మెషిన్ గుండెలు వచ్చేస్తున్నాయి.. మేకలపై IIT కాన్పూర్‌ పరిశోధనలు

మెషిన్ గుండెలు వచ్చేస్తున్నాయి.. మేకలపై IIT కాన్పూర్‌ పరిశోధనలు

హైదరాబాద్ ఆస్పత్రుల వైద్య బృందం సహకారంతోఐఐటీ కాన్పూర్‌లో కృత్రిమ గుండెను అభివృద్ధి చేస్తున్నారు. త్వరలో దీనిని మేకలపై పరీక్షించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం విదేశాల్లో కంటే 10 రెట్లు తక్కువ ఖర్చుతో ఈ కృత్రిమ గుండెను తయారు చేయనున్నారు. టైటానియం మెటల్‌తో దీన్ని  అభివృద్ధి చేస్తున్నారు. 

ఈ కృత్రిమ గుండెకు హృదయయంత్ర అని పేరు పెట్టారు. సాంకేతిక భాషలో దీనిని LVAD( left ventricular assist device) అంటారు. అంటే లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ పరికరం. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయని వారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ కృత్రిమ గుండెను ముందుగా మేక ఛాతీలో అమర్చనున్నారు. అనంతరం దాని పనితీరు ఆధారంగా మనుషులపై పరిశోధనలు జరపనున్నారు.

ఈ కృత్రిమ గుండె నిర్మాణంపై ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొ. మనీంద్ర అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం దీనిపై పరిశోధన జరుగుతోందని, త్వరలో జంతు ప్రయోగం ప్రారంభమవుతుందని చెప్పారు. గతంలో పందులలో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని, కానీ ఇప్పుడు మేకలలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. చాలా పరిశోధనల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల సహకారం, ఇన్‌స్టిట్యూట్‌లోని ప్రొఫెసర్ల సలహాలతో ఈ కృత్రిమ గుండెను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.

ధర రూ.10 లక్షలు

విదేశాలలో కృత్రిమ గుండె ధర కోటి రూపాయల కంటే ఎక్కువ ధర ఉంటే, ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు దీనిని రూ.10 లక్షల తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. అయితే, మార్కెట్‌లోకి వచ్చేసరికి దీని ధర పెరిగే అవకాశం ఉంది.