ప్రభుత్వాన్ని కూలగొట్టడం బీజేపీకి అలవాటుగా మారింది

  • జీఎస్టీ సొమ్ముతో ప్రభుత్వాలను కూల్చుతోంది
  • బీజేపీపై కేజ్రీవాల్​ ఫైర్​
  • 277 ఎమ్మెల్యేలను కొన్నదని ఆరోపణ

న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టడానికి బీజేపీ ఇప్పటిదాకా 277 మంది ఎమ్మెల్యేలను కొన్నదని ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొట్టడం  బీజేపీకి అలవాటుగా  మారిందని ఆయన విమర్శించారు. శుక్రవారం నిర్వహించిన ఢిల్లీ అసెంబ్లీ స్పెషల్​ సెషన్​లో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు గోవా, కర్నాటక, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, అరుణాచల్​ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలో సర్కార్లను బీజేపీ పెద్దలు పడగొట్టారని అన్నారు. 

అలాగే ఢిల్లీలో కూడా సీరియల్​ కిల్లర్ ​ఒకరు తయారయ్యారని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ, పెంచిన పెట్రో ధరల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ వాడుతోందని, తద్వారా రాష్ట్ర సర్కార్లను కూలగొడుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. కాగా, అసెంబ్లీ స్పెషల్​ సెషన్​లో  అధికార, విపక్షాల సభ్యులు రచ్చ చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆప్​ ఆరోపించగా.. లిక్కర్​ స్కామ్​కు పాల్పడి ప్రజలను మోసం చేశారంటూ ఆప్​పై బీజేపీ ప్రతి విమర్శ చేసింది.

కేంద్రం ఓ సీరియల్​ కిల్లర్: సిసోడియా

రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం సీరియల్  కిల్లర్​లా మారిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా అన్నారు. తనపై  నమోదైన సీబీఐ ఎఫ్ఐఆర్​ పూర్తిగా ఫేక్​ అని విమర్శించారు. ఎక్సైజ్​ విధానంలో అవినీతి జరిగిందని చెప్పడానికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారంలేదన్నారు.

విశ్వాస తీర్మానం ప్రవేశపెడ్తాం

బీజేపీ ‘ఆపరేషన్​ లోటస్’ ఫెయిలైందని నిరూపించేందుకు సోమవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెడ్తామని సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పెషల్​ సెషన్​ను ఒకరోజు పొడిగిస్తున్నామని ఆయన చెప్పారు. ‘‘మీ ఎమ్మెల్యేలను బీజేపీ కొంటున్నదని చాలా మంది మాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. అందువల్లే అసెంబ్లీలో మా బలం చూపేందుకు సోమవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెడ్తున్నాం” అని కేజ్రీవాల్ చెప్పారు.