ఢిల్లీలోని జాట్​లకు బీజేపీ ద్రోహం : ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ: రిజర్వేషన్ల అంశంలో ఢిల్లీలోని జాట్‌‌‌‌‌‌‌‌లకు బీజేపీ ద్రోహం చేసిందని ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. కేంద్ర ఓబీసీ జాబితాలో వారిని ఎప్పుడు చేర్చుతారని ప్రశ్నించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోమవారం తన నివాసంలో జాట్ నేతల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘రాజస్థాన్​లోని జాట్​లు ఢిల్లీ యూనివర్సిటీ దాని అనుబంధ కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చు.

ఎయిమ్స్, సప్ధర్ జంగ్ హాస్పిటల్, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు. కానీ, ఢిల్లీలోని జాట్ లకు మాత్రం ఆ అవకాశం లేదు. ఢిల్లీలోని జాట్ కమ్యూనిటీని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చుతామని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అయితే, ఆ హామీని ఇప్పటికీ నెరవేర్చలేదు. ఆ కమ్యూనిటీని కేంద్ర ఓబీసీ జాబితాలో ఎప్పుడు చేర్చుతారని బీజేపీ అగ్రనేతలను నేను ప్రశ్నిస్తున్నాను” అని కేజ్రీవాల్ తెలిపారు.