- వైశ్య భవన్ కు పర్మిషన్ ఇవ్వొద్దని ఎండోమెంట్ లెటర్
- సత్రం అందరి ఆస్తి అంటున్న సీపీఐ
- చందాలు ఇచ్చినంత మాత్రాన ప్రజల ఆస్తి కాదన్న ఎమ్మెల్యే
- దశాబ్ద కాలంగా కొనసాగుతున్న గొడవలు
జగిత్యాల, వెలుగు : జిల్లా కేంద్రంలో ఆర్య వైశ్యులు ఆర్య వైశ్య సంఘ భవనంగా పేర్కొంటున్న సర్దార్ సత్రం దశాబ్ద కాలంగా వివాదానికి చిరునామాగా నిలుస్తోంది. గతంలో ఎండోమెంట్ ద్వారా నిర్వహణ బాధ్యతలు పొందిన ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో దుకాణాల సముదాయం నిర్మించడానికి సన్నాహాలు చేస్తూ బల్దియాలో మ్యూటేషన్ కోసం అప్లికేషన్ చేసుకోవడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై సమాచార హక్కు కార్యకర్త చేసిన ఫిర్యాదుతో మ్యూటేషన్ రద్దు చేస్తున్నట్లు అప్పటి ఆఫీసర్లు తిరిగి సర్దార్ సత్రంగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయ్యింది. ప్రస్తుతం కమర్షియల్ కాంప్లెక్స్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేయడంతో దాన్ని వ్యతిరేకిస్తూ సత్రం ప్రజలందరి ఆస్తి అని సీపీఐ, వివిధ కుల సంఘాల ప్రతి నిధులు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. మరోవైపు చందాలు ఇచ్చినంత మాత్రన ప్రజల ఆస్తి కాదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో కుల సంఘాలు మండిపడుతున్నాయి.
ఎండోమెంట్ రికార్డులో ఏముంది..?
1952లో వైశ్య కులస్తులు అంగడి మఠం వీరయ్య నుంచి 30,690 చదరపు అడుగుల స్థలాన్ని కొను గోలు చేశారు. తర్వాత అన్ని వర్గాల నుంచి సేకరించిన చందాలతో ఖాళీ స్థలంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్మారకార్ధం శ్రీసర్ధార్ సత్రం నిర్మించారు. ఈ క్రమంలో అప్పటి కరీంనగర్ ఎండోమెంట్ ఆసిస్టెంట్ కమిషనర్ ద్వారా ఎండోమెంట్ సర్దార్ సత్రాన్ని ఆధీనంలోకి తీసుకుని నాన్ హెరిడిటరీ(వంశ పారం పర్యం కాని) ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ మేరకు ధర్మకర్తల మండలి కాల పరిమితి 1992 జనవరి 24న ముగియడంతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాలన కొనసాగింది. వంశపారంపర్య హక్కులు లేనప్పటికీ పట్టణ ఆర్య వైశ్య సంఘం పేరిట బల్దియాలో మ్యూటేషన్ చేసుకోవడం, ఆర్య వైశ్య సంఘం పేరిట ఉన్న మ్యూటేషన్ రద్దు అయినప్పటికీ మళ్లీ దుకాణ సముదాయం కోసం దరఖాస్తు చేయడంతో అభ్యంతరాలకు వెల్లువెత్తున్నాయి.
పర్మిషన్ ఇవ్వొద్దని ఎండోమెంట్ లెటర్..
వైశ్య భవన్ నిర్మాణం కోసం సర్దార్ సత్రం(వైశ్య భవన్) నిర్వహణ కమిటీకి ఎలాంటి పర్మిషన్ ఇవ్వొద్దని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ జగిత్యాల బల్దియా కమిషనర్ కు లేఖ రాశారు. ఇందులో ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ఇన్స్టిట్యూట్అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 చట్టాన్ని పేర్కొంటూ గతంలో ఉన్న దుకాణ సముదాయాన్ని
ఎలాంటి పర్మిషన్ లేకుండా కూల్చి వేశారని పేర్కొన్నారు. ఎండోమెంట్ అభ్యంతరం తో పర్మిషన్ రాలేదు. ప్రస్తుతం మరో సారి మూడు నెలల క్రితం ఆర్యవైశ్యులు దరఖాస్తు చేసుకున్నారు. 2009 లో జీఓ నంబర్ 303 ద్వారా సర్దార్ సత్రాన్ని అర్యవైశ్య సంఘానికి అప్పగించినట్లు ఎండోమెంట్ ఉత్తర్వులు జారీ చేయగా, అదే ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ 2015 జనవరి 2న తమ అనుమతి లేకుండా సర్దార్ సత్రానికి బల్దియా ఎలాంటి పర్మిషన్ ఇవ్వొద్దని లేఖలో పేర్కొనడంతో ఆఫీసర్లు ఆయోమయానికి గురవుతున్నారు.
జీఓ 303పై ఉద్యమిస్తాం
స్థలం కొనుగోలు చేసిన కమిటీ సభ్యులకు వంశ పారంపర్య ధర్మకర్తలు లేరని రికార్డుల్లో ఎండోమెంట్ స్పష్టం చేసింది. అందుకే సర్దార్ సత్రాన్ని ఎండోమెంట్ స్వాధీనం చేసుకుంది. సర్కార్ విచారణ చేసి జీఓ 303 రద్దు చేయాకుంటే ఉద్యమిస్తాం.
- వెన్న సురేశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి, జగిత్యాల
ఆదేశాలు అనుసరిస్తాం
జగిత్యాల పట్టణంలో సింగిల్ విండో సిస్టంలో వైశ్య భవన్(సర్దార్ సత్రం) పేరు మీద బిల్డింగ్ నిర్మాణం కోసం అప్లై చేసుకున్నారు. ఈ అప్లికేషన్ పై స్టడీ చేసి ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఫైల్ ని ఫార్వడ్ చేస్తున్నాం. - గంగాధర్, బల్దియా కమిషనర్, జగిత్యాల