- చాట్‌జీపీటీకి ఇండియాలో ఊహించని ఆదరణ
- అధికారులతోనూ సమావేశం
- శామ్ ఆల్ట్మాన్ వెల్లడి
న్యూఢిల్లీ: మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీ ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. మీటింగ్ అద్భుతంగా జరిగిందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై మోడీ చాలా ఆసక్తి చూపించారని ఆయన వెల్లడించారు. కొత్తగా తేనున్న డిజిటల్ ఇండియా బిల్లులో ఏఐ నియంత్రణ కోసం ప్రభుత్వం రూల్స్ తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఏఐ తెచ్చే అవకాశాలు, రెగ్యులేషన్ ఎలా ఉండాలనే అంశాలు కూడా మోడీతో మీటింగ్‌లో చర్చకు వచ్చాయని ఆల్ట్మాన్ చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఇండియాలో ఉన్న అవకాశాలపై ప్రభుత్వం ఏం చేయాలనే దానిపై ఫోకస్ పెట్టినట్లు పేర్కొన్నారు.
ఓపెన్ఏఐ తెచ్చిన ఏఐ ప్రొడక్ట్ చాట్‌జీపీటీకి ఇండియాలో ఊహించనంత ఆదరణ లభిస్తోందని శామ్ ఆల్ట్మాన్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రాధమిక దశలోనే చాట్‌జీపీటీని వాడేందుకు ఇష్టం చూపించారని వివరించారు. యూజర్ల ఆసక్తి ఆశ్చర్యం కలిగిస్తోందని ఆల్ట్మాన్ పేర్కొన్నారు. ఇండియాలో సుడిగాలి పర్యటనకు వచ్చిన శామ్ ఆల్ట్మాన్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులతో సమావేశమై మన దేశం చేపడుతున్న ఏఐ ప్రోగ్రామ్‌పైనా చర్చించారు. ఏఐ రెగ్యులేషన్ కు ఇంటర్నేషనల్ అథారిటీ ఒకటి ఉండాలని గతంలో ఆయన సలహా ఇచ్చారు. అయితే మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ విషయంలో ఆయనతో విభేదించారు. ఏఐని ఎలా రెగ్యులేట్ చేయాలనే అంశంలో మన వైఖరి మనకి ఉంటుందని రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.