![ఢిల్లీ చేరుకున్న మరో 3 ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్](https://static.v6velugu.com/uploads/2022/03/As part of ongoing Operation Ganga, 3 more IAF C-17 aircraft landed in Hindan airbase with 630 Indian nationals_2DtSHGfAnY.jpg)
ఉక్రెయిన్ యుద్ధ బీభత్సంలో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను స్వదేశానికి వేగంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు ఉన్న కమర్షియల్ ఫ్లైట్స్ కు తోడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలను కూడా రంగంలోకి దించింది. ఎయిర్ ఫోర్స్ లో అతి పెద్ద ట్రాన్స్ పోర్ట్ విమానమైన సీ17 ద్వారా మన విద్యార్థులను తరలిస్తోంది. నిన్న ఒక్క రోజులోనే నాలుగు ఎయిర్ ఫోర్స్ విమానాల్లో 798 మందిని ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్ బేస్ కు తీసుకొచ్చింది.
ఉదయాన్నే మూడు ఫ్లైట్స్
ఉక్రెయిన్ లో చిక్కుకున్న మరో 630 మంది భారత పౌరులు ఈ రోజు ఉదయం స్వదేశానికి చేరుకున్నారు. రొమేనియా, హంగేరిల్లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల నుంచి నిన్న రాత్రి బయలుదేరిన మూడు సీ17 విమానాలు ఉదయం ఢిల్లీ సమీపంలో హిండన్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యాయి. వీటిలో 630 మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది.
As part of ongoing #OperationGanga, 3 more IAF C-17 aircraft returned to Hindan airbase late last night and early morning today carrying Ukraine conflict affected 630 Indian nationals, using airfields in Romania and Hungary: Indian Air Force pic.twitter.com/RISuRwJyD7
— ANI (@ANI) March 4, 2022
ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మన విద్యార్థులను సేఫ్‌గా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ పేరుతో చర్యలు తీసుకుంటోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారు సరిహద్దు ప్రాంతానికి చేరుకుంటే.. అక్కడి నుంచి హంగేరి, పోలాండ్, రొమేనియా, స్లొవేకియా వంటి పొరుగు దేశాల్లోని ఎయిర్ పోర్టుల నుంచి స్పెషల్ ఫ్లైట్స్‌లో ఇండియాకు చేరుస్తోంది. ఈ క్రమంలో యుద్ధ బీభత్సం మధ్య భారతీయులకు ఎటువంటి హాని చేయకుండా ఉండేలా ప్రధాని మోడీ.. ఉక్రెయిన్, రష్యా దేశాల అధ్యక్షులతో చర్చలు జరిపారు. ఈ మేరకు భారత విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సులకు భారత దేశ జెండాను పెట్టుకొని వెళ్తే హాని చేయబోమని రెండు వైపుల నుంచి హామీ ఇచ్చింది. దీంతో మన విద్యార్థులు ఉక్రెయిన్‌లోని సిటీల నుంచి జాతీయ జెండాలతో సరిహద్దు వరకూ చేరుకోవాల్సిందిగా భారత ప్రభుత్వం సూచించింది. వీరిని పొరుగు దేశాల ద్వారా మరింత వేగంగా ఇండియాకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ ఫ్లైట్స్ తో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అతి పెద్ద ట్రాన్స్ పోర్ట్ విమానం సీ17ను కూడా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది.