కేజ్రీవాల్ కూడా ఓడిపోయారు.. కారణాలు ఇవే..?

కేజ్రీవాల్ కూడా ఓడిపోయారు.. కారణాలు ఇవే..?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్ కు గురి చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. న్యూ ఢిల్లీ నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్.. బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహెచ్ సింగ్ చేతిలో ఓడిపోయారు. 3 వేల ఓట్ల తేడా కేజ్రీవాల్ ఓటమి.. ఆప్ పార్టీని షాక్ కు గురి చేసింది. 

న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి వరసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేజ్రీవాల్.. నాలుగోసారి ఓడిపోవటం.. అది కూడా పార్టీ అధినేత కావటం విశేషం. కేజ్రీవాల్ అంటేనే క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఈసారి మాత్రం ప్రజలు అలా అనుకోలేదు. 

లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లటం.. వాటర్ స్కాం, చెత్త స్కాం ఇలా ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కాంలో దాదాపు నాలుగు నెలలు జైలులోనే ఉన్నారు కేజ్రీవాల్. జైలుకు వెళ్లినా సీఎం పదవికి రాజీనామా చేయలేదు. జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత రాజీనామా చేసి.. ఆతిశీకి సీఎం పదవి కట్టబెట్టారు. కేజ్రీవాల్ కట్టిన సీఎం బంగ్లా సైతం విమర్శలకు తావిచ్చింది. పేదల ముఖ్యమంత్రిగా పేరున్న కేజ్రీవాల్.. పేదల గురించి మాట్లాడే కేజ్రీవాల్.. సీఎం అధికారిక భవనం మరమ్మతులకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టటంపైనా బీజేపీ విమర్శలు, ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. కేజ్రీవాల్ పేదల పక్షపాతి అనే పేరు కాస్తా.. అందరి రాజకీయ నేతల్లాగే కేజ్రీవాల్ మారిపోయారు అనే అపవాదు జనంలోకి వెళ్లింది. 

Also Read :- ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ లైవ్ అప్డేట్స్

ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ ను ఓడించటం చాలా మంది ఆశ్చర్యానికి గురి చేసింది. క్లీన్ ఇమేజ్ పోవటం, అవినీతి ఆరోపణలు రావటం వల్లే ప్రజలు ఓడించారనేది ఇప్పుడు నడుస్తున్న చర్చ. కేజ్రీవాల్ అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లటంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. కేజ్రీవాల్ పై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహెబ్ సింగ్ కూడా లోకల్ లీడర్ కావటం.. అతని తండ్రి మాజీ ఢిల్లీ సీఎం కావటం.. రాజకీయంగా పలుకుబడిన కుటుంబం కావటం కూడా కేజ్రీవాల్ ఓటమికి కారణం అయ్యింది. 

అన్నింటి కంటే ముఖ్యంగా.. మూడు సార్లు.. అంటే 2013 నుంచి వరసగా మూడు సార్లు ఆమ్ ఆద్మీపార్టీ గెలుస్తూ వస్తుంది.. సుదీర్ఘకాలం అధికారంలో ఉండటంతో సహజంగానే ఉండే ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఆప్ పార్టీ, కేజ్రీవాల్ ఓటమికి కారణం అయ్యింది.