రుణమాఫీకి నిధులు రెడీ.. ఇవాళ సాయంత్రానికి రైతుల ఖాతాల్లోకి

రుణమాఫీకి నిధులు రెడీ.. ఇవాళ సాయంత్రానికి రైతుల ఖాతాల్లోకి
  • ఇయ్యాల ఫస్ట్ ఫేజ్ మాఫీ డబ్బులు రిలీజ్ చేయనున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రుణమాఫీలో భాగంగా గురువారం తొలివిడతగా లక్ష రూపాయల లోపు క్రాప్​లోన్లను మాఫీ చేయనున్నారు. రైతుల ఖాతాల్లోకి నిధుల విడుదల చేసిన వెంటనే సెక్రటేరియెట్ నుంచి సాయంత్రం 4 గంటలకు రైతునేస్తంతో వీడియో కాన్ఫరెన్స్​ద్వారా 500 రైతు వేదికల్లో రైతులతో సీఎం మాట్లాడనున్నారు. మాఫీ సొమ్ము జమ ప్రక్రియపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో మాట్లాడినట్లు తెలుస్తున్నది. 

జిల్లాల్లో కలెక్టర్లు, బ్యాంకర్లతో సమావేశమై మాఫీ ప్రక్రియను పరిశీలన చేయనున్నారు. ఆగస్టు 15కల్లా రుణమాఫీ చేసి తీరతామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం మొత్తంగా రూ.31వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. మంత్రివర్గ ఆమోదంతో మాఫీ అమలు మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేయగా కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మరింత క్లారిటీ ఇచ్చారు. లక్ష రూపాయల్లోపు రుణాలను ఈ నెల 18న మాఫీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే బడ్జెట్ విడుదలకు సైతం ఉత్తర్వులిచ్చారు.

మొత్తం రూ.31 వేల కోట్లు అవసరం

ఎఫ్‌‌‌‌ఆర్బీఎం పరిధికి లోబడి తీసుకున్న రుణాలతో పాటు ఇతర నిధులను మాఫీ కోసం సిద్ధంగా ఉంచారు.  రూ.2 లక్షల రుణమాఫీకి మొత్తం రూ.31వేల కోట్లు అవసరం. అందులో లక్ష రూపాయల కంటే తక్కువ ఉన్న రుణాల మొత్తం మూడో వంతు లోపు మాత్రమే ఉంటుందని సమాచారం. వాటిని మాఫీ చేసేందుకు రూ.7వేల నుంచి రూ.8వేల కోట్లు అవసరం ఉంటుందని చెబుతున్నారు. అందుకు సరిపడా మొత్తాన్ని ఆర్థిక శాఖ సిద్ధం చేసినట్లు సమాచారం. 

ఇప్పటికే జులై నెలలో బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.4వేల కోట్లు సమీకరించింది. ఇతర మార్గాల్లో మరో రూ.5 వేల కోట్ల వరకు నిధులను సేకరించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మొదటి దఫా లక్ష రూపాయల్లోపు రుణమాఫీకి అవసరమైన నిధులు సర్కార్‌‌‌‌ వద్ద గత 10 రోజుల కిందటే సిద్ధంగా పెట్టుకున్నది. రెండో విడతలో లక్షన్నర వరకు ఉన్న రుణాలను, తర్వాత మిగిలిన అప్పులను మాఫీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. లక్షన్నర వరకు ఉన్న రుణాల మాఫీకి సైతం మరో రూ.9–10  వేల కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా. మిగిలిన రుణాల మాఫీకి మరో రూ.14 వేల కోట్ల వరకు కావాల్సి ఉంటుందని తెలిసింది.