యాదాద్రి, వెలుగు: ఆ వ్యాపారుల వద్ద బర్లు ఉండవు.. ఆవులుండవు.. కానీ పాలు మాత్రం తయారు అవుతున్నాయి. బట్టలు ఉతకడానికి వాడే సర్ఫ్, పంట ఏపుగా పెరడానికి వేసే యూరియా, వంటలోకి ఉపయోగించే నూనెతో మిల్క్ రెడీ అయితున్నది. ఈ పాలు విరిగిపోకుండా ఉండేందుకు డెడ్‌బాడీలు పాడవకుండా వాడే ఫార్మాల్డిహైడ్‌ను వాడుతున్నారు. యాదాద్రి జిల్లాలో ఈ కృత్రిమ పాల దందా జోరుగా సాగుతున్నది. ఇలాంటి కల్తీ పాలతో గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు అనేక రోగాలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కల్తీ, కృత్రిమ పాలను తయారు చేస్తున్న వారిని.. రిమాండ్ చేయకుండా కేవలం నోటీసులిచ్చి వదిలేస్తున్నారు. నిర్ధారణ కోసం హైదరాబాద్‌లోని టె స్టింగ్ ల్యాబ్‌కు పంపిస్తున్నారు. రిపోర్ట్ రావడానికే చాలా సమయం పడుతోంది. కేసులు నమోదు చేసినా, అవి తేలడానికి ఏండ్ల టైం పడుతుండటంతో వ్యాపారులకు భయం లేకుండా పోయింది.
డైలీ వేల లీటర్లు సిటీకి
యాదాద్రి కృత్రిమ పాల తయారీకి అడ్డాగా మారిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్నెలాఖరు నాటికి కృత్రిమ పాల తయారీకి సంబంధించి దాదాపు పది కేసులు వెలుగు చూడగా.. మేలోనే ముగ్గురిని ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లో 2.10 లక్షల ఇండ్లు ఉండగా దాదాపు 8.10 లక్షల జనాభా ఉంది. జిల్లాలోని పాడి పశువులు ద్వారా వచ్చే పాలు ఇక్కడి జనాభా, హోటళ్ల వ్యాపార అవసరాలకే సరిపోవడం లేదు. కానీ ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు వేల లీటర్ల పాలు సొంతంగా ఆటోలు, బస్సులు, రైళ్లలో రోజూ సరఫరా చేస్తున్నారు. ఈ పాలల్లో ఫ్యాట్ ఎక్కువగా ఉండడంతో స్వీట్ల తయారీలో ఉపయోగిస్తున్నారు.
డేంజరస్ కెమికల్స్‌తో తయారీ
యాదాద్రి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి, చౌటుప్ప ల్, భువనగిరి, బీబీనగర్, బొమ్మల రామారం మండలాలకు చెందిన కొందరు వ్యాపారులు చుక్క పాలు లేకుండా కృత్రిమంగా పాలు తయారు చేస్తున్నారు. నీళ్లలో మిల్క్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రో క్లోరిక్ యాసిడ్, ఆక్సిటోసిన్ ఇంజక్షన్ బాటిల్, యూరియా, సర్ఫ్, బేకింగ్ సోడా, వంట నూనెను కలుపుతూ తయారు చేస్తున్నారు. మరోవైపు సహజంగా సేకరించిన పాలు ఫ్రిజ్‌లో పెట్టకుంటే గంటల్లోనే పగిలిపోతాయి. అయితే పాలు రోజులపాటు చెడిపోకుండా ఉండడానికి.. శవాలను భద్రపర్చడానికి ఉపయోగించే ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను ఉపయోగిస్తున్నట్టు జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు బీబీనగర్‌లో నిర్వహించిన తనిఖీలో ఈ ఏడాది వెలుగు చూసింది. ఈ ఫార్మాల్డిహైడ్ బయట వాతావరణంలో నిమిషాల వ్యవధిలోనే కనిపించకుండా మాయమవుతుంది. 50 లీటర్ల పాలల్లో ఈ కెమికల్‌ను 2 లేదా 3 చుక్కలు ఉపయో గిస్తున్నారు.
మరో వ్యాపారి అరెస్ట్
యాదాద్రి జిల్లాలో కృత్రిమంగా పాలు తయారు చేస్తున్న మరో వ్యాపారిని ఎస్వోటీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లికి చెందిన మహేందర్.. పాల వ్యాపారం చేస్తున్నాడు. ఎస్వోటీ పోలీసులు తనిఖీ చేసి.. 80 లీటర్ల కృత్రిమ పాలు, 300 మిల్లీ లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు.
డెయిరీల్లోనూ కల్తీ
కొంత మంది పాల వ్యాపారులు లాభాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. వంద లీటర్లు సేకరించి వాటితో వేల లీటర్లుగా మారుస్తున్నారు. పాలల్లో నీటిని కలిపి.. చిక్కదనంతో పాటు తెల్లగా కనిపించడానికి పాల పౌడర్ కలుపుతున్నారు. పాల డెయిరీలు కూడా కల్తీకి పాల్పడుతున్నాయని ఇటీవల తేలింది. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో ప్రముఖ పాల డెయిరీలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సేకరించిన శాంపిల్స్‌ను టెస్ట్ చేయిస్తే టోన్డ్ పాలల్లో కల్తీ జరిగినట్లు తేలింది. దీంతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సదరు కంపెనీకి నోటీసులు పంపించారు.
చర్యలు తీసుకుంటున్నం
అధిక లాభాల కోసం కొందరు వ్యాపారులు కృత్రిమంగా పాలు తయారు చేస్తున్నారు. ఇందుకోసం ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నారు. కృత్రిమ పాలు ఆరోగ్యానికి ప్రమాదకరం. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం పాలల్లో నీళ్లు కలపడమే నేరం. ఈ వ్యాపారులు ఏకంగా రసాయనాలే వాడుతూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. కృత్రిమ పాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నం.
- స్వాతి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, యాదాద్రి