- రేబల్గా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్న ఆశావహులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం సీటు ‘చే’ జారింది. కాంగ్రెస్, సీపీఐల పొత్తులో భాగంగా ఈ సీటు సీపీఐకి కేటాయించారు. ఆ పార్టీ స్టేట్‌సెక్రటరీ కూనంనేని సాంబశివరావు పోటీ చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ ఆశావహులు రెబల్‌గా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
మొదటి నుంచి హాట్‌టాపిక్‌గా..
కాంగ్రెస్, సీపీఐల పొత్తుల కారణంగా రాష్ట్రంలోనే కొత్తగూడెం సీటు హాట్‌టాపిక్‌గా మారింది. మొదట్లో ఇక్కడి నుంచి మాజీ ఎంపీ, టీపీసీపీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని అందరూ భావించారు. నియోజకవర్గంలోని చుంచుపల్లిలో పొంగులేటి క్యాంప్ ఆఫీస్‌కూడా ఓపెన్ చేశారు. కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూనే అత్యధిక సమయం కొత్తగూడెం నియోజకవర్గంలోనే కేటాయించారు.
కానీ పొంగులేటి పాలేరు నుంచి పోటీలో ఉంటారని తెలిసిన తర్వాత కాంగ్రెస్ ఆశావహులు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు పార్టీల పొత్తులపై పది రోజులుగా ఎటూ తేల్చకపోవడంతో ఇటీవల కాంగ్రెస్ ఆశావహులు ఢిల్లీ స్థాయిలో టికెట్‌కోసం పైరవీలు చేసిన దాఖలాలున్నాయి. నామినేషన్ల ప్రక్రియకు మరో మూడు రోజులు గడువున్న చివరిక్షణంలో పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించడంతో కాంగ్రెస్ ఆశావహులకు నిరాశే మిగిలింది.
టికెట్ కోసం మొదటి నుంచి ఆశపడిన టీసీపీఐ జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ, టీపీసీసీ మెంబర్నాగ సీతారాములు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రెబల్‌గా నామినేషన్లు వేసేందుకు కొందరు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు కాంగ్రెస్ తరుపున మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ పోటీ చేస్తారని ఆయన అనుచరులు ఆశించారు. ఏదేమైనా కొత్తగూడెం సీటుపై క్లారిటీ రావడంతో సీపీఐ తరుపున ఆ పార్టీ స్టేట్ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు ఈనెల 8న నామినేషన్ వేయనున్నారు.
ఆ రెండు డిక్లేర్..
జిల్లాలోని అశ్వారావుపేట, ఇల్లెందు టికెట్లపై కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు సోమవారం రాత్రి క్యాండిడేట్లను డిక్లేర్ చేసింది. ఇల్లందు అభ్యర్థిగా బాజీ ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యను ప్రకటించింది. అశ్వారావుపేట నుంచి జారే ఆదినారాయణను ఫైనల్ చేసింది.