డబుల్ ఇండ్లు రానివారికి స్థలాలు..?

  • ఎన్నికలు సమీపిస్తుండడంతో అసంతృప్తి చల్లార్చే యత్నం
  •     మండేపల్లి శివారులోని ప్రభుత్వ భూమిలో  కేటాయింపు 
  •     850 మందికి లబ్ధి చేకూరే చాన్స్‌‌‌‌
  •     కేటీఆర్ ఆదేశాలతో పట్టాలు సిద్ధం చేస్తున్న రెవెన్యూ ఆఫీసర్లు

రాజన్నసిరిసిల్ల, వెలుగు:  ఎన్నికలు సమీపిస్తుండటంతో  ప్రభుత్వంపై అసంతృప్తిని చల్లార్చేందుకు అధికార బీఆర్ఎస్​ ప్రయత్నాలు చేస్తోంది.  దీనిలో భాగంగా డబుల్​ఇండ్లు రాని పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు రెడీ చేస్తున్నారు. డబుల్​ఇండ్ల కోసం వేలమంది దరఖాస్తు చేసుకోగా కొంతమందికే దక్కాయి. దీంతో సిరిసిల్లలో అర్హులైన చాలామంది అసంతృప్తికి గురయ్యారు. ఈక్రమంలో డబుల్ఇండ్లు రాని అర్హులైనవారికి ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో ఆర్డీవో ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో రెండు రోజుల కింద సిరిసిల్ల బీఆర్ఎస్ లీడర్లు, మున్సిపల్ అధికారులతో  సమావేశమయ్యారు. సుమారు 850 మందికి పట్టాలు ఇచ్చేందుకు తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్దనున్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలాన్ని లేఅవుట్‌‌‌‌గా మార్చి పంపిణీ చేయాలన్న యోచనలో ఉన్నారు. 

స్థలాలతోపాటు గృహలక్ష్మి కూడా.. 

850 మందికి ఇండ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు ఇంటిని నిర్మించుకునేందుకు గృహలక్ష్మి స్కీం కింద తొలి విడతలో 400 మందికి రూ.3 లక్షలు సాయం చేయనున్నట్లు అధికారులు చెప్పారు. జిల్లా కేంద్రంలో గృహలక్ష్మి స్కీం కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే 1,890 మందికి డబుల్ ఇండ్లు పంపిణీ చేయగా మరో 164 ఇండ్లను సిద్ధం చేశారు. 

సొంత నియోజకవర్గంపై మంత్రి ఫోకస్​

ఎన్నికల సమీపిస్తున్నందున మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంపై ఫోకస్​పెట్టారు. ఇప్పటికే రూ.వేల కోట్లతో పెండింగ్ పనులను పూర్తిచేసేందుకు ప్లాన్​చేశారు. పెండింగ్​రోడ్లు, డ్రైన్లు, బ్రిడ్జిలు, చెక్ డ్యాం నిర్మాణ పనులను వెంటనే కంప్లీట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల గంభీరావుపేటలో పర్యటించిన మంత్రి రూ.52 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు.

స్థల పరిశీలన చేశాం


సిరిసిల్లలో డబుల్ ఇండ్లు రాని పేదలకు స్థలాన్ని కేటాయించేందుకు మండేపల్లి వద్ద స్థల పరిశీలన చేశాం. ఈ స్థలాన్ని లేఅవుట్‌‌‌‌గా చేసి అర్హులకు ఇచ్చేందుకు ప్లాన్​చేశాం. దీనికింద 850 మందికి ఇస్తాం. త్వరలో మంత్రి కేటీఆర్​సిరిసిల్లకు వచ్చి పట్టాల పంపిణీ చేయనున్నారు. 
- మున్సిపల్ చైర్ పర్సన్, జిందం కళ