- బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌నుంచి రసమయి, ఆరేపల్లి, కవ్వంపల్లి
- మానకొండూరులో గతంలోనూ వీరి మధ్యే పోటీ
- సర్కార్ వ్యతిరేక ఓటు పైనేబీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఆశలు
- పాత అభ్యర్థులే కావడంతో త్రిముఖ పోటీ
కరీంనగర్, వెలుగు : మానకొండూరు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారం స్పీడ్అందుకుంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీజేపీ నుంచి ఆరేపల్లి మోహన్, కాంగ్రెస్ నుంచి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బరిలో దిగుతున్నారు. ఈ ముగ్గురు నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులే కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఈ ముగ్గురు 2014 ఎన్నికల్లో పోటీపడ్డారు.
వీరిలో రసమయి అప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తుండగా.. 2014, 2018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆరేపల్లి మోహన్ ఈసారి బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్నారు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన కవ్వంపల్లి సత్యనారాయణ.. 2018లో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు కేటాయించడంతో ఆ ఎన్నికల్లో పోటీచేయలేదు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్నారు.
సంక్షేమం, అభివృద్ధితో రసమయి..
బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తాను తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చెప్పి ఓట్లు అడుగుతున్నారు. ఆయన తన పాట, మాట ద్వారా సభల్లో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. గన్నేరువరం, బెజ్జంకి, తిమ్మాపూర్, ఇల్లంతకుంట మండలాల్లో మిడ్ మానేరు ద్వారా అనేక గ్రామాలకు కాల్వలు తవ్వించి సాగునీళ్లు ఇవ్వడం, తిమ్మాపూర్‌లో గురుకుల స్కూళ్ల ఏర్పాటు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు, మహిళా సంఘాల భవనాలు, మానేరు వాగుపై వేగురుపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా ఆయన హయాంలో నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా పంపిణీ చేయలేదనే అపవాదు ఉంది. సమస్యలపై ప్రజలు నిలదీస్తే వారిని నోటికొచ్చినట్లు తిట్టడంతోపాటు పోలీసులతో కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దత్తత తీసుకున్న గ్రామాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత ఉంది.
తాను లోకల్ అంటున్న ఆరేపల్లి..
మానకొండూరు జడ్పీటీసీగా, ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ చైర్మన్ గా, 2009లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆరెపల్లి మోహన్.. 2014, 2018 ఎన్నికల్లో రసమయి చేతిలో ఓడిపోయారు. 2019లో బీఆర్ఎస్ లో చేరిన ఆయన పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో ఇటీవల బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ప్రచారంలో బీజేపీ క్యాడర్ తోపాటు గతంలో తనతోపాటు కాంగ్రెస్ లో పని చేసిన అనుచరుల సహకారం తీసుకుంటున్నారు.
తాను లోకల్ అని, స్థానికేతరులకు ఓటేయొద్దని, తన హయాంలో చేసిన పనులను గుర్తు చేస్తూ, రసమయి వైఫల్యాలను వివరిస్తూ ఓట్లడుగుతున్నారు. నాలుగేళ్లు బీఆర్ఎస్ లో ఉండడం, క్యాడర్ కు అందుబాటులో ఉండకపోవడం ఆయనకు మైనస్‌గా మారింది.
గ్యారంటీలను నమ్ముకున్న కవ్వంపల్లి
మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఈయన 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఆరేపల్లి మోహన్ చేతిలో, 2014లో టీడీపీ తరఫున రసమయి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు వాళ్లిద్దరితోనే పోటీపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను నమ్ముకుని ముందుకు సాగుతున్నారు.
మూడు జిల్లాల్లో మానకొండూరు...
నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో ఏర్పాటైన మానకొండూరు నియోజకవర్గం ప్రస్తుతం మూడు జిల్లాల్లో కొనసాగుతోంది. నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలు ఉండగా మానకొండూరు, శంకరపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం కరీంనగర్ జిల్లాలో, బెజ్జంకి మండలం సిద్దిపేట జిల్లాలో, ఇల్లంతకుంట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి. మానకొండూర్ ఏర్పడ్డాక ఇప్పటిదాకా మూడు సార్లు ఎన్నికలు జరగ్గా ఒకసారి కాంగ్రెస్, రెండుసార్లు బీఆర్ఎస్ విజయం సాధించాయి.
ఎన్నికల్లో ఎజెండాగా అంశాలివే..
నియోజకవర్గవ్యాప్తంగా ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్ల రాకపోకలతో గ్రామాలకు వెళ్లే రోడ్లు ధ్వంసమై ఉన్నాయి. వీటికి రిపేర్లు లేవు.
నియోజకవర్గవ్యాప్తంగా ఎక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు. చాలాచోట్ల పిల్లర్ల దశలోని ఆగిపోయాయి.
కొత్త మండలం గన్నేరువరంలో గవర్నమెంట్ ఆఫీసులకు సొంత బిల్డింగ్స్ లేవు. రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజీ నుంచి ఇల్లందకుంట మండలం వరకు నిర్మించే డబుల్ రోడ్డు నిర్మాణం నిధుల మంజూరుకే పరిమితమైంది. అరుంధతి కల్యాణ మండపం, పీహెచ్‌సీ నిర్మిస్తామన్న హామీ నెరవేరు లేదు. ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయలేదు, గన్నేరువరం నుంచి మైలారం వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు.
తిమ్మాపూర్ మండలం నేదునూరులో థర్మల్ పవర్ ప్లాంట్ కోసం 2007లోఅప్పటి ప్రభుత్వం రైతుల నుంచి 436 ఎకరాలు సేకరించింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్లాంట్ ఏర్పాటు చేయలేదు. దీంతో తమ భూములు తమకివ్వాలని రైతులు కోరుతున్నారు.