ఖమ్మం కాంగ్రెస్​లో జోష్..

ఖమ్మం కాంగ్రెస్​లో జోష్..
  • బీజేపీకి పెరిగిన ఓట్లు.. డీలా పడిన బీఆర్​ఎస్​
  • కొత్తగూడెం, సత్తుపల్లిలో అసెంబ్లీ ఎన్నికల కంటే కాంగ్రెస్ కు రెండింతల మెజారిటీ
  • రెండు నెలల ముందే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినా నామాకు తప్పని ఓటమి

ఖమ్మం, వెలుగు : భారీ మెజారిటీ సాధించి ఖమ్మం స్థానాన్ని దక్కించుకోవడంతో కాంగ్రెస్​లో జోస్​ పెరిగింది. మూడో స్థానానికి పరిమితమైనా ఓట్ల శాతం గణనీయంగా పెరగడం పట్ల బీజేపీ ఆనందపడుతోంది. సిట్టింగ్​ స్థానాన్ని కోల్పోయి బీఆర్​ఎస్​ మరింతగా డీలా పడింది. ఇన్నేళ్లుగా ఒకటిన్నర శాతం లోపు ఓట్లను మాత్రమే సాధిస్తున్న సెగ్మెంట్ లో ఈసారి 9.48 శాతానికి ఓటింగ్ శాతం పెరగడంతో కొంత ఖుషీగానే కనిపిస్తున్నారు. ఇంకా మరిన్ని ఓట్లు వస్తాయని ఆశించినా, ఇప్పటి వరకు సాధించిన పురోగతిపై మాత్రం సంతృప్తి కనిపిస్తోంది. 

ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తాండ్ర వినోద్​ రావును ఇంకాస్త ముందుగానే అనౌన్స్​ చేసి ఉంటే మిగిలిన ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే వాళ్లమనే అభిప్రాయాన్ని ఆ పార్టీ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్​ మాత్రం ఈ ఫలితాలతో మరింత డీలా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఒక్క సీటును కూడా గెల్చుకోలేకపోయిన కారు పార్టీ, ఈ ఎన్నికల్లో దాదాపు లక్షా 60 వేల ఓట్లను కోల్పోయింది. ఇందులో లక్షకు పైగా ఓట్లు బీజేపీ వైపు క్రాస్​ ఓటింగ్ జరిగిందన్న అంచనాలుండగా, మరో 35 వేల ఓట్లు కాంగ్రెస్​ కు పోలయ్యాయి. 

మిగిలిన పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని అనౌన్స్​ చేసినా, సిట్టింగ్ ఎంపీనే మళ్లీ బరిలోకి దింపినా భారీ తేడాతో ఓటమి చెందడం కేడర్​ కు నిరాశను కలిగించింది. పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన పోస్ట్ మార్టంలో లక్షన్నర ఓట్ల లోపు తేడా మాత్రమే ఉంటుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకున్నారు. కానీ ఏకంగా ప్రత్యర్థికి 4,67,847 ఓట్ల మెజార్టీ రావడంతో బీఆర్ఎస్​ లీడర్లు అవాక్కయ్యారు. 

అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో భారీ మెజారిటీ

మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్​ అభ్యర్థికి అన్ని నియోజకవర్గాల్లో భారీగా మెజారిటీ వచ్చింది. బీఆర్ఎస్​ ఓట్లు బీజేపీకి క్రాస్​ కావడంతో రఘురాంరెడ్డికి పెద్ద సంఖ్యలో మెజారిటీ దక్కింది. ఖమ్మం అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్​ కు 86,570 ఓట్ల మెజార్టీ రాగా, పాలేరులో 61,681, మధిరలో 63,470, వైరాలో 61,778, సత్తుపల్లిలో 69,408, కొత్తగూడెంలో 76,177, అశ్వారావుపేటలో 42,927 ఓట్ల మెజారిటీ వచ్చింది. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లతో పోలిస్తే ఖమ్మంలో 37వేలు, పాలేరులో ఐదువేలు మెజార్టీ పెరగ్గా, మధిర, వైరాలో 28వేలు, సత్తుపల్లి, కొత్తగూడెంలో 50వేలు, అశ్వారావుపేటలో 14వేలు ఓట్ల మెజారిటీ పెరిగింది. 

కానీ ఓట్ల సంఖ్యలో మాత్రం ఖమ్మం, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఆర్నెళ్ల కింద వచ్చిన ఓట్ల సంఖ్యతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్​కు పోలైన ఓట్ల సంఖ్య తగ్గింది. మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల్లో మాత్రం ఓట్ల సంఖ్యను పెంచుకుంది. ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్​ తో పోటీగా బీజేపీ ఓట్లు సాధించింది. 2019 ఎలక్షన్లలో బీజేపీకి 20,488 ఓట్లు (1.8శాతం) రాగా, 2023 ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తుపెట్టుకొని బీజేపీ పోటీ చేయగా 16,696 (1.2శాతం) ఓట్లు పోలయ్యాయి. ఈసారి ఏకంగా బీజేపీ 1,18,636  (9.48శాతం)ఓట్లను సాధించింది.

అడ్వాంటేజీని ఓట్లుగా మల్చుకోవడంలో నామా ఫెయిల్

అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్​, బీజేపీ కంటే దాదాపు రెండు నెలల ముందుగానే బీఆర్ఎస్​ నిర్ణయం తీసుకుంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావునే క్యాండిడేట్ గా ప్రకటించింది. ఈ విషయంలో ఉన్న అడ్వాంటేజీని ఓట్లుగా మల్చుకోవడంలో నామా ఫెయిలయ్యారు. కుమారుడి పెళ్లి కారణంగా కొద్దిరోజులు ప్రచారం చేయకపోవడం, కాంగ్రెస్, బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు వస్తున్న సమయంలోనూ నామా వాటిని గట్టిగా ఖండించకపోవడంతో బీఆర్ఎస్​ కేడర్  ​జారిపోయింది. మొన్నటి ఎన్నికల్లో ఓడిన లీడర్లు నామా తరఫున ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది.