కమ్యూనిస్టులు పోటీ చేసే సీట్లపై క్లారిటీ

  • సీపీఐకి కొత్తగూడెం, సీపీఎంకు వైరా..!
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులకు చెరో సీటు
  • పొత్తు చర్చల్లో దాదాపు కుదిరిన అవగాహన
  • కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్​ 

ఖమ్మం, వెలుగు: కమ్యూనిస్టులు పోటీ చేసే సీట్లపై దాదాపు క్లారిటీ వచ్చింది.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చెరో సీటును సాధించుకున్నాయి. కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా సీపీఐకి కొత్తగూడెం, సీపీఎంకు వైరా సీట్లను ఖరారు చేశారు. దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. కొత్తగూడెంలో సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు,  వైరా నుంచి సీపీఎం నేత భూక్యా వీరభద్రం పోటీ చేయనున్నారు.  అభ్యర్థులను కూడా లెఫ్ట్ పార్టీలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కొత్తగూడెం సెగ్మెంట్ ను మొదటి నుంచి సీపీఐ గట్టిగా కోరుకుంది.  ఇక్కడి నుంచి గతంలో కూనంనేని ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే సీపీఎంకు ఉమ్మడి జిల్లాలో మరో ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో వైరాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

పాలేరు నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేయాలని భావించారు. అక్కడ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్​ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి పోటీ దాదాపు ఫిక్స్​ అయింది. భద్రాచలం సీటు విషయంలోనూ సీపీఎం పట్టుబట్టినా, అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడం,​ అభ్యర్థిగా మళ్లీ ఆయన్నే ప్రకటించడంతో దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. సీపీఎం కేడర్​ బలంగా ఉన్న మరో సీటు మధిర కూడా కాంగ్రెస్​ సిట్టింగ్ సీటు కావడం, అక్కడ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పోటీ చేస్తుండడంతో  వైరాకు ఓకే చెప్పాల్సి వచ్చిందని సమాచారం. 

ఉమ్మడి జిల్లాలో తప్పకుండా పోటీలో ఉండాలన్న ఆలోచనతోనే వైరాలో పోటీకి సీపీఎం ఒప్పుకున్నట్టు తెలిసింది.  నియోజకవర్గాల పునర్విభజనకు ముందు మధిర నియోజకవర్గంలోనే వైరా కలిసి ఉండగా, అక్కడి నుంచి సీపీఎం పలుమార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించింది. పునర్విభజన తర్వాత  వైరా నుంచి సీపీఎం అభ్యర్థి ఇంతవరకు గెలవలేదు. 2009లో సీపీఐ అభ్యర్థి చంద్రావతి గెలవగా, కూటమిలో భాగంగా సీపీఎం మద్దతు పలికింది. 2014లో సీపీఎం సపోర్టుతో వైసీపీ అభ్యర్థి మదన్​ లాల్ గెలవగా, 2018లో సీపీఎం ఆధ్వర్యంలో బీఎల్​ఎఫ్​ కూటమిగా పోటీచేసిన అభ్యర్థి భూక్యా వీరభద్రం ఓడిపోయారు. 

కాంగ్రెస్​ ఆశావహుల్లో నిరాశ

కొత్తగూడెం, వైరా సీట్లు కమ్యూనిస్టులకు కేటాయించనున్నట్లు తెలియడంతో  కాంగ్రెస్​ ఆశావహులకు నిరాశ తప్పలేదు. మొన్నటి వరకు కొత్తగూడం నుంచి పొంగులేటి పోటీచేస్తారని  ప్రచారం జరగ్గా, ఊకంటి గోపాల్రావు, పోట్ల నాగేశ్వరరావు కూడా టికెట్ ఆశించారు. వైరా నుంచి రాందాసు నాయక్, రామ్మూర్తి నాయక్​, విజయాభాయి కాంగ్రెస్​ టికెట్ రేసులో ఉన్నారు. పొత్తులపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత కొందరు నేతలు భవిష్యత్​ కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. రెబల్ గా పోటీచేయాలా, లేక సర్దుకొని పోవాలా అనే అంశంపై కార్యకర్తలతో చర్చిస్తున్నట్టు సమాచారం .