- అలా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు
- ఉద్యోగుల బదిలీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న సర్కారు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ ఉద్యోగుల పంపి ణీకి సంబంధించి కొత్త నిర్ణయాలేమీ తీసుకోలేదని రాష్ట్ర సర్కారు వెల్లడించింది. ఉద్యోగుల బదిలీ వ్యవహారం 8 ఏండ్లుగా నానుతున్న వ్యవహారమని, విభజన చట్టంలోని అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య సమావేశాలు జరిగినప్పుడల్లా ఈ అంశంపై పలుమార్లు చర్చలు జరిగాయని తెలిపింది. అయితే, ఇప్పటి వరకు ఉద్యోగుల పరస్పర బదిలీకి సంబంధించి రెండు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రం ఆవిర్భవించి పదేండ్లు పూర్తి కావడంతో విభజన చట్టంలోని అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నాయి.
వీటిపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసింది. ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ జూన్ 2 నుంచి తెలంగాణకు ప్రత్యేక రాజధానిగా ఏర్పడింది. ఇదే సందర్భంగా ఏపీకి కేటాయించిన ఆఫీసులు, భవనాలతో పాటు విభాగాల వారీగా విభజన చట్టంలోని అన్ని అంశాలపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్లో ఉన్న అంశాలపై తదుపరి చర్చలు, సమావేశాలేవీ జరగలేదని, ఈలోగా ఏపీ నుంచి ఉద్యోగులు తెలంగాణకు వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఉద్యోగ సంఘాలను ప్రభు త్వం అప్రమత్తం చేసింది.
ఉద్యోగాల పంపకం కథ ఇదీ
తెలంగాణ ఏర్పడిన ఏడాది, రెండేండ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. ఉద్యోగుల విభజన సమయంలో ఆప్షన్లు, పోస్టుల లభ్యత ఆధారంగా తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరు ఏపీకి, ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరు తెలంగాణకు పంపిణీ అయ్యారు. వైద్య అవసరాలు, భార్యభర్తలు ఉద్యోగాల్లో ఉండడం, పిల్లల చదువులు, సొంత ఇల్లు ఉన్నాయనే కారణాలతో కొందరు ఉద్యోగులు ఈ పంపిణీ జరిగిన తీరుతో ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో ఏపీకి వెళ్లేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ తెలంగాణకు పంపిణీ అయిన 1,369 మంది ఉద్యోగులు సమ్మతి తెలిపారు. 1,369 మంది శాశ్వతంగా ఏపీకి వెళ్లేందుకు సమ్మతిస్తూ తమను ఏపీకి పంపించాలని కోరారు.
2021 సెప్టెంబరులో తెలంగాణ ప్రభుత్వం ఆ ఉద్యోగుల వివరాలను సేకరించింది. వారి అభ్యర్థనతో ఏపీకి పంపించేందుకు తమకు అభ్యంతరం లేదని 2021 సెప్టెంబరులో తెలంగాణ ప్రభుత్వం ఒక సర్క్యులర్ ను జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా అక్కడి నుంచి తెలంగాణకు వచ్చే ఉద్యోగుల వివరాలు సేకరించింది. అక్కడి నుంచి 1,808 మంది ఉద్యోగులు తెలంగాణకు రావడానికి ఆప్షన్లు ఇచ్చారు. శాశ్వతంగా తెలంగాణకు వెళ్లేందుకు సమ్మతి తెలిపే ఉద్యోగుల జాబితాను ఏపీ ప్రభుత్వం తయారు చేసింది. 2022 సెప్టెంబర్ 23న అప్పటి ఏపీ సీఎస్ సమీర్ శర్మ నాటి తెలంగాణ సీఎస్ గా ఉన్న సోమేష్ కుమార్కు ఇదే విషయంపై లేఖ రాశారు. రెండు రాష్ట్రాల్లో అప్పటికే ఆఫ్షన్లు ఇచ్చిన ఉద్యోగుల పరస్పర బదిలీకి ప్రభుత్వం
తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.