న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం ఆటో డ్రైవర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఆటో డ్రైవర్లపై హామీల వర్షం కురిపించారు. ఎవరైనా ఆటోడ్రైవర్ తన కూతురి పెండ్లి చేస్తే ఆ కుటుంబానికి పెండ్లి ఖర్చుల కోసం ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
అలాగే.. హోలీ, దీపావళి పండుగలకు ఆటో డ్రైవర్లకు కొత్త బట్టల కొనుక్కునేందుకు రూ.2,500 ఇస్తామని ప్రకటించారు. ఆటో డ్రైవర్లకు ప్రమాదం జరిగితే ఢిల్లీ ప్రభుత్వం రూ.5 లక్షల బీమా, రూ.10 లక్షల జీవిత బీమా కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. వీటితో పాటు ఆటో డ్రైవర్ల పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్పించడం కోసం పుచో యాప్ను మళ్లీ ప్రారంభించనున్నట్టు హామీ ఇచ్చారు.
ఆప్ హామీలతో ఢిల్లీలోని ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఏకంగా 62 సీట్లు గెల్చుకుని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.