Aryaman Vikram Birla: ఆస్తి విలువ రూ.70 వేల కోట్లు.. 22 ఏళ్లకే భారత క్రికెటర్ రిటైర్మెంట్

భారత క్రికెటర్ ఆర్యమాన్ బిర్లా ఇటీవలే అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇందులో ఆశ్చర్యమేముంది అనుకుంటే పొరపాటే. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత అతని గురించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అతని వయసు కేవలం 22 ఏళ్లు కాగా.. సంపద విలువ ఏకంగా రూ.70 వేల కోట్లు కావడం విశేషం. ఆస్తి విషయంలో విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్, ధోనీలాంటి దిగ్గజాలను దాటేశాడు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా.. 

అతని పేరు ఆర్యమాన్ బిర్లా. బిలియనీర్ కుమార మంగళం బిర్లా తనయుడు అతడు. దేశంలోనే అత్యంత సంపద కలిగిన వ్యాపారవేత్తల్లో కుమార మంగళం బిర్లా ఒకరు. సాధారణంగా బిజినెస్ మ్యాన్ కొడుకు ఆ రంగంలోనే ఉండడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ఆర్యమాన్ బిర్లా మాత్రం దీనికి భిన్నం. అతను క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకొని ఆశ్చర్యపరిచాడు. గతేడాది అతన్ని ఆదిత్య బిర్లా గ్రూప్ లోని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటెయిల్ లిమిటెడ్ కు డైరెక్టర్ ను చేశారు.

అంతేకాదు ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కు కూడా అతడే డైరెక్టర్. ఈ బాధ్యతలు రావడంతో అతడు కేవలం 22 ఏళ్ల వయసులోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.
    
క్రికెట్ ప్రయాణం ఎలా మొదలైందంటే..?

ఆర్యమాన్ 1997లో ముంబైలో జన్మించి మధ్యప్రదేశ్ లోని రేవాకు వెళ్లాడు. అక్కడే ఆదిత్య బిర్లా గ్రూపు సిమెంట్ యూనిట్ ఉంటుంది. మధ్యప్రదేశ్ లోనే జూనియర్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఆర్యమాన్.. తర్వాత మెల్లగా రంజీ ట్రోఫీ స్థాయికి ఎదిగాడు. 2017లో తొలిసారి మధ్యప్రదేశ్ తరఫున ఒడిశాపై రంజీ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో వరుసగా 16, 6 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఏడాది తర్వాత కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ లో ఆర్యమాన్ తొలి సెంచరీ చేశాడు. బెంగాల్ తో మ్యాచ్ లో అతడు 103 రన్స్ చేయడం విశేషం.

2018లో రంజీ ట్రోఫీ సెంచరీ తర్వాత అదే ఏడాది రాజస్థాన్ రాయల్స్ అతన్ని వేలంలో కొనుగోలు చేసింది. రెండు సీజన్ల పాటు జట్టుతోనే ఉన్నా.. తుది జట్టులో మాత్రం ఎప్పుడూ చోటు దక్కించుకోలేకపోయాడు. వరుస గాయాలు కూడా కావడంతో జనవరి, 2019 తర్వాత అతడు అసలు క్రికెట్ ఆడలేకపోయాడు.