రాజన్నసిరిసిల్ల, వెలుగు : ఎన్నికలు దగ్గర పడేకొద్దీ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్, మధ్యే టఫ్ ఫైట్ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి చల్మెడ లక్ష్మీనరసింహారావు, బీజేపీ నుంచి చెన్నమనేని వికాస్ రావు, బీఎస్పీ నుంచి గోలి మోహన్ పోటీ చేస్తున్నారు.
సిట్టింగ్ఎమ్మెల్యే రమేశ్ బాబును పక్కన పెట్టి మరీ బీఆర్ఎస్ సీటును చల్మెడ లక్ష్మీనరసింహారావుకు కేటాయించగా, గత పదేండ్లలో బీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, చల్మెడ ఆనందరావు ట్రస్ట్ ద్వారా అందించిన సేవలను ఆయన ప్రచారంలో గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ఫస్ట్లిస్టులోనే టికెట్ దక్కించుకున్న ఆది శ్రీనివాస్ గడపగడపకు తిరుగుతూ ఓట్లడుగుతున్నారు.
వరుసగా నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయినా శ్రీనివాస్ కు ఈసారి సింపతీ వర్కవుట్అవుతుందనే టాక్ నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌పార్టీకి పెరిగిన ఆదరణ తనకు అదనపు బలమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీలో అడుగు పెడతాననే ధీమా
కాంగ్రెస్అభ్యర్థి ఆది శ్రీనివాస్ గత నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి ఆయనకు సానుభూతి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములు, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వేవ్, మున్నూరు కాపుల ఓట్లు అదనపు బలం కానున్నాయనే ధీమాతో ఆది శ్రీనివాస్ ఉన్నారు. 2009లో వేమువాడలో నియోజకవర్గం ఏర్పడింది. ఆ ఎన్నికల్లో చెన్నమనేని రమేశ్‌బాబుపై పోటీ చేసిన ఆది శ్రీనివాస్ కేవలం 1,800 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
2010 ఉప ఎన్నికల్లో 25 వేల ఓట్ల తేడాతో మరోసారి ఓటమి చవిచూశారు. 2014, 2018 ఎన్నికల్లోనూ చెన్నమనేనిపై ఆది శ్రీనివాస్ ఓడిపోయారు. ఈసారి ప్రజల్లో పెరిగిన సానుభూతితో గెలుపు ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నమనేని రమేశ్ బాబు ఈసారి పోటీలో లేకపోవడం గమనార్హం.
కేటీఆర్ దత్తత తీసుకుంటారని ప్రచారం
చల్మెడ లక్ష్మీనరసింహారావును గెలిపిస్తే వేములవాడను దత్తత తీసుకుంటానని ఇటీవల జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇదే విషయాన్ని చల్మెడ ప్రచారంలో పదేపదే చెబుతున్నారు. కేటీఆర్ తనకు అత్యంత సన్నిహితుడని, తను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానంటున్నారు.
బీఆర్ఎస్ అందించిన పథకాలు, చల్మెడ ఆనందరావు హాస్పిటల్ద్వారా అందిస్తున్న సేవలు తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చల్మెడ లక్ష్మీనరసింహారావు కోనరావుపేట మండలం మల్కపేటలోని తన స్థలం కేటాయించి, రూ.2 కోట్ల సొంత నిధులతో కార్పొరేట్ లెవెల్లో గవర్నమెంట్ స్కూల్బిల్డింగ్నిర్మించారు. అదే గ్రామంలో ప్రస్తుతం రూ.3కోట్లతో ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టిస్తున్నారు. ఇవన్నీ తనకు కలిసివస్తాయని చల్మెడ అంటున్నారు.
బీఆర్ఎస్పై రూ.100 కోట్ల హామీ ప్రభావం
సీఎం కేసీఆర్వేములవాడ ఆలయాన్ని పట్టించుకోకపోవడం బీఆర్ఎస్ అభ్యర్థికి పడే ఓట్లపై ప్రభావం చూపనుంది. 2018లో రాజన్న దర్శనానికి వచ్చిన కేసీఆర్ఆలయ అభివృద్ధికి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తానని ప్రకటించారు. కానీ, ఆ హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. రాజన్న గుడి మెట్లపై నిలబడి మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5.04లక్షలు ఇస్తానని ప్రకటించారు. అదీ జరగలేదు. దీంతో ఈ హామీలు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రతికూల అంశాలుగా మారాయి. మరోవైపు నాలుగుసార్లు గెలిచిన తనకే టికెట్వస్తుందని ఆశించిన సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ బాబుకు భంగపాటు తప్పలేదు.
టికెట్బదులు ఆయనకు కేసీఆర్వ్యవసాయ శాఖ సలహాదారు పదవి కట్టబెట్టారు. అయినప్పటికీ, చెన్నమనేని రమేశ్ బాబు అలక మానలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఎక్కడా కనిపించడం లేదు. చల్మెడ లక్ష్మీనరసింహారావు నామినేషన్ కార్యక్రమానికి కూడా రాలేదు. కేవలం హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. ఆయన సైలెంట్కావడంతో బీఆర్ఎస్ వేములవాడ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు కాంగ్రెస్ లో చేరిపోయారు. రాజు వెంటే మరికొంత మంది కాంగ్రెస్ లోకి వెళ్లారు. రమేశ్‌బాబు ఎఫెక్ట్ కాంగ్రెస్‌కు ప్లస్అయ్యే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
ఎవరికి కలిసొస్తుందో?
మొన్నటి దాకా బీజేపీ టికెట్తుల ఉమకు వస్తుందనుకోగా, చివరి నిమిషంలో వికాస్‌రావుకు బీఫాం దక్కింది. అంతకు ముందు బీజేపీ నుంచి ఉమ నామినేషన్వేయగా, పార్టీ బీఫాం అందక భంగపడ్డారు. తర్వాత జరిగిన పరిణామాలతో ఆమె బీఆర్ఎస్లో చేరారు. అయితే బీజేపీ అభ్యర్థి వికాస్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుది ఒకే సామాజిక వర్గం. చల్మెడ ఓట్లు వికాస్ రావు చీల్చుతారనే ప్రచారం జరుగుతోంది.
పైగా ఇద్దరూ ఒకే మండలానికి చెందిన వారు. వికాస్ రావు మూడేండ్లుగా ప్రతిమ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డాక్టర్‌గా తాను అందించిన ఉచిత వైద్య సేవలు కలిసొస్తాయనే ధీమాలో వికాస్ రావు ఉన్నారు. తుల ఉమ పార్టీ మారడం వికాస్‌కు కొంత నెగెటివ్‌గా మారే అవకాశం ఉంది. అలాగే విద్యావేత్త, సైంటిస్ట్గోలి మోహన్ బీఎస్పీ నుంచి బరిలో ఉన్నారు. మొన్నటి దాకా బీఆర్ఎస్లో ఉన్న ఆయన వేములవాడ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు.
మోహన్ నియోజకవర్గంలోని ఎంతో మంది యువతకు ఉద్యోగాలు కల్పించారు. ఆద్యగోలి ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా సమయంలో విస్తృత సేవలందించారు. మోహన్బీఆర్ఎస్ఓట్లు చీల్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ క్రమంలో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ వేములవాడ నియోజకవర్గంలో ఉంది.