- ఢిల్లీ రాష్ట్రంలో ఇచ్చాం.. గోవాలోనూ ఇస్తామంటున్న ‘ఆప్’ అధినేత కేజ్రివాల్
పనాజీ: త్వరలో ఎన్నికలు జరగునున్న రాష్ట్రాలపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వీలుచిక్కినప్పుడల్లా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఆయా రాష్ట్రాల్లో పార్టీ కేడర్ లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ రాష్ట్రంలో మాదిరిగా పూర్తి పారదర్శకంగా ప్రజారంజక పాలన తీసుకువస్తామని హామీలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఢిల్లీలో ఎలా తీర్చిదిద్దామో వీడియోలు, పవర్ పాయింట్ ప్రజంటేషన్ల ద్వారా జనంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు.
గోవాలో పర్యటిస్తున్న కేజ్రీవాల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీ వల్ల 87 శాతం ప్రజలు లబ్దిపొందుతారని చెప్పారు. ఢిల్లీ రాష్ట్రంలో ప్రజలకు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపిస్తున్నామని.. దేశ రాజధాని రాష్ట్రంలో అమలు చేస్తున్నప్పుడు గోవా ప్రజలకు ఎందుకివ్వలేమని కేజ్రీవాల్ ప్రశ్నించారు. గోవా రాష్ట్రం విద్యుత్ మిగులు రాష్ట్రం అయినప్పటికీ తరచూ విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహించి అడ్డదోవలో అధికారం చేజిక్కించుకుందని.. ప్రతిక్షంలో కూర్చోవాల్సిన బీజేపీ రాష్ట్రాన్ని ఏలుతుంటే అధికారంలో ఉండాల్సిన వారు విపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. అభివృద్ధి కోసమే బీజేపీలో చేరామని చెబుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రజాభిష్టం మేరకు పనిచేశారా అని ఆయన ప్రశ్నించారు. డబ్బుల కోసం వారు అమ్ముడుపోయి పార్టీ ఫిరాయించారని ప్రజలు చెబుతున్నారని.. తాము మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. గోవా రాజకీయాలకు ఫిరాయింపులు.. అవినీతి అక్రమాల జబ్బు పట్టుకుందని.. ఈ అవినీతి చీడ పీడల సంస్కృతిని సమూలంగా మార్చివేయాలని ఆప్ భావిస్తోందన్నారు. ప్రజలకు పారదర్శకమైన సచ్ఛీల పాలన అందించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కట్టుబడి ఉందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.