ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్ట్ను అత్యున్నత ధర్మాసనంలో సవాల్ చేస్తూ మరోమారు ఆయన లీగల్ టీం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. సీబీఐ అరెస్ట్ను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా కేజ్రీవాల్కు నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో.. ఢిల్లీ సీఎం అత్యున్నత ధర్మాసనం మెట్లెక్కారు. అరవింద్ కేజ్రీవాల్ తరపున ఆయన అడ్వకెట్ వివేక్ జైన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. 

ఢిల్లీ లిక్కర్ పాలసీలో కేజ్రీవాల్ మనీ లాండరింగ్కు పాల్పడ్డారనే అభియోగాలతో ఈడీ కేజ్రీవాల్ను అప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ కేసులో సుప్రీం కోర్టులో తాత్కాలిక బెయిల్ మంజూరైనప్పటికీ ఇదే వ్యవహారంలో సీబీఐ కేసు కారణంగా కేజ్రీవాల్ ఇప్పటికే జైలులోనే ఉన్నారు. ఇదే కేసులో 17 నెలల జైలు శిక్ష అనుభవించిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీం కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. 

ఇక.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ నేడు సుప్రీంకోర్టు ముందుకు విచారణకు రానున్నది. ఈ పిటిషన్ పై సోమవారం జస్టిస్ బీఆర్. గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్​తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనున్నది. ఈ స్కామ్కు సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ ఈ నెల 8న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

లిక్కర్ స్కామ్​ కేసులో ఈ ఏడాది మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ  కవితను అరెస్ట్​ చేశాయి. దీంతో మార్చి 26 నుంచి ఆమె తిహార్ జైలులోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసుల్లో ఆమె పెట్టుకున్న తాత్కాలిక, మధ్యంతర బెయిల్ పిటిషన్లను రౌస్ ఎవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టులు నిరాకరించాయి. సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో లోపాలు ఉన్నాయని అరోపిస్తూ మరోసారి కవిత తాజాగా ట్రయల్ కోర్టును ఆశ్రయించారు‌‌‌‌. అయితే, ఈ పిటిషన్ పై విచారణ 2 సార్లు వాయిదాపడి.. ఈ నెల 7న కోర్టు ముందుకు రావాల్సి ఉండగా.. 6వ తేదీనే కవిత తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. తదుపరి పరిణామాల నేపథ్యంలో ఫైనల్గా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా.. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియాకు ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కవితకు బెయిల్ వస్తుందన్న భావనలో ప్రస్తుతం ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి. దీనికి తోడు కవిత ఆరోగ్యం క్షీణించడం, ఇతర అంశాలను వాదనల సందర్భంగా వినిపించనున్నట్టు తెలిసింది.