పసుపు రైతులకు మరింత సేవచేసే అవకాశం దక్కింది: అర్వింద్

న్యూఢిల్లీ, వెలుగు: స్పైసెస్ బోర్డు సభ్యుడిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎన్నికయ్యారు. ఆయనతో పాటు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎన్నికైనట్లు లోక్ సభ బులెటిన్ విడుదల చేసింది. ఈ నెల 14న వీరి ఎన్నికను లోక్ సభ ఆమోదించినట్టు స్పష్టం చేసింది. కాగా, స్పైసెస్ బోర్డు మెంబర్​గా ఎన్నిక కావడంపై అర్వింద్ సంతోషం వ్యక్తం చేశారు. 

బోర్డు మెంబర్ గా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్​లోని పసుపు రైతులకు మరింత సేవచేసే అవకాశం లభించిందన్నారు. పసుపు, మిర్చి రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కృషిచేస్తానని అన్నారు. తాను ఎంపీగా ఎన్నికైన 8 నెలల్లోనే మోడీ ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా " రీజినల్ ఆఫీస్ కం ఎక్స్టెన్షన్ సెంటర్ " మంజూరు చేసిందని తెలిపారు. 

ఈ సెంటర్ ద్వారా స్పైసెస్ బోర్డు 2022–25 కాలానికి  రూ. 30 కోట్ల బడ్జెట్ ను ఆమోదించిందన్నారు. 1986 నుంచి 2020 వరకు దాదాపు35 ఏండ్లలో రాని బడ్జెట్ ఈ మూడేండ్లలో నియోజకవర్గానికి తీసుకొచ్చినట్లు వివరించారు. ఈ బడ్జెట్ లో ఇప్పటికే రూ. 9 కోట్ల నిధులు విడుదల అయ్యాయని  పేర్కొన్నారు. బోర్డు సభ్యుడిగా తన ఎన్నికకు సహకరించిన వారికి అర్వింద్ ధన్యవాదాలు తెలిపారు.