- పార్టీ కోసం పని చేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలంటున్న హై కమాండ్
- కొత్త, పాత నేతల మధ్య పోటీ
- ఎంపిక ప్రక్రియపై ఎమ్మెల్యేల కసరత్తు షురూ
నాగర్ కర్నూల్, వెలుగు: వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాలను రద్దు చేసిన ప్రభుత్వం త్వరలో కొత్త పాలకవర్గాల ఏర్పాటుకు నిర్ణయించడంతో ఎమ్మెల్యేల చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ కోసం పని చేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్న నేతలతో పాటు పార్టీ మారిన అగ్ర నేతలు, వారి అనుచరుల మధ్య పోటీ నెలకొంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, ఆమనగల్లు మార్కెట్ యార్డులు ఉన్నాయి.
ఎవరికి వారే ప్రయత్నాలు..
నాగర్ కర్నూల్ మార్కెట్ చైర్మన్ పోస్టు కోసం పలువురు ఆశావహులు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెల్కపల్లి మండల లీడర్లుటీం వర్క్ చేశారు. ఈ సారి తెల్కపల్లి మండలానికి చెందిన లీడర్‌కు చైర్మన్ గా అవకాశం ఇస్తారని అంటున్నారు. బిజినేపల్లి మండల సీనియర్ నాయకుడు కూచుకుళ్ల సుహాసన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ తిరుపతయ్య, మాజీ ఎంపీపీ కోటయ్య, నర్సింహ్మారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఏడు మండలాలున్నాయి. ఒకటే నామినేటెడ్ పోస్ట్ ఉండడంతో దానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మార్కెట్ చైర్మన్ రేసులో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రంగినేని జగదీశ్వరుడు(జగ్గుసార్), రాము యాదవ్, నర్సింహారావు, బిచ్చారావు పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడకుండా కొనసాగుతున్న నాయకులతో పాటు మంత్రి జూపల్లిని నమ్ముకున్న లీడర్లు ఉన్నారు. చివరి నిమిషంలో తెరపైకి కొత్త పేర్లు వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అచ్చంపేటలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి పేరు ముందువరుసలో ఉంది.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇప్పటి వరకు అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూరు మండలాలకు చెందిన వారికే మార్కెట్ చైర్మన్లుగా అవకాశం లభించింది. అమ్రాబాద్, పదర, లింగాల మండలాల లీడర్లకు అవకాశం దక్కలేదు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎటు వైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ రేసులో చాలా మంది లీడర్లున్నారు. వీరిలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, పంజుగుల అశోక్ రెడ్డి, చింతల రమణారెడ్డి ముందు వరుసలో ఉన్నారు.
ఈ నెల 30తో సర్పంచుల పదవీకాలం ముగియనుండడంతో, వెల్డండ సర్పంచ్ యెన్నం భూపతిరెడ్డి కూడా రేస్‌లోకి వస్తారని సమాచారం. వంగూరు, ఊర్కొండ మండలాల లీడర్లు కూడా ఈ పోస్టుకు పోటీ పడుతున్నారు. వైస్ చైర్మన్ పోస్ట్ వంగూరు లేదా ఊర్కొండ మండలాలకు ఇచ్చే ఆనవాయితీ ఉంది. ఈ సారి అది కొనసాగుతుందా లేదా అనే చర్చ నడుస్తోంది. ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ రేసులో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి వర్గీయులు పోటీపడుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మార్కెట్ చైర్మన్ల ఎంపిక వ్యవహారం అగ్రనాయకులకు సవాలేనని అంటున్నారు. అయితే ఈ పోస్టుల కోసం పార్టీ కోసం పని చేసిన నేతలు తమ పేర్లను పరిశీలించాలని ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎంపికపై కసరత్తు షురూ..
నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ మార్కెట్ కమిటీల ఎంపికపై మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు డా.వంశీకృష్ణ, డా.కూచుకుళ్ల రాజేశ్రెడ్డిలకు స్పష్టత ఉంది. నాగర్ కర్నూల్ చైర్మన్ ఎంపికలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కల్వకుర్తి, ఆమనగల్లు మార్కెట్ కమిటీల ఏర్పాటుపై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చిన్న సైజు కసరత్తు చేయాల్సి ఉంటుంది. రెండు కమిటీల ఎంపిక, చైర్మన్లుగా ఎవరిని నియమించాలనే దానిపై కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌రెడ్డి సలహాలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఇద్దరు నేతలు ఆమనగల్లు, కల్వకుర్తి మార్కెట్ కమిటీలను పంచుకునే అవకాశం కూడా లేకపోలేదని సమాచారం.