నల్గొండ అర్బన్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సురక్షా దినోత్సవాన్ని పోలీసులు ఘనంగా నిర్వహించారు. నల్గొండ ఎస్పీ కె. అపూర్వ రావు అధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ తీశారు. జిల్లా పోలీస్ ఆఫీస్ నుంచి వాహన ర్యాలీని జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ కలిసి జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ కళాజాత ఆధ్వర్యంలో షీటీమ్, పోలీసుల పనితీరుపై పాటల రూపంలో వినిపించారు. ర్యాలీలో దాదాపు 1000 మంది సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
సూర్యాపేట : యావత్ భారతదేశంలో ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నది తెలంగాణాలోనే అని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలో జరిగిన కార్యక్రమానికి ఉదయం హాజరయ్యారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాధరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ , డీఎస్పీ నాగభూషణం పాల్గొన్నారు. కొత్త బస్ స్టాండ్ నుంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వరకు పోలీస్ లు ర్యాలీ తీశారు.
యాదాద్రి : భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి 100 మీటర్ల జాతీయ జెండాతో కలెక్టరేట్ వరకు పోలీసులు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ లో పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులను కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ రాజేశ్ చంద్ర, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి సన్మానించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్పీ నవీన్ కుమార్, ఏఓ నాగేశ్వర చారి, పోలీస్ , ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.