ఏడో రోజు 60 నామినేషన్లు.. మంచిర్యాల జిల్లాలో 27

ఆదిలాబాద్​ నెట్​వర్క్, వెలుగు : గడువు నేటితో ముగియనుండడంతో అభ్యర్థులు గురువారం భారీగా నామినేషన్లు వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 60 మంది నామినేషన్లు వేశారు. మంచిర్యాల జిల్లాలోనే 27 నామినేషన్లు వచ్చాయని ఆ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ ఓ ప్రకటనలో తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గడ్డం వివేక్​వెంకటస్వామి(2సెట్లు) నామినేషన్​ వేశారు. 

భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తల నడుమ ఆయన నామినేషన్​వేశారు. బీఆర్ఎస్​నంచి బాల్క సుమన్, బీజేపీ నుంచి దుర్గం అశోక్, సోషలిస్ట్ పార్టీ(ఇండియా) అభ్యర్థిగా మోతె రాజలింగ్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నందిపాటి రాజు, స్వతంత్ర అభ్యర్థి జాడి ఏసయ్య అధికారులకు నామినేషన్​ పత్రాలు సమర్పించారు.  మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నడిపెల్లి దివాకర్ రావు, కాంగ్రెస్ నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, బీజేపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్, స్వతంత్ర అభ్యర్థులుగా మరో ముగ్గురు, ధర్మ సమాజ్ అభ్యర్థిగా ఎదునూరి రమేశ్ నామినేషన్​ వేశారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్, బీఆర్ఎస్ నుంచి దుర్గం చిన్నయ్య, బీజేపీ నుంచి అమురాజుల శ్రీదేవి, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. 

ఆసిఫాబాద్ జిల్లాలో 16 

ఆసిఫాబాద్ జిల్లాలో 11 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆసిఫాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి, కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ నాయక్​తోపాటు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి మరో 9 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. సిర్పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప, బీజేపీ నుంచి పాల్వాయి హరీశ్ బాబు, మరో మూడు నామినేషన్లు వచ్చాయి. ఆదిలాబాద్​జిల్లాలో మొత్తంగా 15 నామినేషన్​లు వచ్చాయి. 

ఆదిలాబాద్​ స్థానం నుంచి కాంగ్రెస్​ అభ్యర్థి కంది శ్రీనివాస్​రెడ్డితోపాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు, రెండు పార్టీలకు చెందిన మరో ఇద్దరు నేతలు నామినేషన్లు వేశారు. బోథ్​ స్థానానికి బీఆర్ఎస్​అభ్యర్థి జాదవ్​ అనిల్, బీజేపీ నుంచి సోయం బాపురావు, కాంగ్రెస్​ నుంచి ఆడె గజేందర్, డీఎస్పీ నుంచి ఉయికె ఉమేశ్ తదితరులు నామినేషన్​లు వేశారు. నిర్మల్​ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి నామినేషన్లు సమర్పించారు. ఖానాపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్,  బీజేపీ అభ్యర్థి రమేశ్ రాథోడ్, కాంగ్రెస్ అభ్యర్థిగా వెడ్మ బొజ్జుతోపాటు పలువురు ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల నేతలు అధికారులకు నామినేషన్లు సమర్పించారు.