ఢిల్లీ పాలిటిక్స్..తాగే నీళ్లలో విషం కలుపుతారా?.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్

ఢిల్లీ పాలిటిక్స్..తాగే నీళ్లలో విషం కలుపుతారా?.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్
  • ప్రధాని తాగే నీళ్లలో విషం కలుపుతారా?
  • ఓటమి భయంతోనే ఆప్ ఆరోపణలు: మోదీ 
  • కేజ్రీవాల్​పై కేసు పెట్టిన హర్యానా సర్కార్ 
  • 17న విచారణకు రావాలని కోర్టు నోటీసులు 

న్యూఢిల్లీ: యమునా నది నీళ్లలో హర్యానాలోని బీజేపీ సర్కార్ విషం కలుపుతున్నదన్న ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపణలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ప్రధాని తాగే నీళ్లలో విషం కలుపుతారా? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఆప్ అసత్య ఆరోపణలు చేస్తున్నదని ఫైర్ అయ్యారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ కర్తార్ నగర్ లో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘హర్యానా ప్రజలపై కేజ్రీవాల్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. హర్యానా, ఢిల్లీ ఒక్కటి కాదా?

అవి రెండు వేర్వేరా? హర్యానా ప్రజల పిల్లలు, బంధువులు ఢిల్లీలో లేరా? తమ సొంత వాళ్లను చంపేందుకు హర్యానా ప్రజలు యమునా నీళ్లలో విషం కలుపుతారా? ఢిల్లీ ప్రజలతో పాటు ఇక్కడ ఉండే ప్రధాని, జడ్జీలు, డిప్లొమాట్స్ కూడా హర్యానా నుంచి వస్తున్న యమునా నీళ్లనే తాగుతున్నారు.

ప్రధాని తాగే నీళ్లలో హర్యానాలోని బీజేపీ సర్కార్ విషం కలుపుతుందా? అసలు మీరేం మాట్లాడుతున్నారు?” అని కేజ్రీవాల్​పై మోదీ ఫైర్ అయ్యారు. ‘‘యమునా నది ప్రక్షాళన పేరుతో గత రెండు ఎన్నికల్లో ఓట్లడిగిన ఆప్.. ఆ హామీని నెరవేర్చలేదు. ఇప్పుడు యమునా నీళ్ల పేరుతో రాజకీయం మొదలుపెట్టింది. అందుకే అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. చార్లెస్ శోభరాజ్​ మాదిరి.. తరచూ ప్రజలను మోసం చేయాలని ఆప్ చూస్తున్నది” అని మండిపడ్డారు. 

యమునా నీళ్లు తాగిన సైనీ.. 

యమునా వివాదం నేపథ్యంలో ఆ నది నీళ్లను హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ తాగారు. ఆయన బుధవారం హర్యానా బార్డర్​లో యమునా వద్దకు చేరుకుని నదిలో ప్రవహిస్తున్న నీళ్లను డైరెక్టుగా తాగారు. ‘‘హర్యానా బార్డర్​లో పవిత్ర యమునా నది నీళ్లను నేను తాగాను. ఢిల్లీ సీఎం ఆతిశి అక్కడికి రాలేదు. ఆమె మరో కొత్త అబద్ధం ఇప్పటికే సృష్టించి ఉంటుంది. కానీ అబద్ధాలు ఎప్పటికీ నిలబడవు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది” అని సైనీ ట్వీట్​ చేశారు. 

కేజ్రీవాల్ వర్సెస్ రాహుల్

యమునా నీళ్లు తాగాలంటూ ఆప్ చీఫ్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. ‘‘అమిత్ షాజీ, రాహుల్ జీ.. మీకు దమ్ముంటే 7పీపీఎం అమ్మోనియా లెవల్స్ ఉన్న యమునా నీళ్లను మీడియా ముందు తాగండి” అని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. దీనికి రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ‘‘యమునా నదిని ప్రక్షాళన చేస్తామని మీరు ఇచ్చిన హామీ ఏమైంది? ముందు.. మీరు వెళ్లి యమునా నీళ్లను తాగండి” అని రాహుల్ అన్నారు.

కేజ్రీవాల్ పై కేసు.. 

యమునా నీళ్లపై ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్​పై హర్యానా సర్కార్ కేసు పెట్టింది. ఆయనపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద సోనిపట్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టులో కేసు ఫైల్ చేసింది. ‘‘హర్యానా సర్కార్​పై కేజ్రీవాల్ అసత్య ఆరోపణలు చేశారు. యమునా నీళ్లలో హర్యానా సర్కార్ విషం కలుపుతున్నదని ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించారు” అని అందులో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఫిబ్రవరి 17న విచారణకు రావాలని కేజ్రీవాల్​ను ఆదేశించింది.