![స్థానిక ఎన్నికల్లో ఇక ఏకగ్రీవం లేనట్టే.. ఒక్క నామినేషన్ వచ్చినా నోటాతో పోటీ పడాల్సిందే..!](https://static.v6velugu.com/uploads/2025/02/as-if-there-is-no-unanimity--local-elections_YLyRVcpgwT.jpg)
- ఇప్పటికే హర్యానా, మహారాష్ట్రలో అమలు.. తెలంగాణలోనూ ప్రతిపాదనలు
- ఈ నెల 12న ఆల్ పార్టీ మీటింగ్‌లో ఎన్నికల సంఘం చర్చించి.. ప్రభుత్వానికి నివేదిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవడం ద్వారా సత్తా చాటేందుకు అన్ని పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. లోకల్‌బాడీ ఎన్నికలు అనగానే మనకు ఏకగ్రీవాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను ఏకగ్రీవం చేసుకునేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయి. తక్కువ జనాభా ఉన్న తండాలు, వీడీసీల పెత్తనం ఉన్న గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం ప్రతిసారీ వేలం పాటలు జరగడం, ఎక్కువ పాడినవారికి సర్పంచ్, వార్డుమెంబర్పదవులు దక్కడం పరిపాటిగా మారింది.
నామినేషన్లు వేశాక అసంతృప్తులను బుజ్జగించి, పోటీ నుంచి తప్పించడమూ జరుగుతున్నది. 2019 ఎన్నికల్లో 16 శాతం గ్రామాల్లో సర్పంచ్‌స్థానాలు యునానిమస్అయ్యాయని అప్పట్లో ఈసీ ప్రకటించిందంటే ఏకగ్రీవాలకు ఇక్కడ ఎంత క్రేజ్ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈసారి ఈ ఏకగ్రీవాలు అనుమానమే అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ చేస్తున్న ప్రతిపాదనలే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఎవరూ పోటీలో లేకుంటే నోటా ఉంటది..!
పంచాయతీ ఎన్నికల్లో ఈ సారి ఏకగ్రీవాలకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తున్నది. ఈ మేరకు స్టేట్‌ఎలక్షన్ కమిషన్ కొత్త ప్రతిపాదనలను రెడీ చేస్తున్నది. ‘రైట్ నాట్ టు ఓట్’ ప్రకారం అభ్యర్థి నచ్చకుంటే నోటాను ఎంచుకునే హక్కు ఓటరుకు ఉంటుంది. కానీ ఏకగ్రీవాల వల్ల ఈ అవకాశం లేకుండా పోతున్నది. దీనిపై పబ్లిక్ నుంచి ఈసీకి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఫోరం ఫర్గుడ్గవర్నెన్స్ (ఎఫ్ జీజీ) కూడా ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
ప్రతి పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని, అభ్యర్థి నచ్చకపోతే నోటాను ఎంచుకునే హక్కు ప్రతి ఓటరుకు కల్పించాలని, ఆ హక్కును కాపాడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎఫ్‌జీజీ కోరింది. అందుకే ఒక్క నామినేషన్వచ్చినా, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒక్క నామినేషన్మాత్రమే మిగిలినా.. ఏకగ్రీవానికి తావులేకుండా నోటాను కల్పిత అభ్యర్థిగా ఉంచి, ఓటింగ్ పెట్టాలని ఈసీ భావిస్తున్నది. దీనిపై ఈ నెల 12న అన్ని రాజకీయ పార్టీలతో చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెచ్చిన ఈ ప్రతిపాదనపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నాయి. ఆ మీటింగ్‌లో మినిట్స్‌ను, ఇతర నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఎన్నికల అధికారులు పంపనున్నారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి ప్రయోగం జరుగుతున్నదని, ఒకే అభ్యర్థి ఉన్నచోట నోటా సింబల్‌తో కలిపి ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆఫీసర్లు చెబుతున్నారు.
కాగా, దీనిపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు కీలకం కానున్నాయి. ఒకవేళ పొలిటికల్ పార్టీలు అందుకు ఓకే అంటే.. ప్రభుత్వం కూడా ఒకే చెప్పాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. కానీ ఇప్పటికే వీలైనన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని పార్టీ శ్రేణులను సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఆదేశించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఈసీ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా? అన్నది ఆసక్తి రేపుతున్నది.
ప్రోత్సాహకాల పేరుతో ఏకగ్రీవాలు..
పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహకంగా రూ.10 లక్షల చొప్పున నజారానా అందిస్తామని గత బీఆర్ఎస్సర్కారు జనానికి ఆశపెట్టింది. దీంతో ఆ ఫండ్స్వస్తే గ్రామంలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చనే ఆశతో యూత్, మహిళలు, గ్రామ పెద్దలు కలిసి చాలా పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నారు. 2019 జనవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ముగియగా, 16 శాతం సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు.
కానీ గత ప్రభుత్వం ఏ పంచాయతీకి పైసా నిధులు ఇవ్వలేదు. దీంతో ఈసారి ప్రభుత్వం ఏకగ్రీవాలకు నజరానా ప్రకటిస్తుందా? లేదా? అన్నది ఆస్తికరంగా మారింది. మరోవైపు ప్రభుత్వ ప్రకటనతో సంబంధం లేకుండా ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల లాంటి జిల్లాల్లో వీడీసీల(గ్రామాభివృద్ధి కమిటీలు) పెత్తనం ఎక్కువగా ఉంది. ఆయా గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం ఓటర్లను ప్రలోభ పెట్టడం, ప్రత్యర్థులను బెదిరించడం, పదవుల కోసం వేలం పాటలు నిర్వహించడం కామన్‌గా మారింది.
ఇలాంటి చోట్ల డబ్బున్నవాళ్లకే పదవులు దక్కుతుండగా, లేనివాళ్లు నిరాశతో తప్పుకుంటున్నారు. వేలంపాటల ద్వారా వచ్చిన మొత్తాన్ని తమ దగ్గర పెట్టుకొని వీడీసీలు చేస్తున్న అరాచకలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి వీడీసీలు లేని గ్రామాల్లో ఏకగ్రీవాలకోసం డబ్బులు ముట్టజెప్తున్న అభ్యర్థులు, పదవిలోకి వచ్చాక ఆ మొత్తాన్ని రాబట్టుకునేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.
ఈతరహా అప్రజాస్వామిక విధానాల్లో మార్పు తెచ్చేందుకే పోటీలో ఉన్న అభ్యర్థులు ఇష్టం లేకపోతే కనీసం నోటాకు వేసే అవకాశం ఇవ్వాలని ఎన్నికల సంఘం భావిస్తున్నది. అభ్యర్థి కన్నా నోటాకు తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ టెక్నికల్‌గా అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకే ఈ ప్రయత్నమని ఎన్నికల అధికారులు చెప్తున్నారు.