అన్నదాతకు అప్పుల భారం.. కరెంట్ తిప్పలు తప్పవా?

అన్నదాతకు అప్పుల భారం.. కరెంట్ తిప్పలు తప్పవా?

తెలంగాణ సర్కారు తాజా బడ్జెట్​లో రైతు రుణమాఫీకి సరిపోయే నిధులు కేటాయించలేదు. ఫలితంగా రైతులకు బయట అప్పుల భారం తప్పేలా లేదు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ, దక్షిణ  తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఈ రుణాలను పూర్తి స్థాయిలో డిస్కమ్ లకు చెల్లించడానికి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించలేదు. అంటే రైతులకు విద్యుత్ కోతల తిప్పలు తప్పేలా లేవు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023–2024 సంవత్సరానికి బడ్జెట్ ను ఆమోదించింది. బడ్జెట్ ఎప్పుడూ బహిరంగ సభలో ఒక పార్టీ చేసే రాజకీయ ప్రకటన కాదు. ఎన్నికల సందర్భంగా  నాయకులు ఇచ్చే హామీ అంతకంటే కాదు. బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల, ఖర్చు నిర్ధిష్టంగా, పారదర్శకంగా, చట్టబద్ధంగా ఉండాలి. బడ్జెట్ లో ఆదాయ అంచనాలు వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. అప్పుడే కేటాయింపులు కూడా ఆచరణాత్మకంగా ఉంటాయి. కానీ గతంలో లాగానే ఈసారి కూడా ఆదాయ అంచనాలు, కేటాయింపులు భారీగా కనపడుతున్నా ఖర్చుల విషయంలో నిరాశే ఎదురయ్యేలా ఉంది. 2019–-2020లో  రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి రూ. 21,680 కోట్లు కేటాయించి, రూ.15,558 కోట్లు ఖర్చు చేసింది. 2020–-2021లో రూ. 25,305 కోట్లు కేటాయించి కేవలం రూ. 17,808 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2021-–2022 లో రూ. 26,822 కోట్లు కేటాయించినా 65 శాతం మాత్రమే ఖర్చు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 27,228 కోట్లు కేటాయిస్తే, 2023–-2024 ఆర్థిక సంవత్సరానికి మాత్రం కేవలం రూ. 26,831 కోట్లు మాత్రమే కేటాయించింది. వ్యవసాయ రంగ కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే  మొత్తం కేటాయింపుల్లో రైతు బంధు, రైతు బీమా పథకాలకు తప్ప మిగిలిన వాటికి కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం లేదని స్పష్టమవుతున్నది. 

రుణమాఫీ పూర్తి అయ్యేదెన్నడు?

2018 ఎన్నికల సందర్భంగా రైతులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2019–-2020లో రూ. 4,528 కోట్లు , 2020–-2021లో రూ. 6,225 కోట్లు, 2021-–2022లో రూ.5,225 కోట్లు, 2022–-2023 లో రూ. 4000 కోట్లు కేటాయించింది. కానీ ఆచరణలో గత 4 బడ్జెట్ లలో కేటాయించిన నిధులతో  కేవలం 25 వేల  రూపాయల లోపు రుణాల వరకు రూ. 408.38 కోట్లు, 25,001 నుంచి 35 వేల రూపాయల లోపు రుణాలను 691.82 కోట్లు మాత్రమే మాఫీ చేశారని ఎస్‌‌ఎల్‌‌బీసీ 2022 మార్చి 31 నాటికి ఉన్న నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఎన్నికల సంవత్సరం. ఈ ప్రభుత్వం 2018 ఎన్నికల  హామీల అమలుకు చివరి సంవత్సరం. కానీ ఈ సారైనా మొత్తం రుణ మాఫీ చేయడానికి పూర్తి నిధులు కేటాయించకుండా ఈ బడ్జెట్ లో కూడా కేవలం రూ.6,385 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇప్పటికే సంస్థాగత రుణ సౌకర్యం రైతుల్లో మెజారిటీ భాగానికి అందడం లేదు. అంటే అప్పుల భారంతోనే రైతులు మరింత కాలం మగ్గాల్సి వస్తుంది. 2014-–2018 మధ్య వడ్డీ లేని రుణాలకు, పావలా వడ్డీ రుణాలకు ఇంకా  రూ.725 కోట్లు బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ఎస్‌‌ఎల్‌‌బీసీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2018–2023 మధ్య కూడా పంట రుణాలపై వడ్డీ రాయితీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చడం లేదు. ఫలితంగా రైతులపై వడ్డీ భారం పడుతున్నది. ఈ బడ్జెట్ లో వడ్డీ లేని రుణాల కోసం అంటూ రూ.1500 కోట్లు కేటాయించినా, గత అనుభవాల దృష్ట్యా వాటిని సకాలంలో విడుదల చేస్తారో లేదో వేచి చూడాలి.

డిస్కంలకు నిధులు

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా మంచి పథకమే అయినా, ఈ యాసంగిలో విచ్చలవిడి విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు  ఆందోళనలు చేస్తున్నారు. పైగా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్న పంపిణీ సంస్థలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఈ రుణాలను పూర్తి స్థాయిలో డిస్కమ్ లకు చెల్లించడానికి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించలేదు. అంటే రైతులకు విద్యుత్ కోతలు మరింత పెరుగుతాయి. 2023 ఖరీఫ్ నుంచి పంటల బీమా పథకాలను ప్రవేశ పెట్టాలని, పంట నష్టాలకు పరిహారం చెల్లించడానికి కేటాయింపులు ఉండాలని, విత్తనాలు, యాంత్రీకరణ  లాంటి సబ్సిడీ పథకాలను కొనసాగించడానికి నిధుల కేటాయింపు ఉండాలని  రైతులు కోరుకుంటున్నారు. వరికీ, పత్తికీ ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు లాంటి పంటలను ప్రోత్సహించడానికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరుతున్నా, ఈ బడ్జెట్ లో కూడా ప్రభుత్వం మొండి చేయే చూపింది. మన రాష్ట్ర వాతావరణానికి అనువుగాని ఆయిల్ పామ్ పంటకు మాత్రం బడ్జెట్ లో రూ.1000 కోట్ల నిధులు కేటాయించింది. బడ్జెట్ కేటాయింపులు భారీగా ఉన్నా, ఆచరణలో నిధులు విడుదల చేసి, ఖర్చు చేయక పోతే, లేదా అవసరమైన వాటికి ఖర్చు చేయకపోతే, ప్రభుత్వం చేసే అట్టహాసపు బడ్జెట్ కేటాయింపులు వృథానే అవుతాయి.

నిధుల దుర్వినియోగం?

ఒక వైపు రైతుల సంఖ్య, నికర సాగు విస్తీర్ణం పెరుగుతున్నట్లు ప్రకటిస్తున్న ప్రభుత్వం.. మరో వైపు వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించడమంటే ఎప్పటి లాగే వచ్చే సంవత్సరం కూడా కొన్ని పథకాలకు నిధుల్లో కోత పెట్టనుందని అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కీలక పథకంగా అమలు చేస్తున్న రైతు బంధుకు భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ, ఆ నిధుల్లో కనీసం 40 శాతం నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ నిధులు వ్యవసాయం చేయని రైతులకు, వ్యవసాయం చేయని భూములకు కూడా ఇస్తున్నారు. రాష్ట్ర సాగు దారుల్లో 35 శాతంగా ఉన్న కౌలు రైతులకు గానీ, ఆదివాసీ ప్రాంతాల పోడు రైతులకు గానీ, భూమిపై హక్కులు లేని మహిళా రైతులకు గానీ ఒక్క రూపాయి కూడా రైతు బంధు సాయం అందడం లేదు. వీరికి పెట్టుబడి సాయం అందించడంపై ఈ బడ్జెట్ లో కూడా ప్రభుత్వం ఎటువంటి విధాన ప్రకటనా చేయలేదు. ఈ విధాన నిర్ణయం తీసుకోనంత వరకు రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కొనసాగే ప్రమాదం పొంచి ఉంది. రైతు కుటుంబాలకు ఉపయోగపడే రైతు బీమా పథకం కూడా కేవలం పట్టా హక్కులు కలిగిన రైతులకే ఈ సారి కూడా పరిమితం చేశారు. రైతు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లుగా, సొంత భూమి లేని కౌలు రైతులకు గానీ, వ్యవసాయ కూలీలకు గానీ, మిగిలిన గ్రామీణ కుటుంబాలకు కానీ ఈ పథకాన్ని విస్తరించడానికి ఈ బడ్జెట్ లోనూ ఎలాంటి ప్రకటనా చేయలేదు, నిధులు కేటాయించలేదు. 

- కన్నెగంటి రవి, 
రైతు స్వరాజ్య వేదిక