చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ను పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో ఆయనను నిలువరించారు. పోలీసులు అడ్డుకోవడంపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉందని, పోలీసులు ఇలా నిర్బంధించడంసరికాదని అన్నారు. ఇదిలా ఉంటే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశముందని పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అర్వింద్ మాత్రం వెనక్కి వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
కోరుట్ల మండలం ఐలాపూర్ లో ఓ వ్యక్తి చనిపోయాడు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన కాన్వాయ్ తో అక్కడకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మెట్పల్లి సమీపంలోని గండి హనుమాన్ వద్ద పోలీసులు ఆయన కారును అడ్డుకున్నారు. ముందుకెళ్లేందుకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఎంపీ అర్వింద్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటి అనంతరం అర్వింద్ను పోలీసులు వెనక్కి పంపారు. కోరుట్ల పట్టణంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తి ఏర్పాటు చేసిన నగల షాపును అడ్డుకోవాలంటూ స్థానిక స్వర్ణకారులు కొద్ది రోజుల క్రితం అరవింద్ కు ఫిర్యాదు చేసినట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. అర్వింద్ వస్తే ఈ వివాదం పెద్దగా అవుతుందని భావించిన పోలీసులు ఆయన్ను అడ్డుకున్నట్లు సమాచారం.