సీఈసీకి బీజేపీ ఏ పదవి ఆఫర్ ఇచ్చిందో..? సీఈసీపై కేజ్రీవాల్ విమర్శలు

సీఈసీకి బీజేపీ ఏ పదవి ఆఫర్ ఇచ్చిందో..? సీఈసీపై కేజ్రీవాల్ విమర్శలు

న్యూఢిల్లీ: పదవీ విరమణ తర్వాత సీఈసీ రాజీవ్​కుమార్‎కు బీజేపీ ఏ పదవి ఆఫర్ ఇచ్చిందోనని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్​ఆద్మీ పార్టీ చీఫ్​అర్వింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం మరోసారి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌‌పై ఆయన మండిపడ్డారు. తన కాన్వాయ్‌‌పై జరిగిన దాడిని ఎన్నికల కమిషన్ చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని కేజ్రీవాల్ ఫైర్​అయ్యారు. ఎన్నికల కమిషన్‌‌ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 

“సీఈసీ రాజీవ్ కుమార్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేస్తున్నారు. దేశాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఆయనకు ఏ పదవి ఇచ్చారు..? ప్రతిఫలంగా మీరు దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయగల పదవి ఏమిటి..? గవర్నర్ లేదా రాష్ట్రపతి..? మీరు 45 సంవత్సరాలు పనిచేశారు. మీ కెరీర్ కోసం దేశాన్ని తాకట్టు పెట్టకండి. ఏదైనా పదవి పొందాలనే దురాశతో దేశ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయకండి” అని కేజ్రీవాల్ సూచించారు.

సీఈసీ రాజీవ్ కుమార్‎పై కేజ్రీవాల్​విరుచుకుపడడం ఇదే మొదటిసారి కాదు. రాజీవ్ కుమార్.. సీఈసీ పదవీ విరమణ తర్వాత మరో ఉద్యోగం కోసం చూస్తున్నారని గత నెల 30న అన్నారు. తన కాన్వాయ్‎తో పాటు ఆప్ కార్యకర్తలపై జరిగిన దాడులను ఉటంకిస్తూ.. “స్వేచ్ఛను పొందడానికి, దేశంలో ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడానికి స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. తద్వారా ప్రజలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలలో ఓటు వేసి నాయకులను ఎన్నుకుంటున్నారు. కానీ, ఎన్నికల కమిషన్ తన ఆయుధాలను బీజేపీకి అప్పగించిన విధానం చూస్తే, ఎన్నికల కమిషన్ ఉనికిలో  లేనట్లు అనిపిస్తోంది” ఆయన విమర్శించారు.