ఇండియా కూడా ఉండాలె .. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వంపై ఎలాన్ మస్క్

 న్యూయార్క్: భూమ్మీద అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా రికర్డులకెక్కిందని, అలాంటి దేశానికి ఇప్పటికీ భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం అనుచితమని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. యునైటెడ్ నేషన్స్ లో సమూల మార్పులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈమేరకు ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు. అంతకుముందు యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఓ ట్వీట్​ చేస్తూ.. ఆఫ్రికా ఖండంలోని ఒక్క దేశానికీ భద్రతా మండలిలో స్థానం కల్పించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఏ వ్యవస్థ అయినా, సంస్థలైనా సరే ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబించేలా, అవసరాలకు తగ్గట్లుగా ఉండాలని చెప్పారు. అంతేకానీ ఎప్పుడో 80 ఏండ్ల నాటి పరిస్థితికి అనుగుణంగా ఉంటే ఎలా అంగీకరిస్తామని గుటెర్రస్ ప్రశ్నించారు. దీనిపై ఇజ్రాయెలీ వెంచర్ క్యాపిటలిస్ట్ మైఖెల్ ఐసెన్ బర్గ్ స్పందిస్తూ.. ‘ఆఫ్రికా దేశాల సంగతి సరే.. ఇండియా సంగతేమిటి’ అంటూ ట్వీట్​ చేశారు. ఈ ట్వీట్​కు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. 

ప్రపంచ దేశాలలో జనాభా పరంగా ఇండియా ముందు ఉందని, అలాంటి ఇండియాకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం అనుచితమని కామెంట్ చేశారు. ప్రస్తుత పరిస్థితులు, అవసరాలకు తగ్గట్లుగా యునైటెడ్ నేషన్స్​లో మార్పులు చేస్తూ కొత్తగా తీర్చిదిద్దుకోవాలని మస్క్ అభిప్రాయపడ్డారు. అయితే, అవసరానికి మించిన అధికారం ఉన్న వారు దానిని వదులుకోవడానికి ఇష్టపడరని, ఇదే అసలు సమస్య అని ఆయన వివరించారు. కాగా, భద్రతా మండలిలో ప్రస్తుతం చైనా, అమెరికా, ఫ్రాన్స్, యూకే, రష్యా దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంది. ఈ సభ్యత్వం కారణంగా ఈ ఐదు దేశాలకు వీటో పవర్ ఉంటుంది. భద్రతా మండలి నిర్ణయాలను ఈ ఐదింటిలో ఏ ఒక్క దేశమైనా తన వీటో పవర్ ను ఉపయోగించి అడ్డుకోవచ్చు. కాగా, గత కొన్నేళ్లుగా శాశ్వత సభ్యత్వం కోసం మన దేశం చేస్తున్న ప్రయత్నాలకు చైనా ఎప్పటికప్పుడు అడ్డుపడుతోంది. ఈ క్రమంలో టెస్లా అధినేత మస్క్ తాజా ట్వీట్​ప్రాధాన్యం సంతరించుకుంది.