హైదరాబాద్, వెలుగు: కోట్లాది మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరానికి తలుపులను తయారు చేసిన మన కళాకారులు సమాజానికి ఎంతో గర్వకారణమని.. వారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్, పల్లవి ఫౌండేషన్ అధినేత మల్కా కొమరయ్య అన్నారు. బోయిన్ పల్లిలోని అనురాధ టింబర్ డిపోను సోమవారం మల్కా కొమరయ్య, మల్కా యశస్వి సందర్శించారు. అక్కడ తయారవుతున్న అయోధ్య రామ మందిర తలుపులను పరిశీలించారు.
ఈ సందర్భంగా అనురాధ టింబర్స్ ఎండీ కిరణ్ కుమార్ను వారు అభినందించారు. అనంతరం మల్కా కొమరయ్య మాట్లాడుతూ.. ఎండీ కిరణ్ కుమార్ ఎంతో నిబద్ధతతో మన సంస్కృతికి, సంప్రదాయాలకు సజీవ సాక్ష్యంగా నిలిచేలా రామమందిర తలుపులు తయారు చేయడం, మన వారసత్వ సంపదను సంరక్షిస్తుండటం దేశానికే గర్వకారణమన్నారు.
మల్కా యశస్వి మాట్లాడుతూ... అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న అనురాధ టింబర్ కళాకారులకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో శ్రీరామ మందిర కల సాకారం అయ్యిందని, మోడీ బాటలోనే మన సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడుకునేందుకు మల్కా కుటుంబం ఎప్పుడూ ముందుంటుందన్నారు.