రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్.. ‘సిటీ ఆఫ్ లేక్స్ (సరస్సుల నగరం)’గా ఫేమస్. సహజంగా ఏర్పడ్డ ఆ నీటి వనరులు రాన్రానూ పొల్యూషన్, ఆక్రమణల బారినపడి నామరూపాలు లేకుండాపోతున్నాయి. దీంతో ఆ నగరం ఇప్పుడు ‘పిటీ ఆఫ్ లేక్స్ (సరస్సులను చూసి జాలిపడే పరిస్థితి)’గా మారిపోయింది. ‘మాస్టర్ ప్లాన్–2031’ ఏ మేరకు పూర్వ వైభవం తెస్తుందో?.
ఉదయ్‌పూర్.. రాజస్థాన్‌లో దక్షిణ దిక్కున ఉంటుంది. సారవంతమైన ఈ లోయ ప్రాంతానికి చుట్టూ ఎత్తయిన కొండలు సరిహద్దులుగా ఉంటాయి. అడుగడుగునా దట్టమైన అడవులు, రాళ్లతో కూడిన గుట్టలు కనిపిస్తాయి. దీంతో నేచురల్‌గా ఏర్పడ్డ సరస్సులకు ఈ నగరం పెట్టింది పేరుగా మారింది. ‘సిటీ ఆఫ్ లేక్స్’గా 1568 నాటికే ఫేమస్. రాణా ఉదయ్ సింగ్.. మేవాడ్ రాజ్య రాజధానిని చిత్తోర్‌గఢ్ నుంచి ఉదయ్‌పూర్‌కి మార్చటంతో అప్పటి నుంచి సిటీ ఆఫ్ లేక్స్ అనే పేరు స్థిరపడిపోయింది. ఉదయ్‌పూర్‌లో ల్యాండ్స్ ఏటవాలుగా ఉండటంతో వాన నీళ్లన్నీ దిగువ ప్రాంతాలకు చేరి సరస్సులుగా ఏర్పడేవి. ఆ నీటి ప్రవాహానికి ఎక్కడికక్కడ చిన్న చిన్న ఆనకట్టలు కట్టి తాగు, సాగు నీటి అవసరాలు తీర్చుకునేవారు. రాజపుత్రులు రిక్రియేషనల్ ల్యాండ్‌స్కేప్‌లు ఏర్పాటు చేసుకున్నారు. సిటీకి దక్షిణాన పిఛోలా సరస్సు ఉంటుంది. దాని లోతు 4 నుంచి 8 మీటర్లు. ఈ లేక్‌కి చుట్టూ రాతితో డ్యామ్ నిర్మించి తాగునీరు సప్లయి చేసేవారు.
లేక్ నెట్వర్క్
ఉదయ్‌పూర్‌లో పిఛోలా సరస్సుతోపాటు బడా మాదర్, ఛోటా మాదర్, బడీ తలాబ్ సరస్సులు కూడా ఉన్నాయి. ఈ మూడూ ఎగువ ప్రాంతంలో ఉండటంతో వాటిలోని నీరు దిగువ ప్రాంతాల్లోని ఆరు చిన్న సరస్సులతోపాటు ఉదయ్‌సాగర్ సరస్సుకుకూడా వచ్చి చేరుతుంది. పిఛోలా, ఫతేనగర్ అనే రెండు పెద్ద సరస్సులు సిటీకి నడిబొడ్డున ఉన్నాయి. మిగతా సరస్సులు చిన్నపాటి ఓవర్‌ఫ్లో ట్యాంకుల్లా పనిచేస్తుంటాయి. ఇవన్నీ లింకేజ్ ఛానెల్స్‌తో కనెక్ట్ అయి ఉన్నాయి. అందువల్లే ఉదయ్‌పూర్ ఇప్పటికీ డ్రింకింగ్ వాటర్ విషయంలో ఏ లోటూ లేకుండా ఉంది. పిఛోలా సరస్సు చుట్టూ ఘాట్లు, గుళ్లు కట్టారు. ఘాట్లలో స్నానాల గదులు, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఘాట్లు కుటుంబ వేడుకలకు, ఆధ్యాత్మిక వ్యవహారాలకు వేదికలుగా ఉండేవి. ఒక విధంగా ప్రజల లైఫ్‌స్టయిల్‌కి కేంద్రాలుగా నిలిచేవి. వీటిలో ఆడవాళ్ల జానపద పండుగలు, మగవాళ్ల పడవ పోటీలు నిర్వహించేవారు. గతంలో సరస్సులు జనాల నీటి అవసరాలు తీర్చే వనరులుగా ఉండేవి కాదు. ఎకోసిస్టమ్‌లో భాగంగా ఉండి, వాటర్ రిజర్వ్‌లుగా వ్యవహరించేవి. గ్రౌండ్ వాటర్ పెరగటానికి ఉపయోగపడేవి.
ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ
ఉదయ్‌పూర్‌లో జనాభా, ఇళ్లు పెరగటంతో సిటీ సరిహద్దులు విస్తరించాయి. కొండ ప్రాంతాలను దాటిపోయాయి. సరస్సుల ఒడ్డున సుమారు 70 ఘాట్లు, 80కి పైగా హోటళ్లు, 6000 ఇళ్లు వెలిశాయి. దీంతో ఈ నీటి వనరులు దాదాపు కనుమరుగవుతున్నాయి. గట్ల మీదే స్నానాలు చేయటం, బట్టలు ఉతకటం వంటివి పెరిగిపోయాయి. చెత్త, మురుగు, రసాయన మలినాలు, పారిశ్రామిక వ్యర్థాలు చేరుతుండటం; నాచు పేరుకుపోతుండటంతో సిటీకి ఏకైక మంచి నీటి వనరుగా ఉన్న సరస్సులు కాస్తా పొల్యూట్ అవుతున్నాయి. సరస్సుల నుంచి 250 మీటర్ల లోపు రెస్టారెంట్లు, హోటళ్లు, గెస్ట్ హౌస్‌ల వంటి కమర్షియల్ సెటప్‌లు ఏర్పాటు చేయాలంటే.. హానికరమైన పదార్థాలను సరస్సులోకి వదలబోమని ముందే హామీ ఇవ్వాలని రూలు పెట్టారు. ఈ ప్రాంతంలో లీలా ప్యాలెస్, ఒబెరాయ్ ఉదయ్‌విలాస్ వంటి లగ్జరీ హోటళ్లు 2000 సంవత్సరంలో వచ్చాయి. వీటివల్ల టూరిజం ఇంటర్నేషనల్ లెవల్లో డెవలప్ అయింది. కానీ లేక్ ఫ్రంట్ ల్యాండ్ రోజురోజుకీ తగ్గుముఖం పట్టింది.
మాస్టర్ ప్లాన్–2031
ఉదయ్‌పూర్‌లోని సరస్సులకు పూర్వ వైభవం తేవటానికి రాజస్థాన్ సర్కారు మాస్టర్ ప్లాన్–2031ని రూపొందించింది. దీని ప్రకారం ఫతేనగర్, పిఛోలా సరస్సుల చుట్టూ గ్రీన్ జోన్లు అభివృద్ధి చేస్తారు.
ఇదొక నది తెలుసా?
ఇదేదో మురుగు కాలువ అనుకునేరు సుమా! ఒకప్పుడు ఉదయ్‌పూర్ నగరం మీదుగా పొంగి ప్రవహించిన అయద్ నది! ఇప్పుడు చిన్నసైజ్ డ్రైనేజీలా మారిపోయింది. దీన్నిబట్టి నీటి వనరులు ఏవిధంగా ఆక్రమణకు గురయ్యాయో చెప్పక్కర్లేదు. పూడికతీత పనులు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయింది. పిఛోలా, ఫతేనగర్ సరస్సులలో నిండిపోయిన నీళ్లన్నీ ఈ నదిలోకి ప్రవేశించేవి. ఈ నేపథ్యంలో సరస్సు లను రక్షించాల్సిన అవసరాన్ని హైకోర్టు నొక్కి చెప్పింది.