బీఆర్‌‌‌‌ఎస్‌‌లో మిగిలేదెవరు ?

బీఆర్‌‌‌‌ఎస్‌‌లో మిగిలేదెవరు ?
  • ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు,ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్​లోకి
  • ఫలించని కేసీఆర్ ఫామ్‌‌హౌస్​ బుజ్జగింపులు
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు
  • నాడు కేసీఆర్ చేసిన పాపమే ఇప్పుడు తగులుతున్నదంటున్న గులాబీ శ్రేణులు
  • అసెంబ్లీలో సింగిల్‌‌ డిజిట్‌‌కు పడిపోనున్న కారు పార్టీ బలం!

హైదరాబాద్, వెలుగు: బీఆర్​ఎస్​ నాయకులు వరుసగా ఆ పార్టీకి గుడ్​బై చెప్తుండడంతో పార్టీలో మిగిలేది ఎవరన్న చర్చ నడుస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యేలను ఎట్లయితే కేసీఆర్‌‌‌‌ తన పార్టీలో చేర్చుకున్నారో.. ఇప్పుడు అదే రీతిలో కారు పార్టీ నుంచి లీడర్లు బయటకు వెళ్లిపోతున్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ఉన్న 38 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు కాంగ్రెస్‌‌లో చేరిపోగా.. ఈ వారం రోజుల్లో ఇంకొంతమంది కాంగ్రెస్​లో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. తెలంగాణ భవన్‌‌లో శుక్రవారం జరిగిన బీఆర్​ఎస్​ మీటింగ్‌‌కు డుమ్మా కొట్టిన ఆరుగురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. శనివారం సెక్రటేరియట్‌‌లో ప్రత్యక్షమయ్యారు. మంత్రి శ్రీధర్‌‌‌‌బాబుతో వారంతా భేటీ అయ్యారు. 

ఇందులో కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, అరికపుడి గాంధీ, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి ఉన్నారు. తమ నియోజకవర్గాలకు నిధులు కేటాయించాలని కోరేందుకే మంత్రిని కలిసినట్టు వారు చెప్తున్నా.. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో వారి చేరిక ఖాయమైందని గులాబీ శ్రేణుల్లోనూ చర్చ జరుగుతున్నది. వీళ్లే కాదు ఇంకొంత మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గూటికి చేరుతారన్న టాక్​ పొలిటికల్​ సర్కిల్స్​లో చక్కర్లు కొడ్తున్నది.  

సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితమా?

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్  నుంచి దాదాపు 26 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతారని కాంగ్రెస్​ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఏడుగురు చేరారు. దీంతో నాడు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఎల్పీని విలీనం చేసుకున్నట్టే..  ఇప్పుడు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎల్పీ కూడా కాంగ్రెస్​లో విలీనమయ్యే అవకాశం ఉందని, దీంతో అసెంబ్లీలో గులాబీ పార్టీ బలం సింగిల్ డిజిట్‌‌‌‌‌‌‌‌కు పడిపోతుందన్న ప్రచారం జరుగుతున్నది. 

బీఆర్​ఎస్​లో మిగిలేది ఎంత మంది, వాళ్లు ఎవరెవరు అని ఎవరికివాళ్లే అంచనాలు, లెక్కలు వేసుకుంటున్నారు. పోచారం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కడియం శ్రీహరి వంటి సీనియర్లే గులాబీ పార్టీకి గుడ్​ బై చెప్పడంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌రావు మినహా ఇంకెవరు ‘కారు’ దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని బీఆర్​ఎస్​ వర్గాల్లోనూ చర్చ నడుస్తున్నది.  కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​రావుతోపాటు  మరో ముగ్గురు లేదా నలుగురు ఎమ్మెల్యేలే బీఆర్​ఎస్​కు మిగలొచ్చని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

నాటి పాపాలే, నేడు శాపాలై..!

అధికారంలో ఉన్నప్పుడు అవసరం లేకపోయినా ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహించిన పాపమే, ఇప్పుడు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు తగిలిందన్న గులాబీ శ్రేణులు కూడా అంటున్నాయి. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ తొలి టర్మ్‌‌‌‌‌‌‌‌లో 63 సీట్లను గెల్చుకుని అధికారంలోకి రాగా.. రెండోసారి  88 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 2018 ముందస్తు ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 88, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ 19, ఎంఐఎం 7, టీడీపీ 2, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి. నాడు అసెంబ్లీలో భారీ బలం ఉన్నప్పటికీ  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకుని, ఆ పార్టీ ఎల్పీని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎల్పీలో కేసీఆర్​ విలీనం చేసుకున్నారు. 

19 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేల్లో 12 మందిని కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు. వారితో పాటు టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరిని, మరో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నారు. అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్కకు ఆ హోదా లేకుండా చేశారు. మండలిలోనూ ఇదే సీన్​ క్రియేట్​ చేశారు. ఆ పాపమే ఇప్పుడు బీఆర్​ఎస్​కు శాపమైందని బీఆర్​ఎస్​ శ్రేణులు అంటున్నాయి. 

నాడు ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పుడు గగ్గోలు పెట్టడం చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఫిరాయింపులను ప్రోత్సహించడం తప్పు అని, ఈ విషయం నాడు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెప్పానని మాజీ ఎంపీ వినోద్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇటీవల ఓ ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో వ్యాఖ్యానించారు. కానీ, నాడు కేసీఆర్​ మాత్రం కాంగ్రెస్​ ఎల్పీని బీఆర్​ఎస్​లో విలీనం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లోనూ టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను, వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను, బీఎస్పీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను, సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యేను కూడా కేసీఆర్​ తన పార్టీలో చేర్చుకున్నారు. 

ఫలించని బుజ్జగింపులు

ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేసీఆర్ కొంత వరకు ప్రయత్నాలు చేశారు. ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్​కు పిలిపించుకుని మాట్లాడారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు మళ్లీ మంచి రోజులు వస్తాయని, ఈసారి 15 ఏండ్లు అధికారంలో ఉంటామని చెప్పుకొచ్చారు. పార్టీలోనే కొనసాగాలని బుజ్జగించారు. నాయకులతో పాటు ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్​కు సర్పంచులు, ఎంపీటీసీలను పిలిపించుకుని బుజ్జగింపు సమావేశాలు కొనసాగిస్తున్నారు. 

తన ఓటమి దేశానికి నష్టం చేకూర్చిందంటూ ప్రసంగాల్లో చెప్తున్నారు. కానీ, ఈ బుజ్జగింపులేవీ ఫలితాలను ఇవ్వడం లేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్​ నాయకులు వరుసగా బీఆర్​ఎస్​కు గుడ్​బై చెప్తున్నారు. ఈ విషయంలో కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌ కూడా చేతులెత్తేశారు. లిక్కర్​ స్కామ్​లో ఉన్న కవితకు బెయిల్ తేవడం కోసం మూడురోజులుగా ఢిల్లీలోనే ఇరువురు నేతలు మకాం వేశారు. ఇక్కడేమో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ‘కారు’ దిగి వెళ్లిపోతున్నారు.