కరోనా టైంలో అండగా ఉన్న... ప్రజలే ఫ్యామిలీ అనుకున్న : ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు

  • 60 వేల మెజారిటీతో గెలుపు ఖాయం
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు

పాలకుర్తి (దేవరుప్పుల), వెలుగు : ‘నలభై ఏండ్ల రాజకీయ జీవితంలో ప్రజలే నా కుటుంబం అనుకున్న.. ఏ ఆపద వచ్చినా, అర్ధరాత్రి తలుపు తట్టినా అక్కున చేర్చుకున్న.. కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు అండగా ఉన్న’ అని పంచాయతీరాజ్‌‌‌‌ శాఖ మంత్రి, పాలకుర్తి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. 

ఈ సందర్భంగా ప్రజలు డప్పు వాయిద్యాలు, మహిళలు కోలాటాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా ఆరు సార్లు గెలిచానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో మంత్రి పదవి కూడా చేపట్టి పాలకుర్తిని రాష్ట్రంలోనే నంబర్‌‌‌‌ వన్‌‌‌‌గా నిలిపానన్నారు. ఐదేళ్లలో రూ. 730 కోట్లతో పాలకుర్తి నియోజకవర్గంలో తాగు, సాగు నీరు, ఆలయాల అభివృద్ధి, ఈసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం వంటి అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. 

కాంగ్రెస్‌‌‌‌ హయాంలో కరెంట్‌‌‌‌ కూడా సరిగా ఉండేది కాదని, నాణ్యమైన రోడ్లు వేయలేకపోయారని, మంచినీటి నల్లా కనెక్షన్‌‌‌‌ కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వచ్చిన తొమ్మిదేళ్లలోనే 24 గంటలు కరెంట్‌‌‌‌, ఇంటింటికీ మిషన్‌‌‌‌ భగీరథ నీళ్లు ఇచ్చామని చెప్పారు. తన రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యుల కంటే ప్రజల మధ్యే ఎక్కువగా గడిపానన్నారు. 
కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ వలస పక్షుల్లాంటి వారని, ఆమెవరో కూడా ప్రజలకు తెలియదని ఎద్దేవా చేశారు. 

తనపై అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఓటు భవిష్యత్‌‌‌‌ను నిర్ణయిస్తుందని, ఎవరికి ఓటు వేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పారు. అలాగే పాలకుర్తి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కుసుమ సోమిరెడ్డి, పెద్ద రామిరెడ్డి, అనిల్, యాకయ్య, తిరుపతి, మలపాక సంతోశ్‌, తీగారం గ్రామానికి చెందిన మారపల్లి స్వామి, విజయ్, ఆంజనేయులు, గణేశ్‌‌‌‌, దండంపల్లి ప్రణయ్ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరగా వారికి మంత్రి కండువాలు కప్పి ఆహ్వానించారు. 

రీల్స్‌‌‌‌ చేసిన మంత్రి

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి దయాకర్‌‌‌‌రావు రీల్స్‌‌‌‌ చేసి ఆకట్టుకున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాలలో పర్యటించిన మంత్రి స్థానిక బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్ల కోరిక మేరకు సోషల్‌‌‌‌ మీడియాలో రీల్స్‌‌‌‌ చేశారు.