జిల్లాలో ప్రారంభమైన రేవంత్‌రెడ్డి పాదయాత్ర
భీంగల్ లింబాద్రి గుట్టపై ప్రత్యేక పూజలు
అనంతరం కమ్మర్‌పల్లిలో రైతులతో ముఖాముఖి
కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుదామని పిలుపు
నిజామాబాద్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ ‘హాత్‌సే హాత్ జోడో యాత్ర’ లో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆదివారం నిజామాబాద్ జిల్లాకు చేరింది. ఈ యాత్రకు బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్ మినహా జిల్లా సీనియర్లీడర్లు ఎవరూ హాజరు కాలేదు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్మహేశ్గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి రేవంత్ నిర్వహించిన రైతు ముఖాముఖికి కూడా దూరంగా ఉన్నారు. జిల్లా ప్రెసిడెంట్ఎంపికపై సీనియర్ల మధ్య ఏర్పడిన విభేదాలు గైర్హాజరుకు కారణంగా కనిపిస్తున్నాయి. ప్రచార కమిటీ చైర్మన్మధుయాష్కీ రాహుల్‌గాంధీ యూరప్ పర్యటనలో ఉండగా, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఒమన్దేశంలో బంధువుల పెళ్లికి వెళ్లారు. మహేశ్‌గౌడ్‘ చలో రాజ్‌భవన్’ కార్యక్రమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని కాంగ్రెస్ పార్టీ లీడర్లు పేర్కొన్నారు. సోమవారం నుంచి ఆరు రోజుల పాటు జరుగనున్న పాదయాత్రకు క్యాడర్ ను తరలించేందుకు కింది స్థాయి లీడర్లే సన్నాహాలు చేస్తున్నారు. సీనియర్ లీడర్ల అనుచరులు కూడా పాదయాత్రకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
హర్యానా రైతులకు తక్కువేం కారు..
పోరాటం, పట్టుదల, పౌరుషంలో నిజామాబాద్ రైతులు హర్యానా రైతులకు తక్కువేం కారని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ కుడి భుజం అని చెప్పుకునే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ ప్రాంతంలో చెరుకు పరిశ్రమను ఎందుకు రీ ఓపెన్ చేయించడంలేదని ప్రశ్నించారు. ఇక్కడి రైతులను ఆదుకోవడంలో మంత్రి విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందో.. లేదో.. చైతన్యం కలిగిన నిజామాబాద్ రైతులు ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సుదర్శన్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు లాంటి గొప్ప లీడర్లు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉండి ఈ ప్రాంతం గౌరవాన్ని పెంచారని, కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ జిల్లా పరువు తీస్తున్నారని విమర్శించారు. ఇక్కడ ఏ దోపిడీ చూసినా ప్రశాంత్ రెడ్డి, గణేశ్, జీవన్ రెడ్డి పేర్లే వినిపిస్తున్నాయన్నారు. ఇసుక దోపిడీ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఇంత అవినీతి పాలన గతంలో ఎప్పుడూ లేదని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్, డీసీసీ ప్రెసిడెంట్మానాల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ తల్లికి విముక్తి కోసమే యాత్ర..
కేసీఆర్ కుటుంబం కబంధ హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణ తల్లికి విముక్తి కలిగించేందుకే కాంగ్రెస్ పార్టీ ‘హాత్‌సే హాత్‌జోడో యాత్ర’ చేపట్టిందని పీసీసీ ప్రెసిడెంట్రేవంత్రెడ్డి అన్నారు. శనివారం రాత్రి బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్‌పల్లికి చేరుకుని అక్కడే బస చేసిన ఆయన ఆదివారం ఉదయం భీంగల్ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యే పూజలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో పలికారు. పూజల అనంతరం ఆశీర్వచనాలు అందించారు. స్వామివారి దర్శనం అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎంతో మహిమ గల లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వయంపాలనతో కూడిన సామాజిక తెలంగాణ సాధించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. తెలంగాణ వచ్చినా ఇక్కడి రైతులను ప్రభుత్వం ఆదుకుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని, తెలంగాణ యువత జీవితాల్లో మార్పు రాలేదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ప్రజల కష్టాలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.