గత కొన్ని నెలలుగా ఇండియా జీడీపీ లెక్కలపై పెద్ద గొడవే నడుస్తోంది. ఎన్డీయే ప్రభుత్వం లెక్కలు ఎక్కువ చేసి చెబుతున్నదన్న విమర్శలు ఉన్నాయి ఈ మధ్య హార్వర్డ్ ప్రొఫెసర్ అరవింద్ సుబ్రహ్మణ్యం రాసిన ఒక స్టడీపేపర్‌తో ఇది మరింత హీటెక్కింది. అరవింద్ సుబ్రహ్మణ్యం 2018 వరకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. 2011 –—12 నుంచి 2016-–17 వరకు మన జీడీపీ లెక్కలన్నీ తప్పేనని ఆయన అంటున్నారు. ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చినదానికంటే అర్థికవృద్ధి రేటు ఈ మధ్య కాలంలో 2.5 శాతం తక్కువ ఉన్నదని ఆయన అభిప్రాయం. ప్రభుత్వ లెక్క ప్రకారం జీడీపీ వృద్ధి రేటు ఈ మధ్య కాలంలో 7 శాతం. అరవింద్ లెక్కల ప్రకారం 4.5 శాతమే.
లెక్కలు ఈ తీరుగా తప్పుగా ఉన్నాయనడం పెద్ద సంచలనమే అయింది. చాలా మంది ఆర్థికవేత్తలు అరవింద్‌ను సమర్ధిస్తుండగా సూర్జిత్ భల్లా వంటి ఎకనామిస్ట్‌లు మాత్రం ఈ వాదనలను తప్పుబడుతున్నరు. అరవింద్ తప్పుపద్ధతిలో జీడీపీని లెక్కించారని వారు అంటున్నారు.
ప్రస్తుతానికి, ఈ గొడవలు పక్కన పెడితే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే – 2018-–19 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతం ఉంది. అరవింద్ లెక్కల ప్రకారం ఇది 4.1 శాతం మాత్రమే. మనం అనేక సంవత్సరాలుగా ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతోన్న ఆర్థిక వ్యవస్థ మనది అని ప్రచారం చేసుకుంటున్నాం. ఇప్పుడు చూస్తే చైనా కంటే వెనకబడిపోయాం.
రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా మన పరిస్థితి మెరుగుపడే సూచనలు ఏమీలేవు. ఇరాన్ పై అమెరికా ఆంక్షల వల్ల ప్రపంచమార్కెట్ లో చమురు ధరలు పెరుగుతున్నాయి. చైనా – అమెరికా వాణిజ్య యుద్దంతో మన ఎగుమతులు తగ్గే ప్రమాదం ఉంది. అమెరికా కూడా మనతో స్నేహంగా ఏమీ లేదు. రెండు దేశాల మధ్య ట్రేడ్‌లో మనకిస్తున్న కొన్ని రాయితీలను ఎత్తేసింది. ఇంకోవైపు మన దేశంలో అగ్రికల్చర్ సెక్టార్‌లో వందల సమస్యలున్నాయి. నిరుద్యోగం పెరుగుతున్నది. ప్రైవేట్ పెట్టుబడులు తగ్గాయి. వస్తువుల వినియోగం తగ్గింది. ఇప్పటికే బ్యాంకింగ్ రంగం దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల మొండిబకాయిల సమస్యతో సతమతం అవుతోంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు కూడా తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మొన్న నీతి అయోగ్ సమావేశంలో, ప్రధాని మోడీ 2024 నాటికి భారతదేశ జీడీపీని ప్రస్తుతం, అంటే 2019 మార్చి నాటికి ఉన్న 2.75 లక్షల కోట్ల డాలర్ల స్థాయి నుంచి 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకువెళ్తామని ప్రకటించారు. ఈ టార్గెట్‌ను సాధించాలంటే ఏటా 12 శాతం వృద్ధిరేటు సాధించాలి. డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఇండియా ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే చూసింది. అన్నీ మంచిగున్నయ్ అనుకున్న టైమ్‌లోనే అది సాధ్యమైంది. ఇప్పడు, పైన పేర్కొన్న ఆటంకాలూ, స్వయంకృత అపరాధాలూ అన్నింటి నడుమనా మనం ప్రధాని ఆశిస్తోన్న ఆర్ధిక స్థాయి అయిన 5 లక్షల కోట్ల డాలర్ల లక్ష్యాన్ని 2024 నాటికి ఎలా అందుకోగలం.? ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెనవేయడం అంటే ఇదేనేమో . ఈ అంచనాలు మన ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపించేందుకు మాత్రమే పనికివస్తాయి. ఈ రెండంకెల స్థాయి ఆర్ధికవృద్ధిలో రాష్ట్రాలకూ, వాటిలోని జిల్లాలకు సైతం పెద్ద పాత్ర ఉండాలని మోడీ అంటున్నారు. ఆయనతోపాటుగా ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కూడా అదే చెబుతున్నారు.
దేశంలోని ఎక్కువ మందికి జీవనాధారమైన వ్యవసాయ రంగంలో – కనీస గిట్టుబాటు ధరలు లేవు. మేకిన్ ఇండియా పేరుతో గుర్రానికి ముందర బండిని కట్టే ప్రణాళికలు వేస్ట్. పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను చావుదెబ్బ తీసింది. ఇటువంటి విధాన నిర్ణయాలతో కడకు పరిస్థితి దిగజారాక ; ఈవేళ చైనాతో స్నేహం కోసం, రష్యాతో పాతబంధం కోసం షాంఘై సహకార సంఘం సదస్సులో ఇండియా తాపత్రయపడుతోంది. ఇది ఎంతవరకు ఫలితమిస్తుందో తెలియదు. మరోవైపు తెలివిగా టార్గెట్ చేరుకోలేకపోతే ఆ తప్పును రాష్ట్రాల నెత్తిన వేసే కార్యక్రమం కూడా మొదలైంది.
పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నా, రాష్ట్రాలు తమ అమ్మకం పన్నును తగ్గించుకుంటే – ఆ ధరలు తగ్గివస్తాయంటూ గతంలోని యుపిఏ పాలకులు పదేపదే చెప్పేవారు. ఈ మధ్య కాలంలో ఎన్డీయే నేతలు కూడా ఇదే పాట పాడారు. కానీ పెట్రో ఉత్పత్తులపై తాము భారీగా వసూలు చేస్తోన్న ఎక్సైజ్ సుంకం గురించి మాత్రం నోరు మెదపరు. అలాగే, జీడీపీ విషయంలో కూడా, దానిని పెంచే భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల భుజాన వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పాలసీలు సరిగ్గా లేకుంటే రాష్ట్రాలు మాత్రం ఎలా డెవలప్ అవుతాయి. భారీ టార్గెట్లతో హంగామా చేయడం, రాష్ట్రాలను బెదిరించడం వల్ల ప్రజల జీవితాల్లోనైతే మార్పు రాదు.
‑ డి. పాపారావు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్