం, వారిపై కేసులు పెట్టడం వంటి అంశాలున్నాయి. ఇదో గమ్మత్తయిన విషయం. కాశ్మీర్ ప్రజలు ఎప్పుడూ దేశంలోని మిగతా ప్రాంతాల్లోని ముస్లింలు ఎదుర్కొంటున్న  సమస్యలతో మమేకం కాలేదు. 2002 నాటి గోధ్రా అల్లర్ల అంశంపై కూడా కాశ్మీరీలు స్పందించలేదు. దేశంలోని ముస్లిం సమాజం నుంచి కాశ్మీరీలు తమను వేరు చేసుకోవడానికే మొగ్గు చూపారు. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి వంటి అంశానికే వాళ్లు పరిమితమయ్యా రు. అది తప్ప మరే అంశం కాశ్మీరీలకు పట్టదు. అయితే ఎన్డీయే సర్కార్ వచ్చాక పరిస్థితి మారింది. యూపీ, బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కాశ్మీరీ యువకులు పరిశీలిస్తున్నారు. ఆ సంఘటనలపై మాట్లాడుతున్నారు. కాశ్మీర్ వివాదం ఇవాళ్టిది కాదు. 70 ఏళ్ల నుంచి ఉన్నదే. కాశ్మీర్ అంశం ఏనాడూ జాతీయ రాజకీయాలను శాసించే స్థితిలో లేదు. అయితే పుల్వామా దాడి సంఘటనతో జాతీయ భద్రతతో పాటు కాశ్మీర్ అంశం కూడా లోక్ సభ ఎన్నికల్లో కీలకం కానున్నాయి.

– ఎం కే వేణు