‘చుక్కల మందు’కి చిక్కులు

‘చుక్కల మందు’కి చిక్కులు

‘పోలియా నేషనల్ ఇమ్యునైజేషన్ డే’ వాయిదాపడటం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమాన్ని ‘తప్పనిసరి పరిస్థితుల్లోనే’  పోస్ట్​పోన్ చేయాల్సి వచ్చిందని కేంద్రం తెలిపింది.  కానీ.. చుక్కల మందు తక్కువగా ఉండటం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనధికారిక సమాచారం. ఇండియా ‘పోలియో ఫ్రీ’ కంట్రీ అయినా వ్యాక్సిన్ షార్టేజీ ఎందుకింత ఆందోళన కలిగిస్తోంది?. మన దేశంలోని చిన్నారులకు ఇప్పటికీ ఆ వ్యాధి సోకే ప్రమాదం పొంచి ఉందా?

షెడ్యూల్ ప్రకారం ఈ నెల మూడునే నిర్వహించాల్సిన జాతీయ పోలియా నిరోధక దినోత్సవాన్ని మార్చి నెలకి వాయిదా వేయటానికి కారణం ఇదీ అని సర్కారు ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. పోస్ట్​పోన్ కి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ముందుగానే తెలిపినా క్లారిటీ మాత్రం ఇవ్వలే కపోయింది. దీంతో పోలియో వ్యాక్సిన్ షార్టేజీ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే వార్తలు గుప్పుమన్నాయి. వాటిని ఖండిస్తూ గవర్నమెంట్ సుదీర్ఘమైన వివరణ ఇచ్చింది. ఓరల్ పోలియో వ్యాక్సిన్ (ఓపీవీ) కావాల్సింతరెడీగా ఉన్నప్పటికీ దాన్ని స్ట్రిక్ట్​గా పరీక్షించిన తర్వాతే రాష్ట్రాలకు పంపుతామని చెప్పుకొచ్చింది. ప్రతి బ్యాచ్ షిప్ మెంట్ కీ ‘నేషనల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ’ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉండటం వల్లే లేటవుతోంది తప్ప ‘కొరత’ కారణం కానేకాదని తేల్చిచెప్పింది. ఇండియాలో ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ (ఐపీవీ)ని తాజాగా ప్రవేశపెట్టారు. ఈ చుక్కల మందు రేటు ఈ మధ్య బాగా పెరిగింది. అయినా దాని సేకరణకు నిధుల సమస్య లేదంటూ సర్కారు ధీమా ప్రదర్శించింది. ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా ఐపీవీ సప్లై చాలా పరిమితంగానే ఉందన్న మాట మాత్రం నిజం. ఇండియా సహా తక్కువ ఆదాయం గల దేశాల్లో ఈ రోగ నిరోధక కార్యక్రమాల్లో పాల్గొంటున్న గ్లోబల్ వ్యాక్సిన్ అలయెన్స్​ (గావి) స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. వివిధ దేశాల్లో ఐపీవీ వాడకం, ఉత్పత్తి మందకొడిగా సాగుతోందని, 2020 దాకా కూడా ఇదే పరిస్థితి కొనసాగొచ్చని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది. పోలియో నివారణ లక్ష్యాన్ని ఇండియా నాలుగైదేళ్ల కిందటే విజయవంతంగా అందుకుంది. ‘నిండు జీవితానికి రెండు చుక్కలు’ అంటూ చేపట్టిన ప్రచారం ప్రతి పల్లెకూ, ప్రతి గల్లీకీ చేరింది. ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పేరెంట్స్​ పోలియో చుక్కలు వేయించేవారు. ‘నేషనల్ ఇమ్యు నైజేషన్ డే’ని ఏటా రెండు సార్లు చేపడుతున్నారు. ప్రతిసారీ సుమారు 17 కోట్ల 20 లక్షల మంది చిన్నారులకు వ్యాక్సిన్ అందేది. భారీఎత్తున జరిగే ఈ కార్యక్రమానికి ఎప్పుడూ అద్భుతమైన స్పందన లభించేది. దీంతో మన దేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్ యూహెచ్ వో) 2014లో ‘పోలియో రహిత’ దేశంగా ప్రకటించింది. ఇండియా వంటి ఎక్కువ జనాభా గల దేశాల్లోని చాలా కమ్యూనిటీల్లో పేరెంట్స్​ తమ పిల్లలకు రెగ్యులర్ గా  వ్యాధి నిరోధక టీకాలు వేయించరు. కాబట్టి ప్రభుత్వమే ఉచితంగా ఇలా మాస్ ఇమ్యు నైజేషన్ ప్రోగ్రామ్స్​ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. మన దేశంలో పోలియో సోకే రిస్క్​ ఎక్కువ గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్. అందువల్ల అక్కడ నేషనల్ ఇమ్యునైజేషన్ డేస్ తో పాటు అదనంగా ఒకటీ రెండు రోజులు పల్స్​ పోలియో ప్రోగ్రామ్స్​ ఏర్పాటుచేస్తారు.

ఇండియాలో చివరిసారిగా 2011లో పోలియో వైరస్ ఇన్ఫెక్షన్ చోటుచేసుకుంది. అనంతరం ఓ ఏడాది వరకు ఆ రోగం జాడే కనిపించలేదు. దీంతో డబ్ల్ యూహెచ్ వో.. ‘ఎండెమిక్ వైల్డ్​ పోలియో ట్రాన్స్​మిషన్ ’ కంట్రీస్ లిస్టులో నుంచి మన దేశాన్ని తొలగించింది. తర్వాత రెండేళ్లకు ‘పోలియో ఫ్రీ’గానూ డిక్లేర్ చేసింది. అంటే అప్పటి నుంచి ఒక్క పోలియో కేసూ లేదని కాదు. వ్యాక్సిన్ అసోసియేటెడ్ పోలియో సోకుతూనే ఉంది. ఈ వ్యాధి లక్షణాలూ వైల్డ్​ పోలియో సింప్టమ్స్​ మాదిరిగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీవీ ప్రొడక్షన్ పరిమితంగానే ఉన్నందున అది పెద్దఎత్తున అందుబాటులోకి వచ్చే వరకు ఓపీవీనే వాడాలి. ఇండియా పోలియో రహిత దేశం అయినప్పటికీ ఇమ్యునైజేషన్ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలి. వ్యాక్సిన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి. లేకపోతే వ్యాధి మళ్లీ విజృంభించే ప్రమాదం ఉంది. ఇన్నేళ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది.

ఓపీవీకి, ఐపీవీకి తేడా ఏంటి?
వ్యాక్సిన్ – అసోసియేటెడ్ పోలియో పెరాలసిస్ ని పారదోలటానికే మన దేశం ఇప్పుడు ఓరల్ పోలియో వ్యాక్సిన్ (ఓపీవీ) నుంచి ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ (ఐపీవీ)కి మారుతోంది. పోలియో వైరస్ లు మూడు రకాలు. టైప్ –1, టైప్ –2, టైప్ –3. ఇవి ముఖ్యం గా చిన్న పిల్లలకు సోకుతాయి. ఈ వ్యాధిని కంట్రోల్ చేయటానికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ శాతం ‘నోట్లో వేసే పోలియో టీకా’(ఓపీవీ)నే ఉపయోగిస్తారు. ఇమ్యూన్ రెస్పాన్స్​ కోసం ఓపీవీ తయారీలో బలహీన పోలియో వైరస్ ని వినియోగిస్తారు. దీనికి విరుద్ధంగా ఐపీవీ తయారీలో యాక్టివేషన్ లో లేని పోలియో వైరస్ ను వాడతారు. ఐపీవీని ఇన్ జెక్షన్ రూపంలో ఇస్తారు.