- ఓట్ల కోసం డబ్బులు పంచుతున్న పార్టీకి మద్దతా?
- మోహన్ భగవత్‌కు ఆప్ చీఫ్ కేజ్రీవాల్ లేఖ
న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీపై ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘బీజేపీ చేసే తప్పిదాలను మీరు సమర్థిస్తారా?’’ అంటూ ఆర్ఎస్ఎస్ను ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ఓటర్లకు బీజేపీ డబ్బులు పంచుతున్నదని ఆరోపించారు. ఈ చర్యలకు మీరు మద్ధతిస్తారా? అని మోహన్ భగవత్‌ను నిలదీశారు. ‘‘‘ఢిల్లీ ఎలక్షన్స్‌లో విజయం సాధించేందుకు బీజేపీ నేతలు బహిరంగంగానే డబ్బులు పంచుతున్నారు. ఓట్ల కొనుగోలును ఆరెస్సెస్ సమర్థిస్తుందా? పూర్వాంచల్, దళితులు, ఏండ్లుగా మురికివాడల్లో నివసిస్తున్న పేదల ఓట్లను పెద్దఎత్తున తొలగిస్తున్నారు.
ప్రజాస్వామ్యానికి ఇది సరైనదని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నదా?’’ అని భగవత్‌ను ప్రశ్నించారు. కాగా, కేజ్రీవాల్‌కు సంఘ్ తో కనెక్షన్ ఉన్నదని, ఈ విషయం కేజ్రీవాల్ తాజా లేఖతో బహిర్గతమైందని కాంగ్రెస్ సీనియర్ నేత సందీప్ దీక్షిత్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలను వ్యతిరేకించే కాంగ్రెస్ లేదా ఏ ఇతర నాయకులు ఇలాంటి లేఖలు రాయరని చెప్పారు.మరోవైపు, ఆప్ వైఫల్యాలను ఎండగడుతూ కేజ్రీవాల్‌కు బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా ఇటీవల లేఖ రాశారు. అవినీతిని అంతం చేయాలని, తప్పుడు వాగ్ధానాలను మానేయాలని, యమునా నది దుర్బర స్థితికి ఢిల్లీవాసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.