అయ్యో..ఆరూరి! పార్టీ మారినా ఫలితం దక్కలే..

  • బీజేపీ టికెట్ కోసం బీఆర్ఎస్​ను వీడిన రమేశ్​  
  • మోదీ ఇమేజ్ తో గెలుపు ధీమా
  • వ్యక్తిగత వ్యతిరేకతతో ఓటమి 

హనుమకొండ, వెలుగు: వరంగల్​ లోక్​సభ స్థానంలో బీజేపీ నుంచి బరిలో దిగిన అభ్యర్థి ఆరూరి రమేశ్​కు నిరాశే ఎదురైంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు వరకు బీఆర్ఎస్​లో కొనసాగిన ఆయన.. గెలిచే టికెట్​గా భావించి బీజేపీలో చేరినా ఫలితం మాత్రం దక్కలేదు. కేంద్రంలో మోదీ, బీజేపీ ఇమేజ్ తో ఇన్నాళ్లు గెలుపు ధీమాతో ఉన్న ఆయనకు లోక్​ సభ ఫలితాలు ఊహించని షాక్​ ని ఇవ్వగా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆరూరిపై వ్యక్తిగత వ్యతిరేకత ఉండడంతో మోదీ చరిష్మా కూడా పని చేయలేదని పలువురు అంటున్నారు.  

మోదీపైనే ఆశలతో బీజేపీలోకి..

వర్ధన్నపేట ఎమ్మెల్యేగా 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆరూరి రమేశ్​..2023 శాసనసభ ఎన్నికల్లోనూ లక్షకుపైగా మెజారిటీ ఆశించారు. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టి, బీఆర్ఎస్ ​సర్కారు ఏర్పడితే మంత్రి పదవి పొందాలని ఆశపడ్డారు. కానీ ఆయనపై, అనుచరులపై ఉన్న వ్యతిరేకతతో 19,458 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్​ నుంచి ఎంపీ టికెట్ ప్రయత్నాలు చేసినప్పటికీ  గులాబీ పార్టీకి, వ్యక్తిగతంగా తనకు పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో మోదీ చరిష్మాతోనైనా గెలవవచ్చనే ఉద్దేశంతో బీజేపీ వైపు చూశారు. 

బీఆర్​ఎస్​ ఎంపీ టికెట్​ఇస్తానన్నా వద్దనుకుని నాటకీయ పరిణామాల మధ్య మార్చి17న కాషాయ కండువా కప్పుకున్నారు. ఇదివరకటితో పోలిస్తే క్షేత్రస్థాయిలో బీజేపీకి పెరిగిన ఓటు బ్యాంక్​, మోదీ ఇమేజ్​తో గెలుపు తనదేనన్న భావనతో కౌంటింగ్ ముందు వరకు ధీమాతోనే ఉన్నారు. వరంగల్​లో మోదీ సభ కూడా నిర్వహించారు. కానీ, మొదటిసారి పోటీ చేసిన కాంగ్రెస్​ అభ్యర్థి కావ్య చేతిలో ఓడిపోయారు.