
- ఖైరతాబాద్ ఆఫీసులో వారం రోజులుగా అమలు
- సీసీ కెమెరాలకు ఏఐ టెక్నాలజీ అనుసంధానం
- బ్రోకర్లను గుర్తించి కమిషనర్ఆఫీసుకు సమాచారం
- అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట
- త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించే ప్లాన్
హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర రవాణా శాఖలో పారదర్శకమైన పనితీరును తీసుకొచ్చేందుకు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సేవలను వినియోగిస్తున్నారు. తెలంగాణ రవాణా శాఖకు కేంద్ర కార్యాలయమైన ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో గత వారం రోజులుగా ఈ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆఫీసు ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలకు ఏఐ సాంకేతికతను అనుసంధానం చేశారు.
దీంతో కెమెరాలో ఒక వ్యక్తి పదే పదే కనిపిస్తే.. ప్రత్యేకమైన కోడ్ ద్వారా ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కార్యాలయానికి స్పష్టమైన సంకేతాలను పంపిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నది. ఈ వ్యక్తి ఒక్క రోజులో, వారం రోజుల్లో ఇన్నిసార్లు ఆర్టీఏ ఆఫీసులో కనిపించారు..ఈయన ఎవరు? ఆర్టీఏ బ్రోకరా.. పనికోసం ఆఫీసు చుట్టూ తిరుగుతున్నడా.. అని కమిషనర్ కార్యాలయాన్ని ఏఐ అలర్ట్ చేస్తున్నది. దీంతో కమిషనర్ ఆఫీసు వెంటనే ఖైరతాబాద్ లోని ఆర్టీఏ అధికారులను ఆరా తీస్తున్నది.
బ్రోకర్ అయితే అతన్ని ఆర్టీఏ ఆఫీసులోకి అడుగుపెట్టనీయకుండా తగిన ఆదేశాలను ఇస్తున్నారు. ఒకవేళ పనికోసం తిరుగుతున్న వ్యక్తి అయితే ఆయనది ఏపని? ఎందుకు కావడం లేదు? అని ఆరా తీసి వెంటనే అతని పనిపూర్తి చేసేలా అధికారులకు పైనుంచి ఆదేశాలు వెళ్తాయి. ఇలా ఏఐ సాంకేతికత ఇటు బ్రోకర్ల ఆటకట్టించడంతో పాటు పనుల కోసం ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరిగే వారికి వెంటనే పనిపూర్తి చేసి పెట్టేలా ఉపయోగ పడుతున్నది.
త్వరలో చెక్పోస్టుల్లో ఏఐ సేవలు
గత వారం రోజుల్లో 45 మంది పదే పదే ఆఫీసుకు వస్తున్నారని గుర్తించిన అధికారులు.. వారు ఎవరు? ఎందుకు వచ్చారు? అని విచారణ చేసి తగిన చర్యలకు దిగారు. దీంతో ఖైరతాబాద్ ఆర్టీఏ ఆపీసులో ఈ వారం రోజులుగా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఆఫీసు ఆవరణలోకి బ్రోకర్లు, ఏజెంట్లు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆఫీసులో అడుగుపెట్టాలంటే వారు భయపడిపోతున్నారు.
ఇదే సమయంలో పనుల కోసం తిరిగే వారికి చక..చకా..పనులు అవుతున్నాయి. ఏఐ సేవలతో పూర్తి సంతృప్తిగా ఉన్న ఆర్టీఏ ఉన్నతాధికారులు దశల వారీగా ఈ సేవలను అన్ని జిల్లాల్లోని ఆర్టీఏ ఆఫీసుల్లో అమలు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద కూడా ఈ సేవలను అమలు చేయాలని భావిస్తున్నారు.
జాతీయ స్థాయిలో పర్మిట్ విధానం అమలు కావడం, జీఎస్టీ అమల్లోకి తీసుకురావడంతో చెక్ పోస్టుల్లో కొంత వరకు అవినీతి తగ్గినా.. పూర్తి స్థాయిలో అక్కడ కూడా పారదర్శకత తెచ్చేందుకు ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలపై అధికారులు దృష్టి పెట్టారు. వాస్తవానికి 17 రకాల సేవలను ఆన్‌లైన్ లో అందుబాటులోకి తీసుకువచ్చినా తరుచూ సాంకేతిక సమస్యలను రావడంతో జనం ఆర్టీఏ ఆఫీసులకు రావాల్సి వస్తున్నది.
దీన్ని ఆసరా చేసుకునే ఆర్టీఏ బ్రోకర్లు, ఏజెంట్లు పనుల కోసం వచ్చే వారి అవసరాలను సొమ్ము చేసుకుంటూ విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నతాధికారుల దృష్టికి చేరాయి. అందుకే ఆర్టీఏ కార్యాలయాల్లో పారదర్శకమైన పాలన అమలు అయ్యేందుకు ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.