వెలుగు, నెట్వర్క్: ప్రజాపాలనలో భాగంగా లబ్ధిదారులు అందించే దరఖాస్తుల్లో అన్ని కాలమ్స్ నింపేలా చూడాలని మహబూబ్నగర్ కలెక్టర్ జి.రవినాయక్ సూచించారు. శుక్రవారం ఆయన హన్వాడ మండలం టంకర, ఎల్లంబాయి తండాల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో పాల్గొన్నారు. దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు.
లబ్ధిదారులకు సంబంధించిన ఫోన్నెంబర్తో పాటు పూర్తి వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు. ఎంపీడీవో ధనుంజయ గౌడ్ తదితరులు ఉన్నారు. అభయహస్తం కింద సామాన్యులకు ప్రయోజనం కలిగేలా చూడాలని గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు. పట్టణంలోని దౌదర్ పల్లిలోని 7, 8, 9వ వార్డులు, బీసీ హాస్టల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.
8వ వార్డు ధరూరు, మార్లబీడు, కేటిదొడ్డి, ఇరుకు చెడి, గంగనపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సరిత పాల్గొన్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఫారాలకు కొరత లేదని వనపర్తి అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తెలిపారు. జిల్లాలోని గోపాల్ పేట మండలం కర్ణమయ్య కుంట, కొత్తకోట మున్సిపాలిటీలో వార్డ్ నెంబర్ 3,11,12ల్లో పర్యటించి దరఖాస్తుల స్వీకరణను పర్యవేక్షించారు.
వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు ఖిల్లాఘనపురం, తదితర మండలాల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి పర్యటించారు. తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి, నాగర్ కర్నూల్ పట్టణంలోని పలు వార్డుల్లో అభయాస్తం కేంద్రాలను ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పరిశీలించారు. అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఉప్పునుంతల మండలంలోని కంసానిపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు.