ఆయనది ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం.సాగు చేసే భూమిని అమ్మగా వచ్చిన 13 వేల రూపాయలతో ఒక చిన్న ఐస్‌క్రీం కంపెనీ పెట్టాడు. కానీ.. అనుకున్నంత సక్సెస్ రాలేదు. అహర్నిశలు కష్టపడి పనిచేశాడు. దాంతో వేల రూపాయల ఆస్తి.. వేల కోట్లకు చేరింది. ఆ కంపెనీ పేరు అరుణ్. దాన్ని పెట్టింది ఆర్.జి.చంద్రమోహన్. ఆయనే తర్వాత ఇండియాలో అతిపెద్ద డెయిరీ కంపెనీల్లో ఒకటైన హట్సన్‌ని కూడా పెట్టాడు.
ఆర్.జి. చంద్రమోహన్‌ది దక్షిణ తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని శివకాశి తాలూకాలో ఉన్న తిరుతంగల్ అనే చిన్న గ్రామం. అయితే చంద్రమోహన్ కుటుంబం చెన్నయ్‌లో ఉండేది. తండ్రి కూరగాయల వ్యాపారం చేసేవాడు. చంద్రమోహన్ అక్కడే ప్రి – యూనివర్సిటీ కోర్స్ చేసేవాడు. కానీ.. మ్యాథమెటిక్స్‌లో ఫెయిల్ కావడంతో బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
అదే టైంలో అతని తండ్రి వ్యాపారం మానేసి కుటుంబంతో సహా సొంతూరికి వెళ్లిపోయాడు. దాంతో చంద్రమోహన్ కూడా చెన్నై నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. సొంతూరిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ.. చంద్రమోహన్‌లో బిజినెస్ చేయాలనే ఆలోచన బలంగా నాటుకుపోయింది. దాంతో కుటుంబ ఆస్తిలో కొంత భూమిని అమ్మాడు.
అలా వచ్చిన13 వేల రూపాయలు తీసుకుని1971లో చెన్నయ్‌లో ఐస్ క్రీమ్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు. ఆ బిజినెస్‌కు ఆర్.జి. చంద్రమోహన్ అండ్ కో. అని పేరు పెట్టాడు. చంద్రమోహన్ బిజినెస్ పెట్టిన మొదట్లో ఆయన దగ్గర ముగ్గురు ఉద్యోగులు ఉండేవాళ్లు. చెన్నయ్‌కి ఉత్తరాన ఉన్న రాయపురంలో 250 చదరపు అడుగుల ఒక స్థలాన్ని రెంట్‌కి తీసుకుని అందులో ప్రొడక్షన్ మొదలుపెట్టాడు.
మొదట్లో ఐస్ క్యాండీలను తయారుచేసి మార్కెట్‌లో అమ్మేవాడు. ఆ తర్వాత తన బ్రాండ్‌కి ‘అరుణ్’ అని పేరు పెట్టాడు. అరుణ్ అంటే సూర్యుడు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా అమ్ముడయ్యే ప్రొడక్ట్ కాబట్టి ఆ పేరు పెట్టాడట! బ్రాండ్ పేరుని మార్కెట్ చేయడానికి తొమ్మిది పుష్ కార్ట్‌లు (తోపుడు బండ్లు), ఆరు ట్రై సైకిళ్లను కొన్నాడు. ఐస్‌క్రీం అమ్మేవాళ్లకు వాటిని ఇచ్చి అరుణ్ ఐస్‌క్రీమ్‌లు అమ్మించాడు.
సక్సెస్ కోసం..
చంద్రమోహన్ కంపెనీ పెట్టిన వెంటనే సక్సెస్ రాలేదు. అందుకోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే.. బిజినెస్ పెట్టేముందు దాని గురించి ఆయన ఏమంత రీసెర్చ్ చేయలేదు. పెద్ద స్టార్టప్‌లకు పెట్టుబడి లేక, తన మేనమామ ‘తక్కువ డబ్బుతో ఐస్‌క్రీం బిజినెస్ చేయొచ్చ’ని ఇచ్చిన సలహాతో ఈ వ్యాపారం మొదలుపెట్టాడు. అయితే.. అప్పటికే ‘దాసప్రకాష్, క్వాలిటీ, జాయ్’ లాంటి కంపెనీలు దక్షిణాది మార్కెట్‌ని కంట్రోల్ చేస్తున్నాయి. వీటితోపాటు అరుణ్ లాంటి చిన్న చిన్న కంపెనీలు3,500 నుండి 4,000 వరకు మార్కెట్‌లో ఉన్నాయి.
పోటీ ఎక్కువగా ఉండడం, చంద్రమోహన్‌కు మార్కెట్ మీద అవగాహన, ఈ బిజినెస్‌లో అనుభవం లేకపోవడం.. వంటి కారణాల వల్ల అరుణ్ సక్సెస్‌కు చాలా టైం పట్టింది. కంపెనీ పెట్టిన కొత్తలో1.15 లక్షల రూపాయలుగా ఉన్న సేల్స్1981 నాటికి 4.25 లక్షల రూపాయలకు మాత్రమే పెరిగాయి. పదేండ్లు గడిచినా పెద్దగా డెవలప్మెంట్ లేకపోవడంతో రూట్ మార్చాడు. రెండో ఐస్ క్రీం ప్లాంట్ పెట్టాడు. కానీ.. అది పెట్టిన ప్లేస్‌కి వెళ్లి, వచ్చేందుకు ఈజీ యాక్సెస్ లేకపోవడంతో అతని ఐస్‌క్రీం లాగే క్లయింట్ల సంఖ్య కూడా కరిగిపోతూ వచ్చింది.
అలా ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న తర్వాత తోపుడు బండ్ల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టి మరో ప్రయోగం చేశాడు. చాలామందికి తోపుడు బండ్లు ఇచ్చి పెద్ద బ్రాండ్స్ వెళ్లని చిన్న గల్లీల్లో అరుణ్ ఐస్‌క్రీమ్ అమ్మేలా చేశాడు. అప్పటినుంచి బిజినెస్ పెరుగుతూ వచ్చింది.1991 నాటికి కంపెనీ ఆదాయం నాలుగు కోట్ల రూపాయలకు పెరిగింది.
కొత్త స్ట్రాటజీలు
మార్కెట్‌ని పెంచుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాడు చంద్రమోహన్. పెద్ద బ్రాండ్స్ బిజినెస్ చేయని ప్లేస్‌లపై ఎక్కువ ఫోకస్ చేశాడు. కాలేజీ క్యాంటిన్లలో ఐస్‌క్రీంలు అమ్మితే లాభాలు రావని పెద్ద కంపెనీలు అనుకునేవి. అందుకే వాటికి సప్లయ్ చేసేవి కాదు. అక్కడ తన ప్రొడక్ట్ ఉంచాడు చంద్రమోహన్. కాలేజీ స్టూడెంట్స్‌కి ఐస్‌క్రీం సప్లయ్ చేయడం మొదలుపెట్టాడు.
పైగా స్టూడెంట్స్‌కి కొత్త బ్రాండ్‌లను ట్రై చేయాలనే ఆసక్తి ఉంటుంది. అందుకే అక్కడ అమ్మాలి అనుకున్నాడు. ప్రొడక్ట్ క్వాలిటీ బాగుండడంతో స్టూడెంట్స్ ‘అరుణ్ ఐస్‌క్రీం’ని బాగా ఇష్టపడ్డారు. దాంతో కాలేజీ క్యాంటిన్లకు రెగ్యులర్ సరఫరా చేశాడు. అలా కొన్నేండ్లలో చెన్నయ్‌లోని చాలా కాలేజీల్లో అరుణ్ ఐస్‌క్రీం ఫేమస్ అయిపోయింది.
రూరల్ మార్కెట్
స్టూడెంట్స్ మెచ్చిన ఐస్‌క్రీంని గ్రామీణ ప్రాంతాలకు పరిచయం చేయాలి అనుకున్నాడు. అరుణ్ బ్రాండ్‌ని గ్రామాల్లో ‘ఫ్రెష్ ఐస్ క్రీం ఫ్రమ్ మద్రాస్’ అని ప్రచారం చేశాడు. జనాలు పెద్ద సిటీలో తినే ఐస్‌క్రీం ఊళ్లో ఉండే తినొచ్చు అనుకున్నారు. దాంతో రూరల్ మార్కెట్‌లో కూడా సేల్స్ బాగా పెరిగాయి. ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఉండే పెద్ద విద్యా సంస్థలకు (క్యాంటిన్లు, హాస్టల్స్) డ్రై ఐస్ కంటైనర్లలో ప్యాక్ చేసిన ఐస్ క్రీంలను సరఫరా చేయడం మొదలుపెట్టాడు.
తక్కువ ఖర్చుతో సప్లయ్ చేయడానికి ఇండియన్ రైల్వేని వాడుకున్నాడు. ఆ తర్వాత వ్యాపారాన్ని మరింత విస్తరించాడు. పాండిచ్చేరి (ప్రస్తుతం పుదుచ్చేరి), మధురై, శివకాశి, కుంభకోణం మొదలైన టైర్ 2, టైర్ 3 సిటీల్లో వ్యాపారం మొదలుపెట్టాడు.
బ్రిలియంట్ అడ్వర్టైజింగ్
చంద్రమోహన్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్‌లో కూడా చాలా ఎత్తులు వేశాడు. అందుకోసం ముఖ్యంగా పెండ్లిళ్లు, పెద్ద ఫంక్షన్లకు ఐస్ క్రీంలు సప్లయ్ చేయడం మొదలుపెట్టాడు. అరుణ్ ఏజెంట్ల ద్వారా ఐస్ క్రీంని ముందుగానే రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పించాడు. ముందుగా ఆర్డర్ చేసి, అవసరమైన టైంకి తీసుకోవచ్చని బిల్ బోర్డులపై ప్రచారం చేశాడు.
అప్పటివరకు ఇలాంటి అవకాశం ఏ కంపెనీ ఇవ్వలేదు. అందుకే.. అందులో కూడా అరుణ్ సక్సెస్ అయ్యింది. పైగా పెండ్లిళ్లలో అరుణ్ ఐస్‌క్రీం రుచి చూసిన వాళ్లు మళ్లీ కొనుక్కోవడం మొదలుపెట్టారు. దాంతో సేల్స్ బాగా పెరిగాయి.
సొంత పార్లర్లు
ఇండియాలో సొంతంగా ఐస్‌క్రీం పార్లర్లను ఏర్పాటు చేసుకోవడం అనేది ముందుగా అరుణ్ కంపెనీ మొదలుపెట్టింది. అప్పటివరకు షాపుల వాళ్లకు కంపెనీలు ఫ్రీజర్లను ఇచ్చి ఐస్‌క్రీంలను అమ్మించేవి. కానీ.. పెట్టుబడి ఎక్కువగా లేనప్పుడు అరుణ్ బ్రాండ్‌ను అమ్మడానికి ఆసక్తి ఉన్న దుకాణాలకు కూడా డీప్ ఫ్రీజర్ యూనిట్స్ ఇవ్వలేకపోయాడు చంద్రమోహన్. కానీ.. అప్పటికే కంపెనీకి మార్కెట్‌లో మంచి పేరొచ్చింది.
దాంతో1981లో ఒక వ్యక్తి ‘అరుణ్ ఐస్‌క్రీంలు అమ్మడానికి నాకు ఫ్రీజర్లకు బదులు ఎక్స్‌క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇవ్వండి. అలా ఇస్తే.. నా సొంత డబ్బుతో ఫ్రీజర్లు కొంటా. కస్టమర్లు కూర్చుని ఐస్‌క్రీంలు తినడానికి కొంత ప్లేస్ కూడా ఇస్తాన’ని చెప్పాడు. చంద్రమోహన్ కూడా ఒప్పుకోవడంతో మొదటి అరుణ్ ఐస్‌క్రీం పార్లర్ ఏర్పడింది.
పాల మార్కెట్‌లోకి..
ఐస్‌క్రీం ఇండస్ట్రీలో వచ్చిన సక్సెస్‌తో చంద్రమోహన్1986లో పాడి పరిశ్రమలో తన లక్ టెస్ట్ చేసుకోవాలి అనుకున్నాడు. పైగా ఐస్ క్రీం క్వాలిటీ, ప్రొడక్షన్.. పాల క్వాలిటీ, సప్లయ్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి చంద్రమోహన్ తన ఐస్ క్రీం కంపెనీ కోసం నేరుగా పాడి రైతుల నుండి పాలను కొనాలి అనుకున్నాడు. అలా ఖర్చు తగ్గించుకోవడంతోపాటు మరో బిజినెస్ పెట్టాలి అనేది ఆయన ఆలోచన. దాంతో.. ‘హట్సన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో మరో కంపెనీ పెట్టాడు. దాని పేరు ఇప్పుడు ‘హట్సన్ మిల్క్ ఫుడ్ లిమిటెడ్’గా మార్చారు.
అయితే.. ఈ కంపెనీ పెట్టాక 2000వ దశకం మొదట్లో చంద్రమోహన్ ఎక్కువగా దీనిమీదే ఫోకస్ పెట్టాడు. దాంతో ఐస్ క్రీం అమ్మకాలు పడిపోయాయి. మళ్లీ కోలుకోవడానికి దాదాపు ఆరేడేండ్లు పట్టింది. 2007లో ‘అరుణ్ ఐస్ క్రీమ్ అన్‌లిమిటెడ్’ పేరుతో కొత్త రకమైన ఐస్ క్రీం పార్లర్లు పెట్టారు. అందులో కస్టమర్లకు ఎన్ని కావాలంటే అన్ని స్కూప్‌లు ఇచ్చేవాళ్లు.
ఇప్పుడు హట్సన్ స్టోర్‌లు కూడా రెండు విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఉదయం పూట పాల డెలివరీ హబ్‌లుగా పనిచేస్తాయి. తర్వాత అరుణ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నాయి. హట్సన్ కంపెనీ ‘ఆరోక్య’ బ్రాండ్ పేరుతో మార్కెట్‌లో పాలు అమ్ముతోంది. కంపెనీ ఆదాయంలో కేవలం10 శాతం మాత్రమే ఐస్ క్రీం నుండి వస్తుంది. ఇప్పుడు అరుణ్ బ్రాండ్‌ని మహారాష్ట్ర, ఒరిస్సాలకు కూడా విస్తరించారు. అన్ని రాష్ట్రాల్లో భారీ నెట్‌వర్క్ ఉంది. వేరే దేశాలకు కూడా అరుణ్ ప్రొడక్ట్స్ ఎగుమతి అవుతున్నాయి.
తమిళనాడులో మొదలై..
అరుణ్ ఐస్‌క్రీం తయారుచేసే ప్లాంట్‌ని ముందుగా తమిళనాడులో మొదలుపెట్టారు. ఆ తర్వాత ఫ్రాంచైజ్ మోడల్ తీసుకొచ్చారు. దాంతో మిగిలిన అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో స్పీడ్‌గా విస్తరించింది. అంతేకాదు.. కంపెనీ వల్ల చాలామంది లాభాలు పొందారు. అందుకే ఫ్రాంఛైజీ వాళ్లలో కొందరు బ్రాండ్ మీద ప్రేమతో తమ పిల్లలకు ‘అరుణ్’ అని పేరు పెట్టుకున్నారు! 1985లో అరుణ్ తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందిన ఐస్ క్రీం బ్రాండ్‌గా ఎదిగింది.
1999 నాటికి తమిళనాడుతో పాటు కర్నాటక, కేరళ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 700 లొకేషన్లలో అందుబాటులోకి వచ్చింది. హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ1990ల్లో అనేక చిన్న ఐస్ క్రీం కంపెనీలను కొనేసింది. అప్పుడు కూడా అరుణ్ ఐస్ క్రీం మార్కెట్‌లో నిలబడింది. డిమాండ్ పెరుగుతుండడంతో చంద్రమోహన్1995లో రిఫ్రిజిరేషన్ యూనిట్లు ఉండే డెలివరీ కార్లను తీసుకొచ్చాడు. పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్టు సప్లయ్ కూడా పెంచాడు.