బచ్చన్నపేట, వెలుగు : వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని, ఇక బీఆర్‌ఎస్ ఆటలు సాగవని జనగామ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఆరుట్ల దశమంతరెడ్డి, బేజాటి బీరప్ప ధీమా వ్యక్తం చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో శుక్రవారం బీజేపీ ఆఫీస్‌ను ప్రారంభించి మాట్లాడారు. పదేళ్లలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేని కేసీఆర్.. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్‌పై విసుగెత్తిన ప్రజలు బీజేపీని గెలిపించేందుకు రెడీగా ఉన్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.
బీఆర్‌ఎస్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు చెప్పాలన్నారు. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే పేదలకు మేలు కలుగుతుందన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవినీతి, దోపిడీ మరింత పెరిగిపోనుందన్నారు. అనంతరం ఆఫీస్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు సద్ది సోమిరెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ బల్ల శ్రీనివాస్, నాయకులు కేవీఎల్‌ఎన్ రెడ్డి, బేజాటి సిద్ధప్ప, గణేశ్, జలంధర్ పాల్గొన్నారు.