- ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి
చౌటుప్పల్, వెలుగు : సీఎం కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదని, అందుకే టీఆర్ఎస్కు ఓటు వేయవద్దని మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నామని ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి నాయకుడు ప్రేమ్ స్పష్టం చేశారు. ఆదివారం చౌటుప్పల్ లో ‘టీఆర్ఎస్ ను బ్యాన్ చేస్తున్నాం’ అని ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ తీశారు.
ఆర్యవైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేయనందుకు నిరసనగా మునుగోడు ఉప ఎన్నికలో ఆర్యవైశ్యులందరూ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే, మునుగోడులో ఈ 12 రోజులు రోజుకో మండలం చొప్పున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ 119 నియోజకవర్గాల్లో తిరుగుతూ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు.