
- .ఎక్కడికక్కడ అరెస్టులు
పంజాగుట్ట, వెలుగు: కార్మికుల విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్స్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ కార్యాలయం ముట్టడికి వారు యత్నించారు. ముందస్తు సమాచారం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముట్టడికి ప్రయత్నించిన ఆర్టిజన్స్ ను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ చైర్మన్ కె.ఈశ్వరరావు మాట్లాడారు. ఆర్టిజన్స్ ను కన్వర్షన్ చేయడం వల్ల ఆర్థిక భారం పడదని తెలిపారు. సీఎండీకి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా ప్రభుత్వం పోలీసులతో అణచివేయించిందని చెప్పారు. ఇది దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.
ఆర్టిజన్స్ తో సర్కారు చర్చించాలి: సీపీఎం
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టిజన్స్ తో చర్చలు జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు ప్రతినిధి వర్గం అసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అరెస్ట్ అయిన ఆర్టిజన్స్ ను పరామర్శించి సంఘీభావం తెలిపారు.